విజయేంద్ర ప్రసాద్ ఎంత అద్భుతంగా కథలు రాస్తారో.. అంతకుమించి ఆ కథలను వెండితెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. అందుకే ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా పరాజయం పాలు కాలేదు. విజేంద్రప్రసాద్ , రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి చిత్రం సింహాద్రి. అంకిత భూమిక హీరోయిన్లుగా నటించారు. భానుచందర్ నాజర్ కోట శ్రీనివాసరావు కీలకపాత్రలో నటించారు. 2003 జూలై 9న విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
అయితే ముందుగా ఈ చిత్రాన్ని బాలకృష్ణ కోసం సిద్ధం చేసుకున్నారట విజయేంద్రప్రసాద్. కథను వెళ్లి బాలయ్య కి చెబితే ఆయన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ తర్వాత ఈ కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్ తో తెరకెక్కించారు రాజమౌళి. అయితే అప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం తెరకెక్కింది. ఇక సింహాద్రి చిత్ర కథని కమలహాసన్ నటించిన వసంత కోకిల అనే చిత్రం నుంచి ప్రేరణగా తీసుకున్నారట.
వసంత కోకిల సినిమా క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ ను వదిలివెళ్ళిపోయిన సన్నివేశాన్ని గురించి మాట్లాడుకుంటూ “హీరోయిన్ హీరోని వదిలి వెళ్ళిపోతూంటే, గుండెల్లో గునపంతో పొడిచేసినట్టు లేదూ” అని విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యతో ఈ సినిమా కథకు బీజం పడింది.
ఆ మాట పట్టుకుని ఆయన అసిస్టెంట్ అమ్మ గణేశ్ హీరోని తాను అమితంగా ప్రేమిస్తున్న హీరోయిన్నే గుండెల్లో గునపంతో పొడిచినట్టుగా కథ రాసుకుందాం అనడంతో అలా చేసేందుకు దారితీసే కారణాలు ఏమిటన్న పద్ధతిలో ఈ కథ రాసుకున్నారు. అయితే కథలో కీలకమైన ఫ్లాష్ బాక్ కు వేరేదైనా ప్రదేశాన్ని నేపథ్యంగా తీసుకోవాలని భావించి కేరళను ఎంచుకున్నారు.