భారీగా ఐపీఎస్​ల బదిలీ.. చల్లబడ్డ కాంగ్రెస్​ సీనియర్లు.. థియేటర్లలో ఫుడ్​ అనుమతిపై సుప్రీం కీలక తీర్పు.. టుడే టాప్​ న్యూస్​

కాంగ్రెస్ సీనియర్లకు ఖర్గే ఫోన్

బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణా తరగతులకు హాజరుకావాలని ఆ పార్టీ సీనియర్ లీడర్లకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. పీసీసీ‌ చీఫ్ రేవంత్‌పై అసంతృప్తితో ఉన్న సీనియర్లు, ఖర్గే కాల్‌తో బుధవారం జరిగే ఈ మీటింగ్ కు వెళ్లాలా ? వద్దా? అనే ఆలోచనలో పడ్డారు. తెలంగాణ పీసీసీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న సీనియర్లు పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడే నేరుగా ఫోన్ చేసి అడిగినందున వెళ్లకపోతే బాగుండదన్న అభిప్రాయం కొందరు సీనియర్లు వ్యక్తం చేశారు.  

29 మంది ఐపీఎస్‌ల‌ బదిలీ

రాష్ట్రంలో 29 మంది ఐపీఏ‌లను బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సిటీ కమిషనర్ సీవీ ఆనంద్‌కు అదనంగా యాంటి నార్కొటిక్ బ్యూరో పగ్గాలు అప్పగించారు. పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ సాండిల్యాను నియమించారు.

థియేటర్లకు ఫుడ్ పై సుప్రీం కీలక తీర్పు

సినిమా థియేటర్స్‭లోకి తినుబండారాల అనుమతి పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బయటి నుంచి ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకురాకుండా అడ్డుకునే హక్కు సినిమాహాళ్లు, మల్టీప్లెక్స్ యజమానులకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. థియేటర్లు, మల్టీప్లెక్స్ ల్లో అందుబాటులో ఉన్న వాటిని వినియోగించుకోవాలా వద్దా అన్నది ప్రేక్షకుడి ఇష్టమని తెలిపింది. హాల్స్ వద్ద స్నాక్స్, కూల్ డ్రింక్స్‭ను.. సినిమా ప్రేక్షకుడు ఖచ్చితంగా కొనుగోలు చేయాలన్న నిబంధన ఏం లేదని.. ప్రేక్షకుడు అవసరమైతేనే స్నాక్స్ కొనుగోలు చేస్తాడని చెప్పింది.

అర్దరాత్రి వరకూ మెట్రో సేవలు

నాంపల్లి నుమాయిష్ సందర్బంగా మెట్రో టైమింగ్స్ను పొడిగించారు. అర్ధ‌రాత్రి 12 గంటల వ‌ర‌కు మెట్రో రైళ్ల‌ను న‌డ‌ప‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ వ‌ర‌కు అర్ధ‌రాత్రి 12 గంటల వ‌ర‌కు రైళ్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు చివ‌రి మెట్రో రైలు ప్రారంభమై ఒంటిగంట వరకు గ‌మ్య‌స్థానానికి చేరుకోనున్నాయి. ఎల్బీన‌గ‌ర్ – మియాపూర్, నాగోల్ – రాయ‌దుర్గం మార్గాల్లో స‌మ‌యం పొడిగించారు. గాంధీ భ‌వ‌న్ మెట్రో స్టేష‌న్‌లో టికెట్ బుకింగ్ కౌంట‌ర్ల సంఖ్య‌ను 6కు పెంచినట్లు అధికారులు తెలిపారు.

ట్రాఫిక్‌ పోలీస్‌గా మారిన దగ్గుబాటి సురేష్

ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు దిగి ట్రాఫిక్ కంట్రోల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‭గా మారింది. జూబ్లీహిల్స్‭లో సామాన్య పౌరుడిగా నిలబడి ఆయన ట్రాఫిక్ క్లియర్ చేశారు. జూబ్లీహిల్స్‭లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో ఉండిపోయిన సురేశ్ బాబు  తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్‭ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ కాసేపు ట్రాఫిక్‭ను నియంత్రణలోకి తీసుకొచ్చారు. అక్కడున్న కొందరు సురేష్ బాబు చేస్తున్న పనిని వీడియో తీసి నెట్టింట పోస్టు చేయగా వైరల్ అవుతోంది.

తెలంగాణలో తెలంగాణ బజార్​ ఉందా: సంజయ్​

భారత్లో భారత్ బజార్ ఉంటదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏపీ నేతలు బీఆర్ఎస్ చేరిక సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. భారత్లో చైనా బజార్లు తప్ప భారత్ బజార్లు కన్పించలేదని కేసీఆర్ అన్నారని.. అలా అయితే తెలంగాణలో తెలంగాణ బజార్ ఉందా అని అడిగారు. మిగితా దేశాల్లో భారత్ బజార్లు ఉంటాయని.. స్వదేశంలో ఎందుకుంటాయని నిలదీశారు. మైసూర్ పాక్ అంటే మైసూర్లో తయారు చేస్తారా.. ఇరానీ చాయ్ ఇరాన్లో తయాచేస్తారా అని ఎద్దేవా చేశారు.

తేలిన శిశువుల తారుమారు పంచాయితీ

మంచిర్యాల జిల్లాలో శిశువుల తారుమారు ఘటనలో చిక్కుముడి వీడింది. మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ సమక్షంలో సీల్డ్ కవర్‭లోని డీఎన్​ఏ రిపోర్టును వైద్యశాఖ అధికారులు విడుదల చేశారు. చెన్నూరు మండలం రొయ్యపల్లి గ్రామానికి చెందిన మమతకు కూతురు పుట్టిందని.. ఆసిఫాబాద్ కు చెందిన పావనికి కొడుకు పుట్టినట్లుగా ధృవీకరించారు. ఇటీవల మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 28న 10 నిమిషాల వ్యవధిలో ఇద్దరు శిశువులు జన్మించారు. ఒకరి శిశువును మరొకరికి అప్పగించటం వివాదాస్పదమైంది. తమకు బాబు పుట్టాడంటే తమకు బాబు పుట్టాడంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చివరకు డీఎన్​ఏ టెస్ట్ రిజల్ట్ ద్వారా అధికారులు ఎవరి బిడ్డను వాళ్లకు అప్పగించారు.

ప్రేమించి పెండ్లాడినందుకు ఇంటిని తగులబెట్టిర్రు

హుజురాబాద్ మండలంలోని ఇందిరానగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కారణంతో అబ్బాయి ఇల్లును అమ్మాయి తరపు బంధువులు తగులబెట్టారు. హుజురాబాద్ కు చెందిన రాజశేఖర్ అదే గ్రామానికి చెందిన సంజనను ప్రేమించాడు ఇటీవలే వేములవాడలో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటంబసభ్యులు, బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. అబ్బాయి ఇంటిపై దాడి చేసి ఇల్లు తగలబెట్టారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. కానీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దగ్ధమయ్యాయి.

గెలిచిన భారత్

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి ఓవర్‌లో లంక 13 పరుగులు చేయాల్సి ఉండగా.. అక్షర్‌ అదిరిపోయే ఓవర్ వేసి భారత జట్టుకు విజయాన్ని చేకూర్చాడు. ఈ పోరులో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 160 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here