ప్రీతి డెత్ మరో మలుపు
అత్యంత సంచలనం సృష్టించిన కేఎంసీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి డెత్ కేస్ మరో మలుపు తిరిగింది. ఎంజీఎం ఆస్పత్రిలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట.. మిడాజోలం, పెంటానోల్ అనే మత్తు ఇంజెక్షన్ వయల్స్ ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కానీ.. ప్రీతి శరీరంలో ఎలాంటి విషాలు లేవు.. అంటూ టాక్సికాలజీ రిపోర్టు రావడం గమనార్హం. దీంతో ఆత్మహత్యనా.. ఎవరైనా హత్య చేశారా? గుండెపోటుతో మరణించిందా? అని నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రీతి పోస్టుమార్టం రిపోర్టు, మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ రిపోర్టులను త్వరగా తెప్పించే యత్నంలో ఉన్నారు. ప్రీతి ఫోన్ సంభాషణలు, మెసేజ్‌లు, హెచ్‌వోడీకి ఫిర్యాదు చేయడం సహా ఇతరత్రా అన్ని ఆధారాలను సేకరించారు. మరోవైపు ప్రీతి మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు మరోమారు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
పిల్లులు కాదు.. పులి పిల్లలు
పులి అంటే అమ్మో అంటాం కదా.. పులి పిల్లలు మాత్రం చాలా ముచ్చటగా ఉన్నాయి. గ్రామస్తులు వాటిని ఎత్తుకుని ఆలనాపాలనా చూస్తున్నారు. పులి పిల్లలకు డబ్బా పాలు పట్టారు. పిల్లులు పట్టుకున్నంత ఈజీగా.. ఆ ఊరి జనం పులి పిల్లలను ఓ గంపలో వేసి.. ఇంట్లో దాచిపెట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సమీపంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన నాలుగుపెద్ద పులి పిల్లలను గుర్తించిన గ్రామస్థులు.. వాటిని కాపాడేందుకు ప్రయత్నించారు. కుక్కల బారిన పడకుండా .. వాటిని ఓ గదిలో భద్రపరిచారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పిల్లలకు జన్మనిచ్చిన పెద్దపులి అక్కడ ఎక్కడా లేదని.. పిల్లల కోసం వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందారు. అదే రోజు రాత్రికి ఫారెస్ట్ అధికారులు పులి పిల్లలను అటవీ ప్రాంతంలో వదిలేశారు.
ఆర్టీసీకి 550 ఎలక్ట్రిక్ బస్సులు
2025 మార్చి నాటికి హైదరాబాద్ అంతటా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకు వస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. మొదటి దశలో 550 ఈ-బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో తీసుకుంటున్నామని తెలిపారు. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)కు ఆర్టీసీ రూ.1000 కోట్ల విలువైన 550 ఎలక్ట్రిక్ బస్సుల అర్డర్ ఇచ్చింది. వాటిలో 500 ఇంట్రాసిటీ బస్సులు కాగా.. మిగతా 50 ఇంటర్ సిటీ ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు. ఇంటర్‌సిటీ బస్సులను హైదరాబాద్-విజయవాడ మధ్య టీఎస్ ఆర్టీసీ నడపనుంది. 500 ఇంట్రాసిటీ ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిప్పనున్నారు. ఇంట్రాసిటీ బస్సులను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం.. ఇంటర్‌సిటీ బస్సులు 325 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఈ బస్సులను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ చెప్పారు. సిటీలోని దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్, జీడిమెట్ల, మియాపూర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బస్ డిపోల్లో ఈ బస్సుల నిర్వహణకు ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
బీజేపీ ఆఫీస్‌లో సంజయ్ దీక్ష
రాష్ట్రంలో మహిళలు రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నెలకొన్నదని, వారి మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆందోళన చేపట్టారు. ఎక్కడో కర్ణాటకలో హిజాబ్ వివాదం తలెత్తితే మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణలో మహిళలు, విద్యార్థినులపై వరుసగా అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. దేశంలో బంగారం, డబ్బును ఎత్తుకెళ్లే దొంగలను చూశామని, కానీ.. మృతదేహాలను ఎత్తుకెళ్లే నీచమైన వాళ్లను కేసీఆర్ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విమర్శించారు. ముఖ్యమంత్రి నోరు విప్పడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే మహిళల జోలికొచ్చేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామని, ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్ తరహా పాలన అందిస్తామని ప్రకటించారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు.
భావోద్వేగంలోనే బెదిరించిన: కోమటిరెడ్డి
చెరుకు సుధాకర్‌పై తాను మాట్లాడిన మాటలు భావోద్వేగంతో చేసినవే గానీ వేరే ఉద్దేశం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివరణ ఇచ్చారు. తన 33 ఏళ్ల రాజకీయ జీవితంలో తన రాజకీయ ప్రత్యర్థులను ఏనాడూ దూషించలేదన్నారు. శత్రువులను కూడా దగ్గరకు తీసే తత్వం తనదని చెప్పారు. ‘తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్‌కు ఎందుకు చేస్తా? నేను మాట్లాడిన విషయాలను ఆ ఆడియో క్లిప్‌లో కట్ చేశారు. కొన్ని అంశాలను మాత్రమే లీక్ చేశారు. రికార్డు పెట్టారన్న సంగతి నాకూ తెలుసు. పార్టీలో చేరిన దగ్గరి నుంచీ చెరుకు సుధాకర్ నన్ను తిడుతూనే ఉన్నడు. నన్ను ఎందుకు తిడుతున్నాడనే అడిగా’ అని కోమటిరెడ్డి అన్నారు. సుధాకర్‌పై పీడీ యాక్టు పెడితే తానే కొట్లాడానన్నారు. తనను సస్పెండ్ చేయాలని.. పార్టీకి పట్టిన దరిద్రుడు. వాడు, వీడు..’ అని సుధాకర్ పదేపదే విమర్శలు చేయడం తనను బాధించిందని అన్నారు.
నవీన్ హత్యలో లవర్ నిహారిక, హసన్ అరెస్ట్
సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో.. నిందితుడు హరిహరకృష్ణ ప్రియురాలు నీహారిక, స్నేహితుడు హసన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నవీన్‌ను హరిహర చంపేసిన విషయం తెలిసీ ఆ విషయాన్ని చెప్పకుండా దాచి, సాక్ష్యాలను మాయం చేయడంలో, నిందితుడు తప్పించుకోవడానికి సహకరించినందున.. వీరిద్దరిపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎల్బీ నగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ సాయిశ్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ నేరుగా తన స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు. హసన్ తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతోపాటు, అదే రోజు రాత్రి వారిద్దరూ కలిసి నవీన్ మృతదేహం వద్దకు వెళ్లి, శరీర భాగాలను బ్యాగ్‌లో తీసుకెళ్లి మన్నెగూడ శివార్లలో పడేసి వచ్చారు. మరుసటి రోజు హరిహరకృష్ణ నీహారిక ను కలిశాడు. వరంగల్ వెళ్లేందుకు ఆమె రూ.1500 నవీన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసింది. అప్పటినుంచీ హరిహరకృష్ణ.. డెయిలీ హసన్‌తో ఫోన్‌లో టచ్‌లోనే ఉన్నారు. నవీన్‌ను చంపిన సంగతి తెలిసిన హరిహర తండ్రి.. పోలీసులకు లొంగిపోవాలని కుమారుడికి చెప్పాడు. కానీ, అతడు వరంగల్ నుంచి వైజాగ్ వెళ్లాడు. 20వ తేదీ రాత్రి సిటీకి వచ్చి మళ్లీ నీహారికను కలిశాడు. తన బైక్‌పై ఎక్కించుకుని.. నవీన్‌ను హత్య చేసిన చోటుకు తీసుకెళ్లాడు. కొద్దిదూరం నుంచి మృతదేహాన్ని చూపించి.. హత్య ఎలా చేశాడో వివరించాడు. అక్కడి నుంచి వీరిద్దరూ రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశారు. హరిహర కృష్ణ పోలీసులకు లొంగిపోడానికి ముందు.. ఆధారాలు మాయం చేయాలని నవీన్ శరీర భాగాలను తగలబెట్టారు. అనంతరం నీహారిక ఇంటికి వెళ్లారు. నీహారిక ఇంట్లోవాళ్లు ఎవరూ లేకపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉన్నారు. ‘ఆధారాలన్నీ మాయం చేశాం కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. నేను లొంగిపోయి.. ఒక్కణ్నే ఈ హత్య చేశానని ఒప్పుకొంటా’ అని హరిహర వారికి ధైర్యం చెప్పాడు.
మే 7న నీట్ ఎగ్జామ్
దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ–2023 పరీక్షకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఎగ్జామ్‌ను మే 7 నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల నుంచే అప్లికేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఏప్రిల్ 6 అర్ధరాత్రి వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. నీట్ ఎగ్జామ్ మే 7న(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 20 నిమిషాల వరకు జరగనుంది. ఎగ్జామ్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ నుంచి 200 మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయని ఎన్టీఏ తెలిపింది. ఇంగ్లిష్, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో ఎగ్జామ్ నిర్వహిస్తామని వెల్లడించింది. దరఖాస్తు సమయంలోనే లాంగ్వేజ్ ఆప్షన్ ఎంచుకోవాలని సూచించింది.