రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించనున్న బీఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దురదృష్టకర విధానాలతో దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రగతిభవన్‌లో పార్టీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలను, పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాల్లో ఎండగట్టాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. బిఆర్ఎస్ పార్టీతో కలిసివచ్చే పార్టీలను కలుపుకుని కేంద్రాన్ని ఉభయ సభల్లో నిలదీయాలని కేసీఆర్ ఎంపీలకు సూచించారు. దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశం అనేక అంశాలను చర్చించింది. ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి, దీవకొండ దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాలోత్ కవితా నాయక్, పసునూరి దయాకర్, బొర్లకుంట వెంకటేశ్, పోతుగంటి రాములు ఇందులో పాల్గొన్నారు.
పోలీస్ రాత పరీక్షలో ఏడు మార్కులు కలిపిన టీఎస్ఎల్పీఆర్బీ
పోలీసు అభ్యర్థుల అర్హత పరీక్షకు సంబంధించి తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో పోలీస్ రాత పరీక్షలో తప్పుగా ఉన్న ఏడు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలుపుతున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ మార్కులు కలపడటంతో ఉత్తీర్ణులైన అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేయనుంది. వీరికి ఫిబ్రవరి 15 నుంచి పోలీస్ ఈవెంట్స్ నిర్వహిస్తారు.
బడ్జెట్ మీటింగ్‌కు అనుమతి తెలపని గవర్నర్
గవర్నర్ రాష్ట్ర సర్కారు మధ్య మరో వివాదం మొదలైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఇప్పటికీ అనుమతి తెలుపలేదు. ఉభయ సభల సమావేశం నిర్వహిస్తున్నారా.. తన స్పీచ్ ఉందా.. లేదా ఉంటే ప్రసంగ ప్రతిని తనకు పంపించాలని గవర్నర్ బడ్జెట్ సమావేశాల ఫైలుపై కొర్రీలు రాసి ప్రభుత్వానికి తిప్పి పంపినట్లు తెలిసింది. గత ఏడాది గవర్నర్ స్పీచ్ లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈసారి కూడా అదే పద్ధతి అనుసరించటంతో గవర్నర్ అభ్యంతరాలే లేవనెత్తినట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవటంపై ఈ రోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనుంది.
ఒడిశా మినిస్టర్‌పై కాల్పులు.. దుర్మరణం

ఒడిసా హెల్త్ మినిస్టర్ నబకిశోర్ దాస్ హత్యకు గురయ్యారు. పోలీసు శాఖలో పనిచేసే ఓ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆయనపై కాల్పులు జరిపారు. వెంటనే కుప్పకూలిపోయిన మంత్రి హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపు చనిపోయారు. ఝార్సుగూడ జిల్లా బ్రిజరాజ్‌నగర్‌లోని గాంధీచౌక్ వద్ద బీజేడీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ దుర్ఘటన జరిగింది. మంత్రి గాంధీచౌక్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తూ.. తన కారు దిగుతుండగా, యూనిఫాంలో ఉన్న ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ తన సర్వీస్ రివాల్వర్‌తో ఆయనపై కాల్పులు జరిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ హత్యకు కారణాలింకా బయటకు వెల్లడి కాలేదు.
గుజరాత్ పేపర్ హైదరాబాద్‌లో లీక్
గుజరాత్‌లో పంచాయతీ జూనియర్ క్లర్క్ నియామకానికి చేపట్టిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం హైదరాబాద్‌లో లీక్ అయింది. హైదరాబాద్ ఐడీఏ బొల్లారంలోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రం బయటకొచ్చింది. దీనికి సంబందించి గుజరాత్ ఏటీఎస్ పోలీసులు మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు ప్రదీప్ నాయక్, కేతన్ బరోట్, హైదరాబాద్‌లోని కేఎల్ హైటెక్ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి జీత్ నాయక్, భాస్కర్ చౌదరి, రిద్ధి చౌదరి ఉన్నారు. గుజరాత్‌లో 1,181 పోస్టులకు సుమారు 9.53 లక్షల మంది అభ్యర్థులు ఆదివారం ఈ పరీక్ష రాయాల్సి ఉంది.
టీచర్ల బదిలీలకు 40 వేలు దాటిన అప్లికేషన్లు
ఉపాధ్యాయ బదిలీల కోసం రెండో రోజైన ఆదివారం నాటికి మొత్తం 40,882 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా అందాయి. ఇప్పటివరకు అత్యధికంగా నల్గొండ జిల్లా నుంచి 2,790 వచ్చాయి. దరఖాస్తు గడువు సోమవారం వరకు ఉంది. అయితే సాఫ్ట్‌వేర్ సమస్యల వల్ల సమయం సరిపోదని, గడువును ఫిబ్రవరి 1 వరకు పొడిగించాలని విద్యాశాఖ కార్యదర్శిని టీఎస్‌యూటీఎఫ్ కోరింది.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ఫస్టియర్‌లో 70% సిలబస్సే
ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మొదలయ్యే ప్రాక్టికల్స్ ఫస్టియర్‌లో 70%, సెకండియర్‌లో 100% సిలబస్ ఆధారంగా జరుగుతాయని ఇంటర్‌బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలకు మాత్రం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 100% సిలబస్ ఉంటుందని పేర్కొంది
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉన్నట్లు సినీనటుడు బాలకృష్ణ తెలిపారు. తారకరత్నను పరామర్శించేందుకు ఆదివారం ఉదయమే బాలకృష్ణ సతీమణి వసుంధర, లోకేశ్ సతీమణి బ్రాహ్మణి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్, సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ వచ్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు.