ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇందులో ప్రమేయుముందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ధ్రువీకరించింది. సీబీఐ స్పెషల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని, సౌత్గ్రూప్‌ను శరత్ రెడ్డి, కల్వకుంట్ల కవిత, వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి మేనేజ్ చేశారని ఈడీ పేర్కొంది. ఆధారాలు దొరకకుండా 10 మొబైల్ ఫోన్స్ ను కవిత డ్యామేజ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. 6209999999 నెంబర్‌తో ఆరు ఫోన్లు, 8985699999తో నాలుగు ఫోన్లు మార్చినట్లు ఈడి ప్రస్తావించింది. వీటికి సంబంధించిన ఐఎంఈ నెంబర్లను రిపోర్టులో నమోదు చేసింది.
ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా అనుచరుడు అమిత్ అరోరాను మంగళవారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం రౌస్ ఎవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జీ నాగ్ పాల్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా 32 పేజీల రిమాండ్ రిపోర్టు ను ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్(ఐఓ) జోగేందర్ దాఖలు చేశారు. ఈ రిపోర్టులో ఈడీ వివిధ అంశాలను పొందుపరిచింది. సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులను విజయ్నాయర్కు ముట్టజెప్పిన విషయాన్ని అమిత్ అరోరా అంగీకరించినట్లు తెలిపింది. ఢిల్లీకి చెందిన ఆప్ లీడర్ విజయ్ నాయర్ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా పాలసీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ వెల్లడించింది.
విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీలో సామాన్య కార్యకర్త కాదని, సిఎం కేజ్రీవాల్ కు దగ్గరి అనుచరుడని పేర్కొంది. అతనికి ఢిల్లీలో రెసిడెన్సీ లేదని, 2020 నుంచి ప్రభుత్వం రాష్ట్ర మంత్రి కైలాష్ గెల్హాట్ కు కేటాయించిన నివాసంలో ఉంటున్నాడని తెలిపింది. 2020 సెప్టెంబర్ 4న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్పైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా నేతృత్వంలోని కమిటీ ఈ లిక్కర్ పాలసీకి రూపొందించిందని వెల్లడించింది. ఇందులో సిసోడియాతో పాటూ మంత్రులు సత్యేంద్ర జైన్, కైలాష్ గెల్హాట్ లు ఉన్నట్లు తెలిపింది.
మొత్తం మూడు లెవల్స్ లో కిక్ బ్యాగ్ మనీ ఆప్ లీడర్లకు అందినట్లు చూపింది. మ్యానిఫెక్షర్, ఎల్ 1 డిస్ట్రీబ్యూటర్, డ్రిస్ట్రిబ్యూటర్ ఎంపిక అంశంలోనే భారీ లూప్ హోల్ ఉన్నట్లు గుర్తించింది. విజయ్ నాయర్, దినేష్ అరోరా ఈ కుట్రలో పాలుపంచుకున్నట్లు పేర్కొంది. మొత్తం 13 మేజర్ మ్యానిఫాక్చర్ కంపెనీలు, 14 హోల్ సేల్ ఎల్ షాపులు, 32 రిటైల్స్ జోన్స్ ల సమాచారాన్ని కంపెనీల పేర్లతో రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించింది. శరత్ చంద్రా రెడ్డి కి సంబంధించి శ్రీ అవంతిక కన్ట్సక్టర్ లిమిటెడ్, ట్రిడెంట్ చెంఫర్ లిమిటెడ్, ఆర్గానోమిక్స్ ఈకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను ఇందులో ప్రస్తావించింది. ఈ ముడుపులు చేతులు మారటంతో ఢిల్లీ ప్రభుత్వం 12 శాతం ఆదాయం.. దాదాపు రూ. 581 కోట్లు నష్టపోయిందని తెలిపింది.
ఈ కుంభకోణంతో ఎంత నష్టం
ఎక్సైజ్ పాలసీ తయారీలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో సిసోడియా, సత్యేంద్ర జైన్, కైలాష్ గెహ్లాట్ కీలకంగా ఉన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, పబ్లిక్ సూచనలకు విరుద్ధంగా జీవోఎం పాలసీ తయారైంది. హోల్ సేల్ వ్యాపారాన్ని తయారీ నుంచి వేరు చేసి పూర్తిగా ప్రైవేటుకే ఇచ్చేలా పాలసీని జీవోఎం మార్చింది. పాలసీ ఫైనల్ అయిన 3 నెలల తర్వాతే పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. పాత పాలసీలో 5 శాతం ఉన్న ప్రాఫిట్ మార్జిన్ ఏకంగా 12 శాతానికి పెంచారు. లైసెన్స్ ఫీజు తగ్గించి వ్యాపారులకు రూ. 719 కోట్ల లాభం చేకూర్చారు. దీంతో పాటు ఇతర మినహాయింపుల కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2,873 కోట్ల నష్టం జరిగింది.
డిజిటల్ ఎవిడెన్స్ ధ్వంసం
లిక్కర్ స్కాం లో పెద్ద మొత్తంలో డిజిటల్ ఎవిడెన్స్ ను ధ్వంసం చేశారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో దేశ వ్యాప్తంగా 178 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన ఈడీ అనేక ఆధారాలను సేకరించింది. మొత్తం 36 మంది దాదాపు రూ. 1.38 కోట్ల విలువ చేసే 170 ఫోన్లు మొబైల్ ఫోన్స్ ను పగలగొట్టి, ఎవిడెన్స్ ను ధ్వంసం చేసినట్లు గుర్తించింది. 17 ఫోన్లను స్వాధీనం చేసుకుంది.ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొత్తం నాలుగు నెంబర్లు ఉపయోగించారని పేర్కొంది. 14 ఫోన్లను మార్చి ఎవిడెన్స్ ను నాశనం చేశారని ఈడీ గుర్తించింది. మరోమంత్రి కైలాష్ గెహ్లాట్ ఒక నెంబర్, మూడు ఫోన్లు, సన్నీ మార్వా ఒక నెంబర్, ఏడు మొబైల్స్, విజయ్ నాయర్ రెండు నెంబర్లు, ఆరు ఫోన్లు, సమీర్ మహేంద్రు ఒక నెంబర్, నాలుగు ఫోన్లు, అమిత్ అరోరా నాలుగు నెంబర్లు, 11 ఫోన్లు, అరుణ్ పిల్లై ఒక నెంబర్, 5 మొబైల్స్ లు వాడినట్లు పేర్కొంది. అలాగే, సౌత్ గ్రూప్స్ కు సంబంధించి శరత్ రెడ్డి ఒక నెంబర్, 9 ఫోన్లు, కవిత రెండు నెంబర్లు, 10 మొబైల్స్, అభిషేక్ బోయినపల్లి ఒక నెంబర్, 5 ఫోన్లు వాడినట్లు తెలిపింది.
అమిత్ అరోరాకు 7 రోజుల ఈడీ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో లిక్కర్ వ్యాపారి అమిత్ అరోరాను సిబిఐ స్పెషల్ కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తొలుత ఈడీ తరపు అడ్వకేట్ నవీన్ కుమార్ మిట్ట వాదనలు వినిపిస్తూ… ప్రివెన్షన్ ఆఫ్ మనీల్యాండరింగ్ యాక్ట్(పిఎంఎల్ఏ), సెక్షన్ ప్రకారం 65 ప్రకారం అమిత్ అరోరాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. కిక్‌బ్యాగ్ పాత్రలో అమిత్ అరోరా కీ రోల్ పోషించినట్లు తెలిపింది. రూ.2.5 కోట్ల లంచం తీసుకున్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ఈడీ అడ్వకేట్ వాదనలపై అరోరా తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అరోరా ఇప్పటికే 22 సార్లు ఈడీ ముందు హాజరయ్యారని, ఫోన్ కాల్ లో కూడా విచారణకు సహకరించారని తెలిపారు. జోక్యం చేసుకున్న జడ్జ్ నాగ్ పాల్… 22 విచారణల తర్వాత కస్టడీ అవసరమేముందని ఈడీ ని ప్రశ్నించారు. కేవలం మూడుసార్లు వాంగ్మూలం నమోదు చేసినట్లు ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోసారి అభ్యంతరం తెలిపిన అరోరా తరపు న్యాయవాది… ఈడీ ఫోన్ చేసి పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరైనట్లు తెలిపారు. ఫోన్ కూడా మార్చలేదని తెలిపారు. సిబిఐ పలు మార్లు తన నివాసం పై దాడులు చేసిందని అరోరా చెప్పారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన విజయ్ నాయర్, ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియాలను తాను ఎప్పుడూ కలవలేదని తెలిపారు. అయితే, ఇదే కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా మాత్రమే తనకు తెలుసునని వెల్లడించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం… అమిత్ అరోరాను డిసెంబర్ 7 వరకు కస్టడీకి అనుమతించింది.