ఢిల్లీలో ఓపెనైన బీఆర్​ఎస్​.. కరీంనగర్​లో నేడు బీజేపీ బహిరంగ సభ.. ఆందోళనలో కాంగ్రెస్​.. ఈరోజు టాప్​ న్యూస్​

ఢిల్లీలో ప్రారంభమైన బీఆర్​ఎస్​ ఆఫీస్​

ఢిల్లీ లో బీఆర్​ఎస్​ ఆఫీసు ప్రారంభమైంది. బీఆర్​ఎస్​ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ పార్టీ జెండాను ఎగరవేసి ఆఫీసును ప్రారంభించారు. సీఎం కేసీఆర్​ దంపతులు ఈ సందర్భంగా యాగం నిర్వహించారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడు విసికె పార్టీ అధ్యక్షుడు, ఎంపి తిరుమావళవన్, జాతీయ కిసాన్ నేత గుర్నామ్ సింగ్ తో పాటు పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ పార్టీ అనుబంధంగా భారత రాష్ట్ర కిసాన్​ సమితి ని ఏర్పాటు చేశారు. కిసాన్ సెల్ అధ్యక్షునిగా, హర్యానా కురుక్షేత్ర కు చెందిన జాతీయ రైతు సంఘం నేత, గుర్నామ్ సింఘ్ చడూని నియమిస్తూ కేసీఆర్​ తొలి సంతకం చేశారు. కార్యాలయ కార్యదర్శి గా రవి కొహార్ ను నియమించారు.

హైదరాబాద్​లో బోష్​ ఆఫీసు ప్రారంభించిన కేటీఆర్​

ఢిల్లీలో జరిగిన బీఆర్​ఎస్​ ఆఫీసు ప్రారంభ వేడుకలకు మంత్రి కేటీఆర్​ దూరంగా ఉన్నారు. ముందుగా ఖరారైన ప్రోగ్రాంలు ఉండటంతో ఆయన హైదరాబాద్​లోనే ఉన్నారు. బుధవారం ఉదయం రాయదుర్గంలో బోష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీ కొత్త కార్యాలయాన్నిమంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్ తెలంగాణలో మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లోనే ఉన్నాయని.. గడిచిన ఏడాది కాలంలో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి ప్రకటించారు. ఇండియాలో మూడ‌వ వంతు ఉద్యోగాలు హైద‌రాబాద్‌లో క్రియేట్ అయిన‌ట్లు చెప్పారు. బోష్ అతిపెద్ద కంపెనీ అని, న్యూ ఏజ్ మొబైల్స్‌, కార్లలోనూ సాఫ్ట్‌వేర్ పెరుగుతోంద‌న్నారు. ఆటోమోటివ్ రంగంలో బోష్ మ‌రింత రాటుదేలుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

నేడు కరీంనగర్​లో బీజేపీ బహిరంగ సభ

బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్​ అయిదో విడత పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా కరీంనగర్​లో ఏర్పాటు చేసిన ముగింపు సభకు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు నడ్డా హైదరాబాద్ చేరుకోనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి 3.30కి కరీంనగర్ చేరుకుంటారు. పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్​ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు.

బీఆర్​ఎస్​ వైరస్​.. బీజేపీ వ్యాక్సిన్​: బండి సంజయ్​

బీఆర్ఎస్ అనేది ఓ వైరస్ అయితే.. బీజేపీ వ్యాక్సిన్ అని.. ప్రజలు వ్యాక్సిన్​నే కోరుకుంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ఫాం హౌస్ కేసులో ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరిపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. కొన్ని పార్టీలు ఏసీ రూముల్లో కూర్చుని పార్టీ ఎజెండాలు తయారు చేస్తున్నారని.. కానీ తాము జనాల్లో తిరిగి వారి సమస్యల పరిష్కారం కోసం ఎజెండా తయారు చేస్తున్నట్లు తెలిపారు. తన పాదయాత్రకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తోందని బండి సంజయ్ తెలిపారు. రోజులో 18 గంటల పాటు దేశం కోసం పనిచేస్తున్న మోడీ స్ఫూర్తితో పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. 

స్ట్రాటజీ రూమ్​ సీజ్​ వివాదం.. కాంగ్రెస్ ఆందోళన

కాంగ్రెస్​ స్ట్రాటజీ వార్​ రూమ్​ను పోలీసులు దాడి చేసి సీజ్​ చేయటంపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​ ఆందోళనకు దిగింది. పోలీసులను అడ్డం పెట్టుకొని సీఎం కేసీఆర్​ సాగించిన ఈ దౌర్జన్యంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. పీసీసీ ఆందోళనలకు పిలుపునివ్వటంతో సీనియర్​ నేతలు షబ్బీర్​ అలీ, మల్లు రవిలను పోలీసులు ఇళ్ల వద్దే నిర్బంధించారు. గాంధీభవన్​కు చేరుకున్న నేతలు, మహిళా కాంగ్రెస్​ నాయకులు ప్రగతి భవన్​ వరకు ప్రదర్శన చేయాలని భావించారు. అక్కడే గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖైరతాబాద్​ కార్పోరేటర్​ విజయా రెడ్డి తన అనుచరులతో పోలీస్​ కమాండ్​ కంట్రోల్ సెంటర్​ ముట్టడికి యత్నించారు.

తెలంగాణకు మరో రెండు అవార్డులు

మాతా శిశు సంరక్షణలో రాష్ట్రానికి కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మరో రెండు జాతీయ అవార్డులను ప్రకటించింది. బుధవారం ఢిల్లీలో ‘నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్’లో కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ చేతుల మీదుగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ (మెటర్నల్ హెల్త్) డాక్టర్ ఎస్. పద్మజ ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 2014లో 92 గా ఉన్న ఎంఎంఆర్ ఇప్పుడు 43కు తగ్గటం గొప్ప విషయమని కొనియాడారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ వైఫరీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించిందని ఆయన తెలిపారు.

ఎస్సై ఈవెంట్స్ లో పాసైన తల్లీకూతుళ్లు

ఖమ్మం జిల్లాకు చెందిన తల్లీకూతుళ్లు ఇద్దరూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇద్దరూ పోటీ పడి తెలంగాణ ఎస్​ఐ ఈవెంట్స్​లో పాస్​ అయ్యారు. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల నాగమణి, తోళ్ల త్రిలోకిని ఇటీవలే ఎస్​ఐ రిక్రూట్ మెంట్​ ప్రిలిమ్స్ పరీక్షలో నెగ్గారు. రెండో రౌండ్​లోని రన్నింగ్​, లాంగ్​ జంప్​, షాట్​ ఫుట్​ ఈవెంట్లలోనూ ఇద్దరూ క్వాలిఫై అయ్యారు. మెయిన్స్​ ఎగ్జామ్​ కూడా మెరిట్​ సాధిస్తే.. ఇద్దరూ ఎస్​ఐ ఉద్యోగాలు సాధించనున్నారు. నాగమణి హోంగార్డుగా పోలీస్​ విభాగంలో చేరి.. సివిల్​ కానిస్టేబుల్​ అయ్యారు. ప్రస్తుతం ములుగు జిల్లాలో డ్యూటీ చేస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన నాగమణికి ఎలాగైనా ఎస్ ఐ జాబ్​ సాధించాలని పట్టుదలతో కష్టపడింది. తన కూతురు త్రిలోకినిని పెద్ద పోలీసాఫీసర్​ చేయాలని కలలు కంది. ఇటీవల పోలీస్​ రిక్రూట్​మెంట్ నోటిఫికేషన్ కలిసొచ్చిన అవకాశంగా భావించింది. తన కూతురితో పాటు తను అప్లై చేసింది. ఇద్దరూ ప్రిలిమ్స్ రాత పరీక్షలో నెగ్గారు. ప్రతి రోజూ తన కూతురిని వెంట పెట్టుకొని గ్రౌండ్ కు తీసుకెళ్లీ తనకున్న అవగాహనతో ఈవెంట్స్​ ప్రాక్టీస్​ చేయించింది. తల్లికూతుళ్లకి ఒకే రోజు ఈవెంట్స్ కావడం, ఒకే బ్యాచ్ రావడం.. ఇద్దరూ పోటీ పడీ ఈవెంట్స్​లో అర్హత సాధించటంతో.. తల్లీ కూతుళ్ల ప్రతిభను చూసి పోలీస్​ ఆఫీసర్లు అభినందించారు.

ఓయూలో సివిల్​ సర్వీసెస్​ అకాడమీ

ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా సివిల్ సర్వీసెస్ అకాడమీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్​ రవీందర్, హయ్యర్​ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి,, రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు నవీన్ మిట్టల్, బీ. వెంకటేశం, వాకాటి కరుణ, ఘంటా చక్రపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంతులు చిమ్మిన ఉల్కాపాతం

జెమినిడ్స్ ఉల్కాపాతం ఆకాశంలో కాంతులు వెదజిమ్మింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆకాశంలో కనిపిస్తున్న జెమినిడ్స్ ఉల్కాపాతం బుధవారం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రాత్రి 9 గంటల తర్వాత ఉల్కాపాతం మరింత స్పష్టంగా కనిపించిందని ప్లానెటరీ సొసైటీ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ ఎస్.రఘునందన్ రావు తెలిపారు. డిసెంబరు 17వ తేదీ వరకు ఈ ఉల్కాపాతం కనిపిస్తుందన్నారు. వీటిని డైరెక్ట్ గా చూస్తే ఎలాంటి ముప్పు ఉండదని రఘు  అన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here