సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అది హైదరాబాద్ అని స్ఫురించాలి.
అందుకు ఏం చేయాలి?
సింపుల్‌గా చార్మినార్ చూపిస్తే సరి.
తేలిగ్గా అర్థమైపోతుంది ఆ కథాస్థలం హైదరాబాదని.
దాదాపు నాలుగొందల ఏళ్ల నుంచి హైదరాబాద్‌కు ఓ ఐకన్‌గా ఉంది చార్మినార్.
కుతుబ్‌షాహీ వంశానికి చెందిన రాజు కులీకుతుబ్‌షా 1591లో దాన్ని నిర్మించాడనీ, ప్లేగు వ్యాధి తగ్గిన తర్వాత దేవుడికి కృతజ్ఞత చెప్పేందుకు నిర్మించిన కట్టడం అని అందరికీ తెలుసు. దీనిపై అనేక వాదనలున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే… కుతుబ్‌షాహీల రేవు పట్టణం నుంచి వచ్చే దారి… నగరంలోని ప్రధాన రహదారి రెండూ ఖండించుకోవడంతో ఏర్పడ్డ కూడలే చార్మినార్ అన్నది మరోమాట.
ఇక్కడ ఓ వాడుక ఉంది… ‘చార్మినార్‌లో రాయి వాడలేదు… మక్కామసీదులో సున్నం వాడలేదు’ అంటారు. కానీ రాయన్నదే లేకుండా సున్నంతోనే పూర్తిగా నిర్మితమై లేదనీ కొంత గ్రానైట్ కూడా ఉందనేది నిపుణుల మాట.
ఇలా కేవలం సున్నంతో నిర్మితమైన చార్మినార్… అలా నాలుగొందల ఏళ్ల పైచిలుకు కాలమంతా అలా ఠీవిగా నిల్చుని ఉంది. అమృతం తాగిన కట్టడంలా అన్నేళ్ల నుంచి అదలా అలరారుతూ ఉందంటే చిత్రమే కదా. అలాంటి చిత్రాలు చార్మినార్‌లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ కావాలా… గోల్కొండ సామ్రాజ్యం… కుతుబ్‌షాహీల నుంచి ఆసఫ్‌జాహీల చేతికి వెళ్లే సంధిదశలో ఓసారి నైరుతి (సౌత్–వెస్ట్) మూలనున్న ఓ మినార్ మీద పిడుగు పడిందట. దాంతో అది ముక్కముక్కలైపోయిందట. ఆ సమయంలోని పాలకులు ఆ మినార్‌ను మళ్లీ కట్టారట. అంతేనా… 1824లో దాన్ని మరోమారు పూర్తిగా రిపేరు చేశారట.
మూసీ నదికి తూర్పున ఉందీ చార్మినార్. దాని పడమట దిక్కున లాడ్ బజార్. రెండడుగులేస్తే… మక్కామసీదు. అన్నీ అపురూప స్థలాలే. అసలే నిజాం సంస్థానానికంతా అది కూడలి. అలాగే రాజధానిలోనూ ప్రధాన కూడలి. ఎలా రహదారులే గాక…సంస్కృతులకూ కూడలి కావడం, ఆ ప్రాథమ్యం దశాబ్దాల తరబడి ఉండటంతో నేటికీ అంతే ప్రాధాన్యంతో నిటారుగా నిలబడి ఉంది.
ఈ నిర్మాణంలో ఎన్నో నడవాలు, గ్యాలరీలు, బాల్కనీలు, నెత్తిన నాలుగు మినారెట్లు… గోడల మీద చిత్రవిచిత్రపూల నగిషీలు… ఇలా ఎన్నెన్నో విచిత్రాలు. వీటన్నింటినీ నిర్మించడానికి కొంత గ్రానైట్ రాతిపొడితో పాటు, సున్నం, మోర్టార్, పాలరాతిపొడి… పొడిరూపంలో ఉన్న ఈ మిశ్రమాన్ని నీళ్లుకలిపిన సిమెంట్‌లా ముద్ద చేయడానికి… కోట్లాది కోడిగుడ్ల సొన వాడారట. దానిలో ఉన్న పదార్థమంతా కలిపితే ఉండే బరువెంతో తెలుసా… 14,000 టన్నులు!!
నాలుగు శతాబ్దాల కిందట ఇసుక గడియారాలూ, ఇంకేవో గడియారాలూ ఉండి ఉంటాయి. కానీ మెకానికల్‌గా నడిచే గడియారాలు వచ్చిననాటి నుంచి టైమ్ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నాలుగు పక్కలా నాలుగు గడియారాలు ఏర్పాటు చేశారు… అదీ 1889లో.
నలువైపులా అన్నీ దుకాణాలతో అంతటా సందడి సందడిగా ఉండే పరిసరాలతో… ఆ ప్రాంతంలో ఉన్న దుకాణాల సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 14,000కు పైగానే.
14,000 టన్నుల బరువుతో రూపొందిన కట్టడం చుట్టూ కనీసం 14,000 షాపుల్లేకపోతే ఎలా అన్నది జనంలో ఉన్న మరోమాట.
చార్మినార్‌ను సంస్మరించుకుంటూ దాని ఆకృతిలోనే కేక్ నిర్మిస్తాడొకడు.
అదే షేప్‌లోసముద్రపుటొడ్డున సైకత కట్టడం కడతాడు మరొకడు.
చాక్లెట్‌తో నిర్మాణం చేసి, మా కంపెనీ ఉత్పాదనకు అడ్వరై్టజ్ కల్పిస్తామంటాడో కార్పొరేటు.
దానిపై పద్యాలు రాస్తానూ, పాటలు పాడతానంటాడు ఇంకొకడు.
ఇలా ఎందరెందరిలోనో సృజనను రగిలించి, వెలికితీసేలా చేసిన కట్టడం అది.
రెండు తరాల వెనక…
కొత్తగా ఆటలు మొదలుపెట్టిన బచ్చాలంతా చార్మినార్ సిగరెట్ పత్తాలతోనే
బెచ్చాలాడారు… గిల్లికజ్జాలాడారు.
కొత్తగా సిగరెట్ అలవాట్లు నేర్చుకున్న యువత…
చార్మినార్ తాగారు… విశ్రాంతి పొందారు.
కొత్తగా ఇళ్లు కట్టాలనుకున్న రామయ్యలంతా సుదీర్ఘంగా ఆలోచించాక…
చార్మినార్ బ్రాండ్ సిమెంట్ రేకులతోనే ఇంటివాళ్లయ్యారు.
అదెంతో నాలుగొందలేళ్లదైనప్పటికీ… ఎంతగా పాతబడుతున్నప్పటికీ…
రెండు తరాల వెనకవారేగాదు… మరో రెండొందల తరాల వరకూ
అదెప్పుడూ కొత్తగానే ఉంటుందంటూ తీర్మానాలు చేస్తున్నారు.