కొంత మంది ఒక విషయం అయిపోయినా.. ఇంకా దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. అక్కడే ఆగిపోయి మిగిలిన జీవితాన్ని డంబ్ లా బతికేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఒక్కోసారి చిన్న చిన్న ఆనందాలే ముఖ్యమని అంటున్నారు. జరిగేదేదో జరుగుతుంది.. అతిగా ఆలోచించి జీవితాలను నాశనం చేసుకోకండని సూచిస్తున్నారు.
అతిగా ఆలోచిస్తే..
1. అతిగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి కరువవుతుంది. ఎంత కష్టపడ్డా, ఏం చేసినా ధ్యాస మాత్రం వేరే దానిపైకి వెళ్తుంది. ఫలితంగా విజయం దక్కడం గగనమే అవుతుంది.
2. పని భారం వల్ల ఈ రోజుల్లో చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దాని వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. అలా ఆ పని గురించే, ఒత్తిడి గురించే ఆలోచించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం ఖాయం.
3. చిన్న విషయాలనే పెద్దగా ఆలోచించడం, అతిగా స్పందించడం ధీర్ఙకాలంలో ఎన్నో ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. దీని వల్ల నిద్ర లేమి, మానసిక ఆందోళన, రక్తపోటులో హెచ్చుతగ్గులు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా మెదడు కణాలపై ఒత్తిడి పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు చాలా కాలం పాటు కొనసాగవచ్చని చెబుతున్నారు.
4. మితిమీరిన ఆలోచన.. ఆందోళన, చెడు ప్రతికూల ఆలోచనలు, మనశ్శాంతిని పాడుచేయడమే కాకుండా, సంతోషకరమైన హార్మోన్లను కూడా ఉత్పత్తి చేయనివ్వవు.5.
5. నిత్యం ఆలోచిస్తూ.. ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా ఉంటే.. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మానసిక కుంగుబాటు, తరచు తలనొప్పులు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వ్యాధులు వేధించడం మొదలవుతాయి.
6. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం మంచిదే. కానీ దాని వల్ల బాధే మిగుల్తుంది అంటే.. వాటిని తల్చుకోకపోవడమే ఉత్తమం. ఏడుపు ఆరోగ్యానికి ఓ రకంగా మంచిదే. కానీ అది మితిమీరితే శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ క్రమంగా మనిషి శరీరంలోని రక్షణ వ్యవస్థ దెబ్బతింటుంది.
7. ఒకే విషయం గురించి అదే పనిగా ఆలోచిస్తూ కూర్చుంటే చర్మవ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు, అతిగా ఆలోచించడం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాల లక్షణాలన్నీ పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.