నేడు పంట నష్టం పరిశీలనకు సీఎం కేసీఆర్.. రేపటి నుంచి మళ్లీ వర్షాలు.. ఈ ఏడాది తెలంగాణ పంచాంగం ఇదే.. పేపర్ లీకేజీలో మరో ముగ్గురు ఇంటి దొంగల అరెస్ట్.. తీన్మార్ మల్లన్న అరెస్ట్ ఎందుకంటే?.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

నేడు పంట నష్టం పరిశీలనకు సీఎం కేసీఆర్

రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన నేపథ్యంలో సీఎం గురువారం ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నష్టపోయిన రైతులను కలిసి పరామర్శించి, వారికి భరోసా కల్పించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

రాజు అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణ పంచాంగం

ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాంగం ఈ ఏడాది ఎలా ఉంటుందనే విషయాన్ని వివరించారు. పెండింగ్ బిల్లులన్నింటికి క్లియరెన్స్ ఈ ఏడాది రాబోతోందని తెలిపారు. కొంతమంది వ్యక్తుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకతలు వస్తాయన్నారు. పాలించే రాజు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యా శాఖలో కొన్ని అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. న్యాయ వ్యవస్థ ఈ ఏడాది మంచి తీర్పులు ఇవ్వబోతోందని పంచాంగం చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వబోతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకోవాలన్నారు. కొన్ని మత ఘర్షణలు, సామాజిక ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన సంఘటనలు జరగబోతున్నాయన్నారు. ఈ మూడు మాసాల్లో విపరీతమైన ఒడిదుడుకులు జరగబోతున్నాయని వివరించారు.

మరో ముగ్గురు టీఎస్పీఎస్సీ సిబ్బంది అరెస్ట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ముగ్గురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. కమిషన్లోని వివిధ విభాగాల్లో పని చేసే 20 మంది గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాగా.. వీరిలో 8 మంది మెయిన్స్ కు హాజరయ్యారు. వీరిలో ముగ్గురు పేపర్ లీకేజీ ద్వారానే 100కు పైగా మార్కులు సాధించినట్లు గుర్తించిన సిట్ వారిని అరెస్ట్ చేసింది.

కేటీఆర్ ను విచారించాలె: రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనలో మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేసి, విచారించాలని కోరారు. పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్ తమిళి సైను కలిసిన ఆయన.. పేపర్ లీక్ లో జరిగిన అవతవకలపై ఫిర్యాదు చేశారు. పేపర్ ను దొంగిలించి  కోట్లకు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో కేటీఆర్ దగ్గర ఉన్న వారిపైనా ఆరోపణలు వస్తున్నట్టు చెప్పారు. కేటీఆర్ ను, బోర్డు ఛైర్మన్ ను విచారించేందుకు అనుమతి కోరినట్టు తెలిపారు. గవర్నర్ కు విశేష అధికారాలున్నాయని, వాటి ప్రకారం ఇప్పుడున్న బోర్డులో ఉన్న అందర్నీ సస్పెండ్ చేసే అధికారం ఉందని చెప్పారు. 

నిరుద్యోగ మార్చ్: బండి సంజయ్

మిలియన్ మార్చ్ తరహాలో త్వరలో హైదరాబాద్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో అసలు దోషులను గుర్తించే వరకు బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ మార్చ్ పై పార్టీ నేతలతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మంత్రి కేటీఆర్ రాజీనేమా చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

జనార్ధన్ రెడ్డే ప్రధాన నిందితుడు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీన్ కుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. లీకేజీ వ్యవహారం బోర్డు చైర్మన్, సభ్యులకు ఆరు నెలల ముందుగానే తెలుసని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో చైర్మన్, బోర్డు సభ్యులను విచారించాలని డిమాండ్ చేశారు.

తీన్మార్ మల్లన్న అరెస్ట్

విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, వారిని నిర్భంధించి.. దాడి చేశారన్న ఆరోపణలతో క్యూన్యూస్‌ నిర్వాహకుడు చింతపండు నవీన్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నతోపాటు అతడి నలుగురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు తీన్మార్‌ మల్లన్న, క్యూన్యూస్‌ ఎడిటర్‌ బండారు రవీందర్‌, డ్రైవర్‌ ఉప్పల నిఖిల్‌, క్యూన్యూస్‌ ఆఫీస్ బాయ్‌ సిర్రా సుధాకర్‌, ఉద్యోగి సందీప్‌ కుమార్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఐదుగురిని అరెస్టు చేశారు. బుధవారం ఉదయం వారిని అక్కడి నుంచి అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణాకు తరలించారు. అనంతరం హయత్‌నగర్‌లోని మెజిస్ట్రేట్‌ ఇంటి వద్ద హాజరుపరిచారు. దీంతో 14 రోజుల రిమాండ్ విధించారు.

రేపటి నుంచి మళ్లీ వర్షాలు

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని బుధవారం వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల పిడుగులు, వడగండ్లు పడొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here