అక్కడ ఒకేసారి పదివేల మంది నమాజీలు హాజరై… నమాజ్ చదవగలరు.
అక్కడ ఒకేసారి పదివేల పావురాళ్లు చేరి… పవిత్ర ఆయత్‌లలా తమ కువకువలు వినిపిస్తుండగలవు.
రోజుకు ఐదుసార్లు అక్కడ నమాజ్‌కు ముందు ‘ప్రార్థనకు రారమ్మంటూ పిలిచే ‘ఆజాన్’ వినిపిస్తూ ఉంటుంది. రోజూ ప్రార్థనలు ఎలాగూ ఉండనే ఉంటాయి. ప్రత్యేకంగా… అక్కడ జుమ్మా(శుక్రవారాల్లో) శాంతికపోతాల్లాంటి తెల్లటి దుస్తులు ధరించిన భక్తులు అచ్చం పావురాళ్లలాగే అల్లాహ్ ముందు మోకరిల్లి ‘సిజ్‌దా’ చేస్తూ… నమాజ్ చదువుతారు. ప్రార్థనలాలపిస్తారు.
అదే… మక్కా మసీదు.
భారతదేశంలో ఉన్న అతి పెద్ద మసీదుల్లో… హైదరాబాద్‌లోని ఈ మసీదూ ఒకటి. అల్లంత దూరంలో చార్మినార్… మరోవైపున చౌమొహల్లా ప్యాలెస్… కూతవేటు దూరంలో లాడ్ జజార్… ఎదురుగా అత్యంత పురాతనమైన యునానీ హాస్పిటల్. ఇవీ దాని పరిసర ప్రాంతాలు.
సుమారుగా 1617 ప్రాంతంలో కుత్‌బ్‌షాహీ వంశానికి చెందిన ఆరో పాలకుడు…
సుల్తాన్ మహమ్మద్ కుతుబ్‌షా తనే స్వయంగా ఆ మసీదుకు పునాదిరాయి వేశాట్ట. ఆ తర్వాతెప్పుడో 1693 ప్రాంతాల్లో మొఘల్ పరిపాలకుడు ఔరంగజేబ్ దాన్ని పూర్తి చేశాట్ట. అంటే… దాన్ని పూర్తి చేయడానికి దాదాపు 76 ఏళ్లు పట్టిందన్నమాట. అనేక కారణాలతో అంతటి సుదీర్ఘకాలం పాటు మసీదు రూపొందే ప్రక్రియను చెక్కుతున్నట్టుగా మెల్లగా, నెమ్మదిగా చేశారన్నమాట.
నిర్మాణానికి అవసరమైన కొన్ని రాళ్లనూ, ఇటుకలనూ, మట్టినీ సాక్షాత్తూ మక్కా నుంచి తేచ్చి… ఇక్కడ మసీదును నిర్మించడం వల్ల దాన్ని ‘మక్కా మసీదు’ అన్నారు.
అత్యంత సువిశాలమైన ఈ మసీదులో ప్రార్థనా ప్రాంగణం… 225 అడుగుల (69 మీటర్ల) వెడల్పు, 180 అడుగుల (55 మీటర్ల) పొడవుతో దాదాపు 10వేల మంది నమాజ్ చేసుకునేంత సౌకర్యంగా ఉంటుంది. గచ్చు నుంచి 75 అడుగుల (23 మీటర్ల) ఎత్తుంటుంది. ఆ ప్రాంగణానికి ముందుగా ఐదు ఆర్చీలు… నమాజీలను స్వాగిస్తున్నట్టుగా ఉంటాయి. ముందుభాగాన రెండు మీనార్లు సమున్నతంగా నిటారుగా ఠీవిగా నిలబడ్డట్లు కనిపిస్తుంటాయి. ఆ మీనర్లపైన చుట్టురా కొన్ని కొన్ని నగిషీలూ ఉన్నాయి. వెనక మరికొన్ని సన్నటి మినార్లు కూడా. ఇక ప్రధాన ప్రాంగణానికి ముందు సువిశాలమైన స్థలముంటుంది. అక్కడ నమాజ్‌కు ముందుగా కాళ్లూ చేతులూ శుభ్రపరచుకునే ప్రక్రియ ‘వజూ’ కోసం నీటికొలనుంటుంది.
ఎంతో అద్భుతంగా ఉండే ఈ మసీదును ప్రార్థన చేసే నమాజీలు మాత్రమే కాకుండా… ఎంతోమంది సందర్శకులూ సందర్శిస్తుంటారు. అందుకే 2014లో మరికొన్ని నిర్మాణాలతో పాటూ… ఈ మసీదునూ కలుపుకుని… వీటన్నింటినీ ‘‘వరల్డ్ హెరిటేజ్ సైట్స్‌గా పేర్కొంటూ తన టెంటెటివ్ లిస్ట్‌లో నమోదు చేసుకుంది యునెస్కో.