సంక్రాంతి దాకా చలి.. 19న మోడీ సభ.. బీజేపీలోకి పొంగులేటి.. అసెంబ్లీ నుంచి గవర్నర్​ వాకౌట్.. రుషి సునక్​ ఓడిపోతారట.. ఈ రోజు టాప్​ న్యూస్​

సంక్రాంతిదాకా చలి

రాష్ట్రంలో వాతావరణం చల్లగా మారిపోయింది. సంక్రాంతి వరకూ ఉష్ణోగ్రతలు ఇలాగే ఉండొచ్చునని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్‌, కొమురంభీం అసిఫాబాద్, నిర్మల్‌, మంచిర్యాల్, పెద్దపల్లి, జగిత్యాల్, కామారెడ్డి, కరీంనగర్‌‌, రాజన్న సిరిసిల్ల, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, మెదక్‌లో 8 డిగ్రీలు నమోదైంది. బుధవారం నుంచి చలి కొంత తగ్గి, 10 నుంచి 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

19న హైదరాబాద్‌లో మోడీ సభ

ఈ నెల 19 న ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ ఖరారైంది. మోదీ సిటీ పర్యటనలో మొత్తం రూ. 7 వేల కోట్ల ప్రాజెక్టులకు సంబంధించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సికింద్రాబాద్, విజయవాడ  వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. 

మున్సిపాలిటీల్లో ఫేస్ ఐడీ​ ఓటింగ్​

మున్సిపాలిటీల్లో ఫేస్‌ రికగ్నైజేషన్‌ సిస్టం ద్వారా ఈ ఓటింగ్‌ అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తమ చేతుల్లోనే ఉందని.. కేంద్ర ఎన్నికల సంఘం మోడీ చేతుల్లో ఉంటుంది కాబట్టి వాళ్లేం చేస్తారో తెలియదన్నారు.  పౌర సేవలు అందించడంలో తమ ప్రభుత్వం సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించుకుంటుందన్నారు. ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం ద్వారా పెన్షనర్లకు లైఫ్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యూవల్‌, నేర పరిశోధనకు ఈ సాంకేతికత ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. 

నేటి నుంచి కంది కొనుగోళ్లు

రాష్ట్రంలో కంది కొనుగోళ్లకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా మంగళవారం నుంచి కంది పంటను కొనుగోళ్లు చేపట్టనున్నారు. వానాకాలం సీజన్‌కు చెందిన కంది పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తుంది. రైతుల నుంచి మద్దతు ధరతో కందులను కొనుగోలు చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 100 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్‌ నిర్ణయించింది. 

మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లకు నోటిఫికేషన్

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2023–24 అకాడమిక్ ఇయర్ లో వివిధ క్లాసుల్లో ​ప్రవేశాల కోసం ఏప్రిల్16న అడ్మిషన్ టెస్టు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. స్టేట్ వైడ్​గా 194 మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో వంద సీట్ల చొప్పున భర్తీ చేయనున్నారు. వీటితో పాటు వివిధ కారణాలతో ఏడు నుంచి పదో తరగతి వరకూ మిగిలిపోయిన సీట్లనూ ఎంట్రెన్స్​ ద్వారా నింపనున్నారు. సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. మంగళవారం నుంచి ఫిబ్రవరి 15 వరకూ ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 16న ఎగ్జామ్స్ జరగనున్నాయి. మరిన్ని వివరాలకు https://telanganams.cgg.gov.in వెబ్ సైట్ చూడాలని కోరారు. 

13 నుంచి సంక్రాంతి సెలవులు

రాష్ట్రంలో ఈ నెల13 నుంచి17 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ తదితర స్కూళ్లకు సంక్రాంతి సెలవులు కొనసాగనున్నాయి. తిరిగి ఈనెల 18న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఐదు రోజుల పాటు హాలీడేస్​ ఉంటాయనీ అధికారులు వెల్లడించారు. ఈ సెలవులు కేవలం నాన్ మైనార్టీ స్కూళ్లకు మాత్రమేననీ చెప్పారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి.. 600 మంది మృతి

తూర్పు ఉక్రెయిన్​లో సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడి చేసినట్టు రష్యా  తెలిపింది. ఆదివారం ఉదయం జరిపిన ఈ దాడిలో 600 మంది ఉక్రెయిన్​ సైనికులు చనిపోయారని ప్రకటించింది. ఒక బిల్డింగ్​లో 700 మంది, రెండో బిల్డింగ్​లో 600 మంది ఉక్రెయిన్​ సైనికులు ఉన్నారని, వీరిలో 600 మందికి పైగా చనిపోయినట్టు తెలిపింది. అయితే, రష్యా దాడిని రాయిటర్స్ రిపోర్టర్స్​ ఖండించారు. రాకెట్లతో దాడి జరిగినట్టు ఎలాంటి ఆధారాల్లేవని తెలిపారు. భవనాలు కూడా దెబ్బతిన్నట్టు కనిపించలేదని, అసలు సైనికులు అక్కడ ఉన్నట్టు కూడా స్పష్టమైన ఆనవాళ్లు లేవన్నారు.

అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్​

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి సోమవారం గవర్నర్ ఆర్‌‌ఎన్‌ రవి ప్రసంగించారు. ప్రభుత్వం సిద్ధం చేసిన స్పీచ్‌లోని కొన్ని భాగాలను ఆయన స్కిప్ చేశారు. బీఆర్ అంబేద్కర్, కె.కామరాజ్, ఈవీ రామస్వామి పెరియర్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి నేతల పేర్లను ప్రస్తావించలేదు. పైగా తన సొంత పాయింట్లను చదివారు. గవర్నర్ స్పీచ్ ముగించగానే, సీఎం స్టాలిన్ లేచి నిలుచున్నారు. గవర్నర్‌‌ ఎదురుగా ఉండగానే.. ఆయనకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.  రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన స్పీచ్‌ మాత్రమే చెల్లుబాటు అయ్యేదిగా ప్రకటించాలని, గవర్నర్‌‌ డీవియేషన్‌ను తిరస్కరించాలని, గవర్నర్ చేర్చిన అంశాలను తొలగించాలని అందులో పేర్కొన్నారు. గవర్నర్ చర్యలు అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధమని తీర్మానంలో పేర్కొన్నారు. స్టాలిన్ మాట్లాడుతుండగానే.. గవర్నర్ రవి వాకౌట్ చేశారు. తర్వాత ప్రభుత్వం సిద్ధం చేసిన ఒరిజినల్ స్పీచ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది.

కేసీఆర్‌‌ను మార్చాల్సిందే

రాష్ట్రంలో సర్పంచుల దుస్థితికి, వాళ్ల ఆత్మహత్యలకు సర్కారే కారణమని, ఆ పరిస్థితికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. చనిపోయిన సర్పంచుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్​ చేశారు. గ్రామాల్లో, అధికారుల వద్ద సర్పంచ్​ అంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉందనీ, ఇపుడు సర్పంచ్​ వస్తేనే చిన్న చూపు చూస్తున్నారన్నారు. వాళ్లకీ పరిస్థితి రావడానికి కేసీఆర్​ విధానాలే కారణమన్నారు. 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించి పంచాయితీల్లో పైసా లేకుండా చేశారన్నారు. దాంతో సర్పంచులు అభివృద్ధి పనుల కోసం అప్పులు ఆత్మహత్యలకు కొందరు, ఆస్తులు తాకట్టుపెట్టి మరికొందరు, బిచ్చమెత్తి ఇంకొందరు అవస్థలు పడుతున్నారన్నారు.

ప్రగతి భవన్‌ను ముట్టడించిన పోలీస్ అభ్యర్థులు

రన్నింగ్ లో క్వాలిఫై అయిన పోలీసు అభ్యర్థులందరికీ మెయిన్స్ కు అర్హత కల్పించాలని డిమాండ్  చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో అభ్యర్థులు సోమవారం ప్రగతి భవన్  ముట్టడికి యత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువజన, విద్యార్థి నేతలు, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ ముట్టడి యత్నంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రగతి భవన్ కు ర్యాలీగా తరలిన నేతలు, అభ్యర్థులను పోలీసులు నెక్లెస్ రోడ్ లో అరెస్టు చేశారు. అనంతరం వారిని పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ పీఎస్,  గోషామహల్ స్టేడియంకు తరలించారు.

కంటతడి పెట్టిన సమంత

చాలారోజుల తర్వాత అభిమానులకు కన్పించారు సమంత.‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆదివారం మీడియా ముందుకొచ్చారు. కొంతకాలంగా ‘మయోసైటిస్’ అనే అనారోగ్య సమస్యతో ఇన్నాళ్లూ ఆమె  ఇంటికే పరిమితమయ్యారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గుణశేఖర్ తన గురించి మాట్లాడుతుంటే సమంత ఎమోషనల్ అయ్యారు. ఒక దశలో కంటతడి పెట్టుకున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ‘శాకుంతలం’ మూవీ ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్​ కానుంది.

రుషీ సునాక్‌ ఓడిపోతారట

బ్రిటన్​ ప్రధాని రుషీ సునక్​కు పదవీ గండం పొంచి ఉంది. ఆయనతోపాటు కేబినెట్​లోని మరో 15 మంది మంత్రుల పదవులకూ ఎసరొచ్చింది. 2024లో జరిగే జనరల్​ ఎలక్షన్స్​లో వాళ్లంతా వారి సొంత స్థానాల్లోనే ఓడిపోతారని ‘బెస్ట్​ ఫర్​ బ్రిటన్’​ అనే సంస్థ చేసిన ‘ఫోకల్​ డేటా పోలింగ్’ సర్వేలో తేలింది. సునక్​తోపాటు డిప్యూటీ ప్రధాని డొమినిక్​ రాబ్, ఆరోగ్య శాఖ మంత్రి స్టీవ్ బార్​క్లే, విదేశాంగ శాఖ మంత్రి జేమ్స్​ క్లవర్లీ, రక్షణ మంత్రి బెన్​ వాలేస్, వాణిజ్య శాఖ మంత్రి గ్రాంట్​ షాప్స్, కామన్స్​ లీడర్​ పెన్నీ మోర్డాంట్, పర్యావరణ శాఖ మంత్రి థెరీసా కాఫీ వంటి వాళ్లూ ఓడిపోతారని సర్వే వెల్లడించింది. జెరెమీ హంట్, భారత సంతతికి చెందిన సువెల్లా బ్రేవర్​మాన్, మైకేల్​ గోవ్, నదీమ్​ జవావి, కెమీ బాడినోక్ మాత్రమే ఎన్నికల్లో నెగ్గుతారని పేర్కొంది. 

ఈ నెల 19న బీజేపీలోకి పొంగులేటి?

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీ లో చేరనున్నారు. ఆయనతో పార్టీ కేంద్ర నాయకత్వం నేరుగా సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న ఈనెల 18న ఆయన ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో ఆయన భేటి కానున్నారు.

డీజీపీని కలిసిన రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సీబీఐతో విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్ష్యుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో  కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని అన్నారు.నాగర్ కర్నూలులో కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆరెస్ నేతలు దాడుల చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలు సోమవారం డీజీపీ అంజనీకుమార్‌‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc