ఎమ్మెల్యేల కేసులో కేసీఆర్​కు షాకిచ్చిన హైకోర్టు.. అమెరికాలో చలితో 50 మంది మృతి.. రాష్ట్రపతికి కేసీఆర్​ స్వాగతం.. కర్ణాటకలో మాస్క్​ మస్ట్.. సిరిసిల్ల సెస్​ క్లీన్​ స్వీప్​ చేసిన బీఆర్​ఎస్​.. ఈరోజు టాప్​ న్యూస్​

సిట్ దర్యాప్తు​ రద్దు.. సీబీఐకి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు

ఫాంహౌజ్ కేసులో కేసీఆర్ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తును రద్దు చేసింది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 63ని కొట్టేసింది. మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర జరిగిందని మొయినాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసును తక్షణమే సీబీఐ చేపట్టాలని తీర్పులో పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఫాం హౌస్ కేసులో ఏం జరగబోతోందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. న్యాయ వ్యవస్థను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని ఈ కేసులో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే పైలెట్​ రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో హైకోర్టులో అప్పీల్​ వేయాలా..సుప్రీం కోర్టుకు వెళ్లాలా అనేది తీర్పు కాపీ వచ్చిన తర్వాత లీగల్​ ఒపీనియన్​ తీసుకుంటామని అన్నారు.

చలితో 50 మంది‌‌ మృతి

అమెరికన్లు చలితో అల్లాడుతున్నారు. మంచు తుఫాను కారణంగా వివిధ రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 50 మంది చనిపోయారు. వెస్టర్న్  న్యూయార్క్ లో మూడున్నర అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోయింది. చాలా నగరాల్లో ఇండ్లను మంచు కమ్మేసింది. ఇండ్ల ముందు పార్క్చేసిన వాహనాలు మంచులో ఇరుక్కుపోయాయి. పలు రాష్ట్రాల్లో కరెంట్  లేక లక్షల ఇండ్లు చీకట్లోనే ఉండిపోయాయి. విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.

జడ్పీటీసీ దారుణ హత్య

సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టి మల్లేశం(43) ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా  హత్య చేశారు. సోమవారం ఉదయం చేర్యాల మండలం గురిజకుంట గ్రామంలో తన ఇంటి నుంచి వాకింగ్ కు వెల్లిన మల్లేశంపై వెనుక వైపు నుంచి కత్తులు గొడ్డళ్లతో దాడి చేశారు.  తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయిన మల్లేశంను స్థానికులు గుర్తించి  కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తొలుయబ్సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి‌ నుంచి తరలించగా హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మల్లేశం మృతి చెందాడు. గ్రామంలో భూ తగాదాలే మల్లేశం హత్యకు కారణమైనట్టు తెలుస్తోంది. 

కేంద్ర మంత్రి నిర్మలకు అస్వస్థత

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. వైరల్‌ ఫీవర్, కడుపులో ఇన్ఫెక్షన్‌ తో సోమవారం మధ్యాహ్నం సాధారణ చెకప్‌ల కోసం ఎయిమ్స్‌కు వెళ్లారు. డాక్టర్ల సూచనతో అక్కడే అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు ప్రకటించారు.

ఆ రాష్ట్రంలో‌ మాస్క్‌ మస్ట్ 

ప్రపంచ వ్యాప్ంగా ఒమిక్రాన్ సబ్వేరియంట్ బీఎఫ్.7 కేసులు పెరుగుతుండటంతో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఒక్కరు మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఎక్కువమంది గుమిగూడొద్దని సూచించింది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా పబ్స్, రెస్టారెంట్స్, బార్స్లో మాస్క్ తప్పనిసరి చేయాలని ఆదేశించారు.

సిరిసిల్ల సెస్ బీఆర్‌ఎస్‌దే

సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో మొత్తం స్థానాలను(15) బీఆర్‌ఎస్ పార్టీ గెలిచింది. దీంతో  బీజేపీని రాష్ట్ర ప్రజలు మరోసారి తిరస్కరించారని, ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా సెస్ ఎన్నికల్లో గెలవలేకపోయిందని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే, ఐదు  స్థానాల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలిచినప్పటికీ ఫలితాలను తారుమారు చేశారని బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు.

హైదరాబాద్ చేరుకున్న ప్రెసిడెంట్

శీతాకాల విడిదిలో భాగంగా  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం తొలిసారి హైదరాబాద్‌ కు వచ్చారు. ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం వెళ్లొచ్చారు. ఈనెల 30  తేదీ వరకు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేయనున్నారు. హకీంపేట ఎయిర్​ పోర్టులో రాష్ట్రపతి ముర్ముకు సీఎం కేసీఆర్​ స్వాగతం పలికారు.  

రాజ్‌భవన్‌లో బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముచ్చట్లు

తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, గవర్నర్ తమిళి సై  సౌందరరాజన్ రాజ్ భవన్‌లో విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.  ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుకోవడం.. మంత్రులు, రేవంత్ రెడ్డి మాట్లాడుకోవడం ఆసక్తికరంగా మారింది.

బండి సంజ‌య్‌ను పరిచయం చేసిన కేసీఆర్

హకీంపేట్ ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికే కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పుడూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే అధికార, విపక్ష నేతలు ఒకే వేదికపై కనిపించారు. ముర్ముకు స్వాగతం పలికేందుకు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా హాజరయ్యారు.వరుస క్రమంలో నేతలంతా వేదికపైకి వస్తూంటే.. కేసీఆర్​ ఒక్కరొక్కరుగా వాళ్లను రాష్ట్రపతికి పరిచయం చేశారు. అదే క్యూలో బీఆర్ఎస్ నేతల తర్వాత బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రావటంతో.. వాళ్లను కూడా కేసీఆర్​ పరిచయం చేశారు.

పాక్ కుట్ర భగ్నం

భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలతో గుజరాత్ తీరంలో భారత జలాల్లోకి ప్రవేశించిందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ బోటును భారత తీర రక్షక దళం పట్టుకుంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలతోపాటు రూ.300 కోట్ల విలువ చేసే 40 కేజీల డ్రగ్స్ కూడా బోటులో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులోని పదిమందిని అదుపులోకి తీసుకున్నారు.

సుశాంత్‌ సింగ్‌ది హత్యనే

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ హత్యకు గురయ్యాడని, ఆయన ఒంటిపై గాయాలున్నాయని కూపర్ ఆసుపత్రిలో మార్చురీ సర్వెంట్‌గా పనిచేసిన రూప్ కుమార్ షా సంచనల విషయాలు బయటపెట్టారు. సుశాంత్ ఒంటిపై (మృతదేహం) గాయాలు తనకు కనిపించాయని, ఆ విషయాన్ని తన సీనియర్ దృష్టికి తీసుకు వెళ్లగా, దానిగురించి తర్వాత మాట్లాడదామని ఆయన అన్నారని షా చెప్పారు. రాజ్‌పుట్ హత్య కేసుపై దర్యాప్తు సాగిస్తున్న ఏజెన్సీ(సీబీఐ) ముందు స్టేట్‌మెంట్ రికార్డు చేసేందుకు కూడా తాను సిద్ధమేనని తెలిపారు.

ఇంట్లో కత్తులు ఉండాలె‌

బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదస్ప వ్యాఖ్యలు చేశారు. తమపైన, తమ గౌరవంపైన దాడులు జరిపే వారికి దీటుగా జవాబిచ్చే హక్కు హిందువులకు ఉందన్నారు. తమను తాము రక్షించుకునేందుకు ఇళ్లల్లో పదనైన కత్తులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా పని చేయాలని‌ పిలుపునిచ్చారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here