తెలుగులో చాలా అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి ఆ అద్భుతమైన చిత్రాలలో అన్నమయ్య చిత్రం కచ్చితంగా ఉంటుంది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కథ ఒక ఎత్తు అయితే పాత్రలు మరో ఎత్తు. అన్నమయ్యగా నాగార్జున , వెంకటేశ్వర స్వామిగా సుమన్ నటించి మెప్పించారు.
అయితే ఈ రెండు పాత్రలు రిస్క్ తో కూడుకున్నవే. ఎందుకంటే అప్పటికి నాగార్జున రొమాంటిక్ హీరో.. అలాంటి నాగర్జున అన్నమయ్యగా నటించగలడా? అని చాలా మంది పెదవి విరిచారట. అటు నాగర్జున కూడా ఆన్నమయ్యగా తాను నటించగలనా అని ముందుగా సందేహించిరట.
ఇదే విషయాన్ని తన తండ్రి నాగేశ్వరరావు వద్ద ప్రస్తావిస్తే, ‘నువ్వు ఎన్ని సినిమాలు చేసినా, కేవలం హీరో అనిపించుకుంటావు, కానీ, ఇలాంటి సినిమా చేస్తే నటుడు అనిపించుకుంటావు’ అని అనడంతో మరో ఆలోచన లేకుండా నాగార్జున సైతం ‘అన్నమయ్య’ చేసేందుకు ఒప్పుకొన్నారట.
సుమన్‌ను వెంకటేశ్వర స్వామి పాత్రకు ఎంపిక చేయడం వెనుక ఒక కారణం ఉంది. సుమన్ ఎత్తుగా ఉండటంతో పాటు, ఆయన ముక్కు, కళ్లు ఆ పాత్రకు సరిపోతాయని ఊహించారట రాఘవేంద్రరావు. ఆయన ఊహ కరెక్ట్ అయింది. ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ అయ్యారు. ముందుగా ఈ పాత్ర తన వల్ల కాదేమో అని సుమన్ అనుకున్నారట. అయితే, రాఘవేంద్రరావు ధైర్యం చెప్పడంతో ఆయనపై నమ్మకం ఉంచి వేంకటేశ్వరస్వామి పాత్రను చేయడానికి ఒప్పుకొన్నారట సుమన్