మాస్క్ తప్పదు
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారత్ లో కొత్త వేరియంట్లు విస్తరించకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు పెట్టుకోవాలని సూచించింది. చైనా, జపాన్, అమెరికా సహా పలు దేశాల్లో మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాంఢవీయ ఆధ్వర్యంలో హైలెవల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కరోనా పరిస్థితులపై ప్రతీ వారం సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
ఇండియాలోనూ కరోనా బీఎఫ్ 7
చైనాలో కరోనా ఉధృతికి కారణమైన బీఎఫ్.7 వేరియంట్ కేసులు ఇండియాలోనూ నమోదవుతున్నాయి. ఈ వేరియంట్ తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుజరాత్లో రెండు కేసులు, ఒడిశాలో ఒక కేసు నమోదైంది. భారత్‌లో బీఎఫ్.7 వెలుగు చూసినప్పటికీ.. కేసుల్లో పెరుగుదల లేదని కోవిడ్ పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు.
ఆందోళన అనవసరం
పొరుగున ఉన్న చైనాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ భారతీయులు మరీ ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఇండియా సాధించిన అద్భుతమైన వ్యాక్సినేషన్ కవరేజ్, ట్రాక్ రికార్డు కారణంగా ప్రజలు ఆందోళన చెందనక్కరలేదని అన్నారు. భారత ప్రభుత్వం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని సూచించారు. కొవిషీల్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తయారు చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓగా పునావాలా ఉన్నారు.
నా గురించి గూగుల్ అంకుల్‌ను అడగండి: చంద్రబాబు
హైదరాబాద్లో తాను చేసిన అభివృద్ధి గురించి గూగుల్ అంకుల్ను అడిగితే తెలుస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వంటి ఐటీ కంపెనీలు రావడానికి ఫౌండేషన్ వేసిన ఘనత టీడీపీదేనని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ కు కంపెనీలు తరలివస్తున్నాయంటే..అందుకు టీడీపీ సృష్టించిన ఎకో స్టిస్టమే అని గుర్తు చేశారు. వయసులో పెద్దవాడిని అయినా.. టీనేజర్స్ ఎలా ఆలోచిస్తారో అలానే ఆలోచిస్తానన్నారు. ఖమ్మంలో బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు.. హైటెక్స్ సిటీని 14 నెలల్లో పూర్తి చేశామన్నారు. ఉద్యోగాలు, ఉపాధి వస్తుందని కంపెనీల చుట్టూ తిరిగానని చెప్పారు. ఎన్నోసార్లు తిరిగితే కాని బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ దొరకలేదన్నారు. హైదరాబాద్‌కు ప్రపంచ పటంలో గుర్తింపు రావాలని.. ఆ రోజు ఐఎస్బీ కోసం పాటుపడ్డానని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, అన్నింటికి ఒక ఎఫర్ట్ ఉందని చంద్రబాబు చెప్పారు.
క్రీస్తు సూచనలు పాటిస్తే యుద్ధాలే ఉండవు: కేసీఆర్
క్రీస్తు సూచనలు పాటిస్తే ఇతరుల పట్ల అసూయ, ద్వేషం ఉండవని అసలు యుద్దాలు జరగవని.. జైళ్ల అవసరం కూడా ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు. తుది శ్వాస విడిచే వరకు వసుధైక కుటుంబంగా ఉండాలని కాంక్షించిన వ్యక్తి జీసస్ అని గుర్తు చేశారు. క్రీస్తు తర్వాత అనేక మంది స్వేచ్ఛ కోసం స్వతంత్రం కోసం ప్రయత్నం చేశారని చెప్పారు. క్రీస్తు మార్గంలో పయనించి.. విజయం సాదిద్దామని కోరుకుందామన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన క్రైస్తవ పెద్దలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కేసీఆర్‌తో కవిత భేటీ
సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. లిక్కర్ కేసులో ఈడీ చార్జిషీట్, అలాగే ఇటీవలి పరిణామాలు, సీబీఐ దర్యాప్తు విషయాలపై లీగల్ ఎక్స్ పర్ట్స్‌తో చర్చించినట్లు తెలిసింది.
కేటీఆర్‌పై మండిపడ్డ సంజయ్
మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై బీజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్‌కు మదమెక్కిందని.. దొంగలు పడ్డాక ఆరు నెలలకు స్పందించాడని అన్నారు. చెల్లి కవిత అరవింద్ ను చెప్పుతో కొడతానందని.. కేసీఆర్ తనను ఆరు వక్కలు చేస్తానన్నాదని.. ఇప్పుడు కేటీఆర్ చెప్పుతో కొడతానంటున్నాడని.. డబ్బులు ఎక్కువై ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నేను తంబాకు తింటున్నట్లు ఆరోపణలు చేసినప్పుడు నీ సంస్కారం ఏడబోయిందని ప్రశ్నించారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసు బయటపడ్డాక వెంటనే ఎందుకు మాట్లాడలేదని.. దొంగలు పడ్డాక ఆరు నెలలకు ఎందుకు స్పందించాడని నిలదీశారు.
అమిత్‌షాతో అర్వింద్ భేటీ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయిన అర్వింద్.. బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో తాజా రాజకీయాలు, బీజేపీ బలోపేతం, పార్టీలో చేరికలు గురించి చర్చించానని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ నాయకుల ప్రజా వ్యతిరేక విధానాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానన్నారు.
హైదరాబాద్ లో దిగ్విజయ్ సింగ్
కాంగ్రెస్ పంచాయితీని పరిష్కరించేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. పార్టీలోని సీనియర్లు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతలను ఏఐసీసీ దిగ్విజయ్‌సింగ్‌కు అప్పగించింది. దీంతో బుధవారం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మరో నేత హర్కరి వేణుగోపాల్ ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు ఆయన సీనియర్ నేతలతో భేటీ కానున్నారు
చార్లెస్ శోభరాజ్ విడుదల
ఫ్రాన్స్ కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ రాజ్ ను రిలీజ్ చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అతడి వయసును దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలని పేర్కొంది. నేపాల్ జైలులో 2003 నుంచి శోభ రాజ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇద్దరు అమెరికన్ టూరిస్టులను ఖాట్మండులో హత్య చేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. దీంతో అతడు 2003 నుంచి జైలులో ఉన్నాడు.
యాక్సిడెంట్‌లో 15 మంది మృతి
మణిపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు బోల్తా పడి.. 15 మంది విద్యార్థులు చనిపోయారు. నోనీ జిల్లాకు చెందిన థంబాల్ను స్కూల్ విద్యార్థులు రెండు బస్సుల్లో స్టడీ టూర్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. మార్గమధ్యలో లాంగ్ సామ్ ప్రాంతాల్లో అమ్మాయిలు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సహాయక చర్యలు చేపట్టాయి.