కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్, జయప్రద ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం సాగరసంగమం. 3 జూన్ 1983న విడుదలైన ఈ సినిమాను పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. ఇందులో ఎస్.పి.శైలజ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలను వేటూరి సుందరరామ్మూర్తి రచించారు.
ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందించారు. తమిళంలో సలంగై ఒలి (మువ్వల సవ్వడి అని అర్థం) అనే పేరుతో, తెలుగులోసాగర సంగమం అనే పేరుతో విడుదలైంది. తెలుగులో 35 కేంద్రాల్లో, తమిళంలో 30 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ, హైదరాబాదు నగరాల్లో సిల్వర్ జూబిలీని పూర్తి చేసుకుంది. బెంగళూరు, మైసూరు నగరాల్లో ఏడాదిన్నర పాటు ప్రదర్శించబడింది.ఈ సినిమా రెండు జాతీయ పురస్కారాలు, ఆరు నంది పురస్కారాలు గెలుచుకుంది.
హీరో పాత్రకు కమల్ హాసన్ ని సంప్రదిస్తే చేయనని చెప్పారట. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తరువాత అలంటి పాత్రలే వస్తాయన్న భయంతో. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన “కడల్ మీన్గళ్” అనే తమిళ సినిమా పరాజయం పొందడంతో హాసన్ కు ఆ సెంటిమెంట్ బలంగా ఉండేది. ఆ పాత్రను అతడితోనే చేయించాలన్న నిర్మాత నాగేశ్వరరావు ఐదారు నెలలు అతడి వెంటపడి బతిమాలి ఒప్పించారట.
ఇక హీరోయిన్ గా ముందుగా జయసుధను అనుకున్నారు. ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు నృతం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నారు విశ్వనాథ్. అయితే అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్.పి.శైలజను ఆ పాత్రకు సిఫార్సు చేశారు. నాగేశ్వరరావు. అందుకు విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం ఒప్పుకున్నారు.శంకరాభరణంతో పేరు సంపాదించిన మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్ళి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది.
శరత్ బాబుతో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటరుకి వచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్ కు డబ్బింగ్ చెప్పాడు.జయప్రద భర్త పాత్ర పోషించిన మోహన్ శర్మకు గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పాడు. “వేవేల గోపెమ్మలా” పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు.
ఈ చిత్రంలో దర్శకుడు నటుల హవభావాల ద్వారా,సన్నివేశాల్లో చుట్టూ వున్న పరిస్థితుల ద్వారా భావాన్ని వ్యక్తపరిచారు.
రష్యన్ భాషలోకి అనువాదమైన తొలి తెలుగు చిత్రం ఇది.
ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటించిన ప్రసిద్ధ గాయని ఎస్.పి. శైలజ తన జీవితానికి ఈ ఒక్క పాత్ర చాలునని మళ్ళీ నటించలేదు