రేవంత్​రెడ్డిపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు.. ల్యాబ్​లో దూరిన చిరుత.. మందమర్రి సజీవ దహనం వెనుక.. టుడే టాప్ న్యూస్​

రేవంత్‌‌రెడ్డిపై కాంగ్రెస్​ సీనియర్ల తిరుగుబాటు

పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్లు తిరుగుబాటు చేశారు. ‘సేవ్‌ కాంగ్రెస్‌’ నినాదంతో ఒక్కటయ్యారు. రేవంత్​ మీటింగ్​లను బహిష్కరించాలని తీర్మానించారు. రేవంత్​ తీరుతో రాష్ట్రంలో పార్టీ నష్టపోతోందని, వలస వచ్చిన వారికే పీసీసీ కమిటీల్లో ప్రియారిటీ ఇచ్చారని మండిపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు శనివారం అత్యవసరంగా సమావేశమయ్యారు. రేవంత్‌ తీరుపై హైకమాండ్​కు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పీసీసీ కమిటీల్లో కాంగ్రెస్‌ ఒరిజినల్‌ లీడర్లకు కాకుండా వలస వచ్చినోళ్లకే ప్రాధాన్యం ఇవ్వటాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌ సహా ముగ్గురు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. ఎమ్మెల్యే సీతక్క మినహా ఇద్దరు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ.. తిరుగుబాటు చేయటంతో కాంగ్రెస్​ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ల్యాబ్‌లో చిరుత కలకలం

సంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జిన్నారం మండలం గడ్డపోతారం ఇండస్ట్రియల్ ఏరియాలోని హెటిరో ల్యాబ్స్ లో చిరుత దూరింది. ఉదయం డ్యూటీకి వెళ్లిన ఉద్యోగులు, కార్మికులు ఫ్యాక్టరీ హెచ్ బ్లాక్ లో చిరుత ఉన్నట్లు గుర్తించి భయంతో పరుగులు తీశారు. ఫ్యాక్టరీ గేట్లకు తాళాలు వేసి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ సిబ్బంది.. చిరుతను పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 10 గంటల పాటు ఆపరేషన్‌ కొనసాగింది. బోన్ ఏర్పాటు చేసి, గన్‌ సాయంతో చిరుతకు మత్తు మందు ఇచ్చారు. చిరుత మత్తులోకి జారుకోగానే పట్టుకొని బోన్‌లో బంధించారు. దాన్ని జూ పార్క్‌కు తరలించారు. (లైవ్​ దృశ్యాలు ఈ వీడియోలో చూడొచ్చు)

ఢిల్లీని వణికిస్తున్న చలి

ఢిల్లీని చలి వణికిస్తోంది. ఎన్నడూ లేనంతగా శనివారం టెంపరేచర్‌‌ 6 డిగ్రీలకు పడిపోయింది. దీంతో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ సీజన్‌లో ఇదే అత్యంత తక్కువ టెంపరేచర్‌‌ అని వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఎయిర్‌‌ క్వాలిటీ కూడా ఘోరంగా పడిపోయింది. ఉదయం 9.10 గంటలకు 290గా నమోదైంది. గరిష్టంగా 25 డిగ్రీల టెంపరేచర్‌‌ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

చైనాకు కోవిడ్ ముప్పు

చైనాలో అమల్లో ఉన్న జీరో కొవిడ్‌ పాలసీని ఎత్తివేయడంతో అక్కడ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే, 2023 నాటికి అక్కడ 10 లక్షల మంది వైరస్‌ బారిన పడి చనిపోవచ్చని అమెరికాలోని వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవల్యూయేషన్‌ (ఐహెచ్‌ఎంఈ) అంచనా వేసింది. ఐహెచ్‌ఎంఈ డైరెక్టర్‌‌ క్రిస్టోఫర్‌‌ ముర్రే మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఏప్రిల్‌1 నాటికి చైనాలో కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని, మరణాలు 3,22,000కు పెరుగుతాయని చెప్పారు. చైనా జనాభాలో మూడింట ఒక వంతు మంది వైరస్‌ బారిన పడతారని తెలిపారు.

ఎంఐఎం హర్ట్ అవుద్దని కేసీఆర్ స్పందించట్లె:

రోహిత్ రెడ్డిని ఎమ్మెల్యే పదవికి అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు లేఖ రాశారు. 2009 ఎన్నికల అఫిడవిట్ లో ఒకతీరు, 2018 ఎన్నికల అఫిడవిట్ లో మరో తీరుగా విద్యా అర్హతలు చూపిన ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘునందన్ రావు ఈసీకి విజ్ఞప్తి చేశారు. 2009 లో అఫిడవిట్ లో ఇంజనీరింగ్ స్వీడన్ లో పూర్తి చేసినట్లు, 2018 అఫిడవిట్ లో ఇంటర్ పాస్ అయినట్లు రోహిత్ రెడ్డి పేర్కొనడాన్ని ఈసీ సీరియస్ గా తీసుకోవాలని కోరారు.

జీఎస్టీ ఎత్తేయాలని కోరిన హరీష్​రావు

పేదలకు అందించే సర్వీసులపై జీఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో కస్టమ్ మిల్లింగ్, ట్రాన్స్పోర్ట్కు జీఎస్టీ తీసేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్అధ్యక్షతన శనివారం 48వ జీఎస్టీ కౌన్సిల్​ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మైనర్ ఇరిగేషన్ మేనేజ్​మెంట్​, రిపేర్​ వర్క్స్​తో పాటు పేదలకు అందించే సేవలైన ప్రజా పంపిణీ వ్యవస్థ కస్టమ్ మిల్లింగ్, రవాణా సేవలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. బీడీ ఆకుపై పన్ను వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

నేడే మల్లన్న‌ లగ్గం

కొమురవెల్లి మల్లన్న లగ్గం వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మల్లికార్జున స్వామి బలిజ మేడలదేవి, గొల్లకేతమ్మ అమ్మవార్ల కల్యాణ మహోత్సవం ఆదివారం 10-:45 గంటలకు తోట బావి వద్ద కల్యాణమండపంలో నిర్వహించనున్నారు. అర్చకులు శ్రీమత్ జగద్గురు 1008 వీరశైవ పీఠాధిపతి పర్యవేక్షణలో ఈ వేడుకలు జరిపించనున్నారు. వరుడు మల్లికార్జునస్వామి తరపున పడిగన్నగారి వంశస్థులు, వధువులు బలిజ మేడలదేవి, గొల్లకేతమ్మ అమ్మవార్ల తరపున మహాదేవుని వంశస్థులు పెండ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు.

అక్రమ సంబంధమే ఆరుగురిని కాల్చేసింది

మందమర్రి మండలం వెంకటాపూర్ గుడిపల్లి గ్రామంలో ఆరుగురు మంటల్లో దహనమైన దారుణానికి వివాహేతర సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. సుంకరి పనిచేసే మాసు శివయ్య కుటుంబం మొత్తం ఈ ఘటనలో అగ్నికి ఆహుతైంది. శివయ్యకు చెందిన పెంకుటింట్లో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగి ఇళ్లంతా వ్యాప్తి చెందడంతో శివయ్య, అతని భార్య రాజ్యలక్ష్మీ, శివయ్య వదిన కూతురు గడ్డం మౌనిక, మౌనిక ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. వీరితోనే ఇంట్లో ఉన్న మరో వ్యక్తి సింగరేణి కార్మికుడు (మైనింగ్ సర్దార్) శనిగారపు శాంతయ్య మంటల్లో కాలిపోయి మరణించారు. శాంతయ్య రాజ్యలక్ష్మి‌తో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు‌. శివయ్య కూడా అందుకు అడ్డు చెప్పడంలేదు. కక్ష పెట్టుకున్న‌‌ శాంతయ్య కుటుంబ సభ్యులే ఈ ఘటనకు పాల్పడి హత్య‌ చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం

బీఎస్పీ జెండాలను కూల్చి తమను బెదిరించాలని చూస్తే తమ సైన్యం చూస్తూ ఊరుకోదని, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 146వ రోజు మానకొండూర్ మండలంలో ఆయన పర్యటించారు. మానకొండూరులో పార్టీ జెండా గద్దెను కూల్చారన్న విషయం తెలుసుకున్న ఆయన అక్కడికి వెళ్లి పరిశీలించారు. బెజ్జంకి మండలంలోని తోటపల్లి, కన్నాపూర్ గ్రామాల్లో కూడా గద్దెలను కూల్చారని, ఇలాగే చేస్తూ పోతే రాబోయే కాలంలో గడీలు, ఫార్మ్ హౌస్ లను వదిలి పెట్టకుండా రెట్టింపు ధ్వంసం చేస్తామన్నారు.

రూ.5 ఎక్కువ చార్జ్ చేసినందుకు లక్ష ఫైన్

రైల్లో వాటర్​ బాటిల్ కు రూ.5 ఎక్కువ ధరకు అమ్మినందుకు రైల్వే శాఖ భారీ జరిమానా విధించింది. బాధ్యుడైన కాంట్రాక్టర్​కు రూ.లక్ష ఫైన్ వేసింది. ట్వీటర్​లో ప్రయాణికుడు చేసిన ఫిర్యాదుతో ఈ జరిమానా విధించటం గమనార్హం. రూ.15 ఎంఆర్​పీ ఉన్న వాటర్ బాటిల్​ ను దినేష్ అనే వ్యక్తి రూ.20కి తనకు అమ్మినట్లు శివం భట్ అనే ప్రయాణికుడు గురువారం ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. చండీఘర్ నుంచి షాజహాన్​పూర్​కు వెళుతున్న ట్రైన్ లో ఇది జరిగిందని ట్వీట్​ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన ఇండియన్ రైల్వే అంబాలా డివిజన్.. సంబంధిత క్యాటరింగ్​ కాంట్రాక్టర్​కు రూ. లక్ష జరిమానా విధించింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here