కేసీఆర్​కు కడుపు నొప్పి.. హాస్పిటల్​లో ట్రీట్మెంట్​.. టీఎస్​పీఎస్​సీ పేపర్​ను రూ.14 లక్షలకు అమ్ముకున్నారు.. బండి సంజయ్​పై ఎంపీ అర్వింద్​ ఫైర్​.. 16వ తేదీ నుంచి వానలు.. నేడే ఎమ్మెల్సీ ఎలక్షన్​.. ఈ రోజు నుంచే పార్లమెంట్​.. టాప్​ టెన్​ న్యూస్​ ఇవే

కేసీఆర్​కు అస్వస్థత.. ఏఐజీలో ట్రీట్ మెంట్​

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కడుపులో అల్సర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన పదిరోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. గ్యాస్ట్రిక్‌ సమస్యగా వైద్యులు నిర్ధారించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్​లో డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి కేసీఆర్‌కు పరీక్షలు నిర్వహించారు. సీటీస్కాన్‌తో పాటు ఎండోస్కోపీ చేసి కడుపులో చిన్నపాటి అల్సర్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇంజెక్షన్లు, మెడిసిన్​ ఇచ్చి కేసీఆర్​ను రెండు గంటల పాటు హాస్పిటల్ లోనే అబ్జర్వేషన్లో ఉంచారు. నెల రోజుల పాటు మందులు వాడాలని సూచించారు. ఈ వివరాలన్నింటినీ ఏఐజీ హాస్పిటల్​ హెల్త్ బులెటిన్​ రిలీజ్ చేసింది. కేసీఆర్‌కు వచ్చిన అల్సర్‌ కూడా సాధారణ ఆరోగ్య సమస్యేనని, మందులు వాడితే తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని గవర్నర్‌ తమిళిసై ట్వీట్‌ చేశారు.

టీఎస్​పీఎస్సీ పేపర్​ రూ.14 లక్షలకు బేరం

​ టీఎస్‌పీఎస్సీ పేపర్​ లీక్​ గుట్టు రట్టయింది. టీఎస్‌పీఎస్సీలో పని చేసే ఇద్దరు ఉద్యోగులే కీలక నిందితులని పోలీసుల విచారణలో బయటపడింది. ఒక యువతి కోసం.. క్వశ్చన్ పేపర్‌‌ను రూ.14 లక్షలకు అమ్ముకున్నారని తెలుస్తోంది. ఈ కేసులో కమిషన్​ సెక్రటరీ దగ్గర పని చేసే పీఏ ప్రవీణ్‌తోపాటు టీఎస్‌టీఎస్ ఉద్యోగి రాజశేఖర్ తో పాటు మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ప్రవీణ్‌‌‌‌కు ప్రభుత్వ ఉద్యోగి రేణుకతో పరిచయం ఉంది. ప్రవీణ్‌‌‌‌ను కలిసేందుకు ఆమె రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా టీఎస్‌‌‌‌పీఎస్సీ ఆఫీస్‌‌‌‌కి వస్తూ ఉండేది. తన తమ్ముడు ‘టౌన్ ప్లానింగ్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ ఓవర్‌‌‌‌సీస్‌‌‌‌’ ఎగ్జామ్ రాస్తున్నాడని, ఎలాగైనా పేపర్‌‌‌‌‌‌‌‌ తనకు ఇవ్వాలని ప్రవీణ్​ తో రాయబారం నడిపింది. ఆమె కోసమే ప్రవీణ్​ తన మిత్రుడు అడ్మిన్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ సహకారంతో ఈ లీకేజీ ప్లాన్​ చేశాడు. ఇద్దరూ కలిసి.. సెక్షన్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ శంకరమ్మ సిస్టమ్‌‌‌‌లోని పేపర్‌‌‌‌‌‌‌‌ను దొంగిలించారు. ఆఫీస్‌‌‌‌లో ఎవరూ లేనపుడు ఆమె సిస్టమ్​లోని పేపర్‌‌‌‌‌‌‌‌ను పెన్‌‌‌‌డ్రైవ్‌‌‌‌లో డౌన్‌‌‌‌లోడ్ చేసుకున్నారు. అదే పేపర్‌‌‌‌‌‌‌‌ను ప్రవీణ్​ రేణుకకు అందించాడు. రేణుక తన తమ్ముడితో పాటు ఆ ఎగ్జామ్ ఎవరెవరు రాస్తున్నారనో తెలుసుకొని అమ్మకానికి పెట్టింది. తన ఊరి సర్పంచ్ కొడుకు రాస్తున్నాడని తెలుసుకుని, అతని ద్వారా ముగ్గురికి పేపర్ బేరం పెట్టినట్టు సమాచారం. మొత్తం రూ.14 లక్షలకు అమ్మగా.. అందులో 10 లక్షలు ప్రవీణ్ కు ఇచ్చింది. రేణుక దగ్గర పేపర్ కొన్న సర్పంచ్‌‌‌‌ కొడుకు, ఇంకో ఇద్దరు రూ.లక్ష ఇస్తే పేపర్ జిరాక్స్‌‌‌‌ కాపీ ఇస్తామని మరికొందరికీ అమ్మకానికి పెట్టారు. అదే ఊరికి చెందిన కొందరు అభ్యర్థులు.. టీఎస్‌‌‌‌పీఎస్సీ ఆఫీసుతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం బయటపడింది.

సంజయ్​ పై అరవింద్​ ఫైర్​

ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన కామెంట్లను బీజేపీ ఎంపీ అరవింద్​ తప్పుపట్టారు. ‘వాటిని నేను సమర్థించను. అవి ఆయన వ్యక్తిగతం. బీజేపీకి, ఆ కామెంట్లకు సంబంధం లేదు. ఆయన మాట్లాడిన దానికి ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాలి. తెలంగాణలో మస్తు సామెతలు ఉంటాయి. అవి వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’’ అని ఎంపీ అర్వింద్​ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్​ కవిత ఒత్తిడి కారణంగానే ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై ఈడీకి ఇచ్చిన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నాడని ఆరోపించారు. ఈడీ విచారణకు కవిత సహకరించడం లేదని అభిప్రాయపడ్డారు.

16 నుంచి వర్షాలు

రాష్ట్రంలో పెరిగిన ఎండల నుంచి త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఈ నెల 16 నుంచి తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. చత్తీస్ ఘడ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి ఆవరించడంతో  రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. దీంతో 20వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది.

ఇయ్యాలే ఎమ్మెల్సీ ఎలక్షన్​ పోలింగ్​​

మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ఈ రోజు జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో  ఉన్నారు. 9 జిల్లాల పరిధిలో  29,720 మంది ఓటర్లు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి,  పీఆర్టీయూ టీఎస్​అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఏవీఎన్​ రెడ్డి, ​ఎస్టీయూ అభ్యర్థి భుజంగరావు, బీసీటీఏ అభ్యర్థి విజయకుమార్, టీఎస్టీసీఈఏ అభ్యర్థి సంతోష్ కుమార్, కాంగ్రెస్ మద్దతుతో హర్షవర్ధన్ రెడ్డి, టీపీటీఎఫ్ మద్దతుతో వినయకుమార్ తదితరులు ఈసారి పోటీలో ఉన్నారు. అయితే మూడోసారి గెలిచి హ్యాట్రిక్​ సాధించాలనే పట్టుదలతో సిట్టింగ్ ఎమ్మెల్సీ  జనార్దన్​ రెడ్డి ఉన్నారు.  పీఆర్టీయూతో పాటు మరో 35 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతు తనకుందని, తన విజయం నల్లేరుపై నడకేనని చెన్నకేశవరెడ్డి చెప్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినా.. తాను టీచర్ల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నానని ఈసారి తప్పక విజయం సాధిస్తాననే విశ్వాసంతో యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఉన్నారు. సర్కారుపై టీచర్ల వ్యతిరేకతతో పాటు బీజేపీ మద్దతు ఉండటంతో తప్పక తానే గెలుస్తానని ఏవీఎన్ రెడ్డి అంటున్నారు. 16వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏ అభ్యర్థికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో 50 శాతానికిపైగా ఓట్లు రాకపోతే, సెకండ్ ప్రయార్టీ ఓట్లను లెక్కిస్తారు. ఈవిధంగా చివరి వరకూ ఓట్లు లెక్కించి విజేతను ప్రకటిస్తారు.

నేటి నుంచే పార్లమెంట్​

నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ వరకు 17 వర్కింగ్ డేస్​ లో సమావేశాలు జరుగుతాయి. కేంద్ర బడ్జెట్ ఆమోదం,గ్రాంట్లు,కీలక బిల్లుల ఆమోదం పై చర్చలు జరుగుతాయి. ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీల దుర్వినియోగం, అదాని కంపెనీ షేర్ల పతనం -హిండెన్‌బర్గ్ నివేదిక, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, పెరుగుతున్న నిరుద్యోగం, చైనా సరిహద్దు అంశం సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్ష నేతలతో సీబీఐ, ఈడీ దాడులపై పార్లమెంట్లో ఆందోళన చేపట్టాలని బీఆర్​ఎస్​ నిర్ణయించింది.

అమిత్ షా విమానంలో సాంకేతిక లోపం

హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ నుండి అమిత్ షా కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఉదయం 11:40 గంటలకు అమిత్ షా  కొచ్చి బయలుదేరాల్సి ఉండగా.. ఫ్లైట్​ ఫెయిల్యూర్ తో రెండు గంటల పాటు ఇక్కడే ఉన్నారు. అనంతరం వేరే విమానంలో ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ లతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన తీరుపై అమిత్​ షా దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. ఈలోగా అధికారులు మరో విమానం రప్పించి అమిత్​షా పర్యటనకు ఏర్పాట్లు చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here