టర్కీ సిరియాలో వేలాది మంది మృతి
టర్కీ, సిరియాలో భూ విలయం తీవ్ర స్థాయికి చేరింది. దాదాపు 2600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 6వేల మందికిపైగా గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. టర్కీ, సిరియాలోని ఎక్కడ చూసినా బాధితుల హాహాకారాలు, అంబులెన్సుల సైరన్ల మోతలే కనిపిస్తున్నాయి. వేలాది మంది భవనాల శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టర్కీలో 1,650 మంది చనిపోయారని.. 11 వేల మంది గాయపడ్డారని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ స్వయంగా వెల్లడించారు. సిరియా 968 మంది మృతిచెందగా, 1280 మందికి గాయాలయ్యాయని సిరియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. టర్కీ, సిరియాల్లో సంభవించిన విపత్తుపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దేశాలకు అండగా ఉంటామని, అవసరమైన సాయం అందిస్తామన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన రెండు టీమ్స్, డాక్టర్లు, పారామెడిక్స్ తో కూడిన మెడికల్ టీమ్స్, రిలీఫ్ మెటీరియల్, మెడిసిన్ టర్కీ, సిరియాకు పంపించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. టర్కీలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై అత్యధికంగా 7.8గా నమోదైంది. దాదాపు 20సార్లు భూప్రకంపనలు సంభవించాయని సైంటిస్టులు వెల్లడించారు. మృతుల సంఖ్య 20 వేలకు చేరి ఉంటుందని విదేశీ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
అసెంబ్లీలో నేడు బడ్జెట్‌పై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు బడ్జెట్ పై చర్చ మొదలవుతుంది. బుధవారం నాటి సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ను రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉదయాన్నే బడ్జెట్ పై చర్చతో సభ ప్రారంభమవుతుంది. శాసన మండలి లో క్వశ్చన్ అవర్ కొనసాగనుంది.
కాంగ్రెస్ టికెట్లు వాళ్లకే ఇస్తాం: రేవంత్ రెడ్డి
ప్రజల్లో ఉన్న నేతలకే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశా రు. నాయకుల కోటా స్పెషల్‌గా ఉండబోదని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులపై మూడు స్థాయిల్లో సర్వే జరుగుతోందని చెప్పారు. ఏఐసీసీ ఇన్‌చార్జిలు ఒకవైపు, సునీల్ కనుగోల్ సర్వే మరోవైపు ఉండగా తాను కూడా సర్వే చేయిస్తున్నానని వెల్లడించారు. మూడు సర్వేల్లో పాజిటివ్‌గా ఉన్న వారికే పార్టీ టికెట్లు ఇస్తుందని అన్నారు. రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్‌సే హాత్ జోడో యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు జిల్లాలో కొనసాగింది. అద్దాల మేడలలెక్క కలెక్టరేట్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ఉన్నా లేకున్నా ఒకటేనని అన్నారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు ఇప్పుడు ప్రగతి భవన్‌ను లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు.
10 మందికి ఐఏఎస్ హోదా… ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణ నుంచి 10 మంది అధికారులకు ఐఏఎస్ హోదా లభించింది. జల్ద అరుణశ్రీ, ఎ.నిర్మల కాంతి వెస్లీ, కోటా శ్రీవాస్తవ, చెక్కా ప్రియాంక, బడుగు చంద్రశేఖర్, కోరం అశోక్‌రెడ్డి, హరిత, వెంకట నర్సింహారెడ్డి, కాత్యాయని, నవీన్ నికోలస్ ఈ జాబితాలో ఉన్నారు. రెవెన్యూ కోటాలో ఐదుగురికి.. నాన్ రెవెన్యూ కోటాలో మరో ఐదుగురికి పదోన్నతి లభించింది. జనవరిలో ఢిల్లీలో రాష్ట్ర అధికారులకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. మరోవైపు రాష్ట్రంలో మరో ఏడుగురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్, సీఐడీ ఎస్సీగా ఆర్ వెంకటేశ్వర్లు బదిలీ అయ్యారు. పీసీఎస్‌గా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేందర్ రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీష్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
సుప్రీం కోర్టుకు చేరిన ఎమ్మెల్యేల కేసు
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఈ పిటిషన్ వేశారు.
జేఈఈ ఫలితాల్లో తెలుగు సత్తా
జేఈఈ-మెయిన్ తొలి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం ఈ ఫలితాలను ప్రకటించింది. టాప్ 20 లో అయిదుగురు తెలుగు విద్యార్థులు ప్రతిభను చాటారు.ఈ సారి వందకు వంద పర్సంటైల్ సాధించిన 20 మంది కూడా అబ్బాయిలే. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి, బిక్కిన అభినవ్ చౌదరి, గుత్తికొండ అభిరామ్, దుగ్గినేని వెంకట యుగేశ్, అభినీత్ మాజేటి ఉన్నారు. వీరిలో నలుగురు తెలంగాణకు చెందిన వారు కాగా, ఒకరు ఏపీకి చెందిన వారు.
టోఫెల్ ఎగ్జామ్ మాస్ కాపీయింగ్ ముఠా
విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు తప్పనిసరైన టోఫెల్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆన్ లైన్లో జరుగుతున్న ఎగ్జామ్ ని కాపీ చేస్తున్నారని.. పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి రెండు గ్యాంగుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ ఎంట్రన్స్‌ల తేదీల ఖరారు
రాష్ట్రంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎంసెట్ తర్వాత వరసగా ఎడ్‌సెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, పీజీఈసెట్‌లు జరుగుతాయి. ఈ షెడ్యూల్ ప్రకారం మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం, మే 12 నుంచి 14 వరకు ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు. మే 18న ఎడ్‌సెట్, 20న ఈసెట్, 25న లాసెట్, 26, 27వ తేదీల్లో ఐసెట్, మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్‌లను నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ఈ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు ఒక జ్థాపకం.. ఇప్పుడు మళ్లీ అవి సిటీ రోడ్లపై కనిపించబోతున్నాయి. పదేండ్ల తర్వాత తర్వాత ప్రభుత్వం మళ్లీ డబుల్ డెక్కర్లను ప్రారంభించింది. ఈసారి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 11న హుస్సేన్‌సాగర్ తీరంలో జరగనున్న ఫార్ములా ఈ-కార్ రేస్‌ను వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకుల కోసం ఈ బస్సులు నడుపుతారు. తర్వాత సిటీలో టూరిజానికి వినియోగిస్తారు. మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన మూడు డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులను నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయం వద్ద మంత్రి కేటీఆర్, సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు. మంత్రితో పాటు మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్వి అర్వింద్‌కుమార్ ఈ బస్సుల్లో కొంతదూరం ప్రయాణించారు.