వందే భారత్ రైలు నేడే ప్రారంభం

తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుక. సికింద్రాబాద్ టు వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా పచ్చజెండా ఊపి ఈ ట్రెయిన్‌ను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి సికింద్రాబాద్ స్టేషన్‌లో రైలు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సోమవారం నుంచి వందే భారత్ ట్రెయిన్ రన్ అవుతుంది వారంలో ఆరు రోజులు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం సర్వీస్ ఉంటుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. సోమవారం ఉదయం 5.45 గంటలకు వైజాగ్‌లో ప్రారంభమై.. మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అదే రోజు సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి అర్ధరాత్రి 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది. దేశంలో ఇది ఎనిమిదో వందే భారత్ రైలు. దక్షిణ భారత దేశంలో ఇది రెండో సర్వీస్.
కేసీఆర్‌పై మండిపడ్డ కిషన్‌రెడ్డి

దేశ ప్రతిష్ఠ, గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడటం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇలాగే మత విద్వేషాలను రెచ్చగొడితే దేశం అఫ్గానిస్తాన్‌లా మారినా ఆశ్చర్యం లేదన్నారు. ‘‘దేశ సైనికుల గొప్పదనాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారు. పటిష్ఠమైన మన ఆర్థిక వ్యవస్థను పాకిస్థాన్, శ్రీలంకతో పోలుస్తారు. ఇప్పుడు అఫ్గానిస్తాన్ అంటారు.. ఇదేం పద్ధతి..? ప్రధాని మోదీని విమర్శించండి. కానీ దేశ గౌరవాన్ని తగ్గించవద్దు..’’ అని కేసీఆర్‌కు హితవు పలికారు. తండ్రిని అడ్డుపెట్టుకొని తాను మంత్రిని కాలేదని పరోక్షంగా కేటీఆర్‌పై మండిపడ్డారు.
వ్యవసాయం పండుగైతే.. అదే సంక్రాంతి : కేసీఆర్
తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే భారతదేశానికి సంపూర్ణక్రాంతి చేకూరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురసరించుకొని సీఎం కేసీఆర్ దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పంటపొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి.. నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ’ అన్నారు.
స్విట్జర్లాండ్ వెళ్లిన కేటీఆర్

ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సు-2023లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ సారధ్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం శనివారం సాయంత్రం బయలుదేరి వెళ్లింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఈ సదస్సు జరుగనుంది. సముద్ర మట్టానికి 1,560 మీటర్ల ఎత్తులో ఉన్న దావోస్‌లోని ఆల్పైన్ రిసార్ట్ టౌన్ ఈ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ ఏడాది సదస్సును ‘కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్‌మెంటెడ్ వరల్డ్’ అనే థీమ్‌పై నిర్వహిస్తున్నారు. సదస్సులో ఏర్పాటుచేసిన తెలంగాణ పెవిలియన్‌లో ప్రపంచ అగ్రగామి సంస్థల అధిపతులతో కేటీఆర్ సమావేశమవుతారు.
కేంద్ర మంత్రి నిర్మలకు కేటీఆర్ లేఖ
తెలంగాణకు మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునే టైమొచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ఈసారి కేంద్ర బడ్జెట్లో తగినన్ని నిధుల సహకారం అందించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు. ఈ లేఖలో.. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్ మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు అంచనాలు రూ.9,500 కోట్లుగా ఉన్నాయని, ఇందులో కనీసం రూ.500 కోట్లను కేటాయించాలన్నారు. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌లకు నిధులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు.
కుక్క దాడితో చనిపోయిన స్విగ్గీ డెలీవరీ బాయ్
బంజారాహిల్స్‌లో పెంపుడు కుక్క దాడి లో స్విగ్గీ డెలీవరీ బాయ్ చనిపోయాడు. బంజారాహిల్స్ లోని రోడ్ నం.12లోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ మూడేండ్లగా స్విగ్గీ లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆర్డర్ ప్రకారం అయిదు రోజుల కిందట లుంబినీ రాక్ కాజిల్ అపార్ట్‌మెంట్స్‌లోని మూడో ఫ్లోర్‌లో ఉంటున్న శోభన నాగానికి ఫుడ్ పార్సల్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. డోర్ కొట్టగానే.. లోపల ఉన్నజర్మన్ షెఫర్డ్ కుక్క అతడి మీదకు వచ్చింది. భయాందోళనతో రిజ్వాన్ పరుగెత్తి రెయిలింగ్ మీద నుంచి కిందపడ్డాడు. ఫ్లాట్ యజమాని శోభన స్థానికుల సాయంతో అతడిని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రిజ్వాన్ చనిపోయాడు. ఘటనకు కారణమైన శోభన నాగానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
భోగి వేడుకలు నిర్వహించిన జాగృతి

భారత జాగృతి ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కువద్ద బోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున భోగిమంటలు వెలిగించి ఆటపాటలతో సందడి చేశారు. తెలుగు సంస్కృతిలో భాగమైన గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, కోలాటాల సందడితో కేబీఆర్ పార్కు ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..తెలంగాణ జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పామని, బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు తర్వాత తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చామన్నారు. టీఎస్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, భారత జాగృతి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్, మారిషస్ తెలుగు మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.
జమిలీ ఎన్నికలకు ఓకే చెప్పిన ఏఐఏడీఎంకే
‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలకే తమిళనాడులోని అన్నాడీఎంకే జైకొట్టింది. దేశంలో ఒకే సమయంలో లోక్‌సభ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సముచిత నిర్ణయమే అవుతుందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి న్యాయశాఖకు వివరించారు. ఈ జమిలి ఎన్నికలపై కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, న్యాయ మండలి అన్ని రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్న విషయం తెలిసిందే.