హైదరాబాదీ ఫుడ్ అంటే… దిల్‌ఖుష్…! దిల్‌పసంద్…!!
హైదరాబాద్ అనగానే అందరూ బిర్యానీ బిర్యానీ అంటారుగానీ… అసలు అసఫ్‌జాహీలు తమ కీర్తిపతాక మీద ‘కుల్చా’ అనే రోటీని ముద్రించి ఫుడ్ ఫేవరేట్స్ నవాబులనిపించారు.
‘మేము ఫుడీస్‌మీ… మేము ఫుడీస్‌మీ’ అంటూ చాలామంది అంటూ ఉంటారుగానీ… ఈ నవాబుల దర్జా ప్రపంచంలో ఎవరికీ లేదనుకుంటా. ఎందుకంటే… ఎంత ఫుడీ అయితే మాత్రం… తమ రాజపతాక మీద తాము ఇష్టంగా తినే కుల్చా రోటీ రాచముద్రికను రెపరెపలాడించారు.
ఇక ఇప్పుడొద్దాం బిర్యానీకి. జెండా మీదికి ఎక్కించలేదుగానీ మండీ బిర్యానీతో దానికీ ఉచితస్థానమిచ్చారు హైదరాబాద్‌లో. అందుకే దాన్ని తెలుగులో చెప్పాలంటే ‘రాచబిర్యానీ’ అనొచ్చు. అదెలాగంటారా… ‘‘షాహీ బిర్యానీ’’ అంటే అర్థం అదే కదా.
ఇక బిర్యానీని అలా వదిలేశారా? లేదు… మళ్లీ తమకు ఇష్టం వచ్చినట్టుగా… ఇష్టమైన తీర్లలో తీరునొక్క బిర్యానీలు వండివార్చుకున్నారు…. జఫ్రానీ బిర్యానీ మొదలుకొని… మటన్, చికెన్, ఫిష్, వెజిటబుల్… అలా ఎన్నెన్నో. అందుకే బిర్యానీ అంటే దమ్మున్న బిర్యానీ… కాబట్టే అది ‘దమ్’బిర్యానీ.

జేబునిండుగా… పొట్టనిండుగా ఆకలి ఉంటే… ఏదో కాసింత చిల్లర ఉన్నా చాలు… కేవలం చాయ్ బిస్కెట్‌తోనే కడుపు నిండుతుంది. అందులోనూ మళ్లీ ఎన్నెన్నో… ఉస్మానియా, సాదా, క్రీమ్‌వాలా, టై బిస్కెట్… లాంటి వాటితో కడుపు పూర్తిగా నిండకపోయినా… ఆకలి కరకరలకూ, లేమి చిరచిరలకూ ‘టై’ బిస్కట్ మ్యాచ్ ‘టై’ అవుతుంది.
ఆ బిస్కెట్లు దొరికే ఇరానీ కెఫెల్లోనే ఛోటా సమోసా, ఆలూసమోసా, లుఖ్మీ… ల్లాంటి కాస్తంత పెద్ద శ్నాక్స్ ఇంకాస్త మీడియమ్ మిడిల్ లగ్జరీనిస్తాయి.
పొద్దున్నే న్యహారీ, జబాన్‌ల బ్రేక్‌ఫాస్ట్‌తో మొదలుపెడితే… సాయంత్రానికీ పాయా షేర్వా లేదా సిరా అనే తల్కాయ్ కూరా…తో షిర్‌మాల్ తందూరీ ముక్కలు ముక్కలు చేసి… వాటిని నానేసి తింటూ అటూ సూర్యోదయం… ఇటు అస్తమయం రెండూ నాలుక మీదే అయిపోతాయి. ‘తలాహువా’తో రుమాలీరోటీ తినేసి… రుమాలుతో మూతీ, చెయ్యీ తుడిచేసుకుంటే ’ఫజల్ అల్లాహ్ కా’… ఇక ఆ పూటకు నాష్తా హోగయా.
కాస్తంత తీపి తగలనిద్దామా… ఇంకెందుకు ఆలస్యం… క్రీమ్ బన్, దిల్‌పసంద్‌తో దిల్‌ఖుష్! ఇంకాస్త హెవీ అంటూ డబుల్‌కా మీఠా, ఖుబానీ కా మీఠా, షాహీ తుక్‌డా!!
ఇంతా చేసి హలీమ్ గురించి చెప్పకపోతే… ముస్లింలు ఎలాగూ రోజా ముగిశాక ఇఫ్తార్‌లో తిననే తింటారు… వాళ్లతో పాటు హిందువులూ మిగతా అందరూ తయారు. అదే నేతలు మాటిమాటికీ దొహరాయించే ‘గంగా జమ్నా తహజీబ్’!
తహజీబ్ అంటే సంస్కృతి అంట… మరి దాంట్లో రెండో సగం మట్టుకే తీసుకుంటే ఆ ‘జీబ్’ అనే మాట అర్థమేమిటో తెలుసా… అది మరేమిటో కాదు… ‘జిహ్వ’ అని పిలిచే నాలుక.
వెరసి ఇదీ నవాబుల రుచుల కబాబుల కబుర్లు!!