భూపాలపల్లి (ఆచార్య జయశంకర్) జిల్లాను, పూర్వపు వరంగల్
జిల్లా నుంచి ఏర్పాటు చేశారు. ఈ నూతన జిల్లాలో కరీంనగర్, ఖమ్మం
జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలిపారు. ఈ జిల్లాకు తెలంగాణ
సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పేరును తెలంగాణ ప్రభుత్వం
ఖరారు చేసింది. ఈ జిల్లా చుట్టుపక్కల పెద్దపల్లి, హన్మకొండ,
మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, ములుగు జిల్లాలతో పాటు,
ఛత్తీస్ గఢ్, మహారాష్ట్రలు విస్తరించి ఉన్నాయి. మొత్తం 11 మండలాలు
ఒక రెవెన్యూ డివిజన్- (భూపాలపల్లి) ఈ జిల్లా కలిగి ఉంది.
జిల్లా ప్రధాన కేంద్రం భూపాలపల్లిలో ఏర్పాటైంది.
జిల్లాలో ప్రధాన జీవనోపాధి వ్యవసాయం. వరి, మిర్చి, పత్తి,
పసుపు ప్రధాన పంటలు. కాకతీయుల కాలంలో నిర్మించిన దేవాదుల
ఎత్తిపోతల, చెరువులు వ్యవసాయానికి ప్రధాన నీటి వనరులు. సింగరేణి
కాలరీస్, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు, కొన్ని చిన్న వ్యవసాయ
ఆధారిత పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి.
భూపాలపల్లి రోడ్డు మార్గం ద్వారా అనుసంధానమై ఉన్నది.
163వ నెంబరు జాతీయ రహదారి జిల్లా గుండా వెళుతుంది.
భూపాలపల్లిలో ఒక బస్సుడిపో ఉన్నది.
జిల్లా ప్రత్యేకతలు: మహదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వరంలో
నెలకొన్న కాళేశ్వర, ముక్తేశ్వర దేవాలయం పెద్ద సంఖ్యలో భక్తులను
ఆకర్షిస్తున్నది. ఇవి కాకతీయుల కాలంలో నిర్మితమయ్యాయి. కాళేశ్వరం
దక్షిణ త్రివేణీ సంగమంగా ప్రసిద్ధి పొందింది. గోదావరి, ప్రాణహిత,
మూడో నది అంతర్వాహినిగా (సరస్వతి) ఇక్కడ కొనసాగుతుంది.
శివుడు, యముడి లింగాలు ఒకే వేదికపై ఉండటం కాళేశ్వర క్షేత్రంలోని
ప్రత్యేకత. ఇంకా జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే కొన్ని ప్రధాన
సరస్సులు కూడా ఉన్నాయి.
తెలంగాణ నయాగరా అని పిలిచే బొగత జలపాతం ఈ జిల్లాలోని
వాజేడు మండలంలో కలదు. ఈ జిల్లాలో వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి.
అవి బొగ్గుల వాగు ప్రాజెక్టు, గుండ్లవాగు ప్రాజెక్టు, కంతనపల్లి సుజల స్రవంతి,
దేవాదుల ఎత్తిపోతల మరియు కాళేశ్వరం (మేడిగడ్డ) ఎత్తిపోతల ప్రాజెక్టులున్నాయి.