ఎంఎం శ్రీలేఖ సింగర్ గా, సంగీత దర్శకురాలిగా అందరికీ సుపరిచితురాలే. శ్రీలేఖ ఫ్యామిలీ కూడా సీనీ ఫీల్డ్ కావడంతో సినిమాలపై ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఎక్కువగా ఉండేది. తొమ్మిదేళ్ల వయసులో ప్లేబ్యాక్ సింగర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన 12ఏళ్ళవయస్సులోనే సంగీత దర్శకురాలి కెరీర్ స్టార్ట్ చేసింది.
1992లో విజయ్ హీరోగా వచ్చిన నాలయ తీర్పు చిత్రం ఆమెకు మొదటిది. ఈ చిత్రం విజయ్ కు కూడా తొలి చిత్రం కావడం విశేషం. ఇక తెలుగులో 1994 లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన నాన్నగారు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా శ్రీలేఖ రికార్డు సృష్టించారు.
ఈ ఘనత సాధించినట్టుగా బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా సురేష్ ప్రొడక్షన్స్ లో 13 చిత్రాలకి సంగీతం అందించారు. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీవల్లి ఆమెకు 75 వ చిత్రం కావడం విశేషం. శ్రీలేఖ 2003లో పుట్ట ప్రసాద్‌ను వివాహం చేసుకుంది.