సినీ ఇండస్ట్రీలో ఒక హీరో వద్దన్న కథతో మరో హీరో సినిమా చేసి హిట్ కొట్టడం అనేది చాలా కామన్.. ఇండస్ట్రీలో ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. తెలుగు స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్ విషయంలో కూడా అదే జరిగింది. వెంకటేష్ కలియుగ పాండవులు చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ముందుగా ఈ చిత్రాన్ని దగ్గుబాటి రామానాయుడు సూపర్ స్టార్ కృష్ణతో తీయాలని అనుకున్నారు. అంతకు ముందు కృష్ణతో రామా నాయుడు పలు ముందడుగు, మండే గుండెలు, సావాసగాళ్లు, స్త్రీ జన్మ వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. అయితే కలియుగ పాండవులు చిత్రం విషయం వచ్చేసరికి ఆ సమయంలో కృష్ణ బిజీగా ఉండటంతో మీ ఇంట్లోనే మీ చిన్నబ్బాయి వెంకటేష్ ఉన్నాడుగా.. అతను హీరోగా చక్కగా సరిపోతాడని సలహా కూడా ఇచ్చారట.
ఈ విధంగా వెంకటేష్.. కలియుగ పాండవులు సినిమాతో వెండితెరకు హీరోగా అనుకోకుండా పరిచయమయ్యారు. ఈ సినిమాతోనే ఖుష్బూ హీరోయిన్ గా కూడా పరిచయమైంది. కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1986లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ కు నూతన కథానాయకుడుగా నంది అవార్డ్ ను అందుకున్నారు.
ఈ మూవీ తర్వాత హీరోగా వెంకటేష్ వెనుదిరిగి చూసుకోలేదు. అయితే ఆ తరువాత కృష్ణతో వెంకటేష్ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు. కానీ కృష్ణ కుమారుడు మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో కలిసి వెంకటేష్ నటించారు.