ప్రిన్సెస్ దుర్రు షెవార్ దుర్దానా బేగమ్ సాహిబా!…
ఆమె ఓ యువరాణి.
బేరార్ సంస్థానపు యువరాణి.

ఓట్టోమాన్ ఖలీఫాల వంశంలో కాన్‌స్టాంటినోపుల్‌లో కామ్లికాలో (ఇప్పుడు టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉంది ఈ ప్రాంతం) పుట్టిన ఆ యువరాణి… ఇక్కడి మన హైదరాబాద్‌కు చెందిన చివరి, ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్… పెద్దకొడుకు ఆజమ్ షాను పెళ్లి చేసుకుంది. దాంతో మెట్టినిల్లయిన హైదరాబాద్‌లో ఆమె జ్ఞాపకార్థం ఓ హాస్పిటల్‌కు ఆమె పేరు పెట్టారు. అదే ‘దుర్రు షెహ్‌వార్ చిల్డ్రన్స్ అండ్ జనరల్ హాస్పిటల్. తొలుత ప్రసూతి, చిన్నపిల్లల హాస్పిటల్‌గా ఉన్న అది… ఆ తర్వాత అన్ని స్పెషాలిటీలూ అందుబాటులో ఉండే జనరల్ హాస్పిటల్‌గా మారింది.
మన హైదరాబాద్‌లోని… నిజాం మ్యూజియమ్‌కు సమీపంలోని జెహరానగర్ కాలనీ, పునారీ హవేలీ, పత్థర్‌గట్టీ ప్రాంతంలో ఇది దాదాపు 11,300 చదరపు గజాల (9,400 చదరపు మీటర్ల) సువిశాల స్థలంలో ఏర్పాటైన ఈ హాస్పిటల్ దాదాపు 200 పైగా పడకలతో నిత్యం ఎంతోమందికి సేవలందిస్తోంది. మరీ ముఖ్యంగా అప్పుడే పుట్టిన చిన్నారులకూ, చిన్నప్లిలలకు. ఎక్కడో కాన్‌స్టాంటినోపుల్‌లో పుట్టి… ఫ్రాన్స్‌లో పెరిగి, హైదరాబాద్ మెట్టి, లండన్‌లో కన్నుమూసిన ఆ రాణి పేరిట వెలసిన హాస్పిటల్ చూడటానికీ… తెలుసుకోడానికీ ఓ అద్భుతం. అందుకే ఈ అద్భుతాన్ని తెలుసుకోవడం ఓ అవసరం.