ఈడీ విచారణలో పైలట్.. మంత్రి మల్లారెడ్డికి మరో షాక్​.. కాంగ్రెస్ సీనియర్ల భేటీ.. మార్చిలో ఇంటర్​ ఎగ్జామ్స్​.. రూ.500కే గ్యాస్​ సిలిండర్​.. ఈ రోజు టాప్​ న్యూస్​

ఈడీ విచారణలో రోహిత్​ రెడ్డి.. రెండోరోజు

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ రెండో రోజు కొనసాగనుంది. మొదటి రోజున దాదాపు 6 గంటల పాటు ఈడీ ఆయనను ప్రశ్నించింది. ఈడీ అధికారులు తనను కేవలం బయోడేటా అడిగారని విచారణ ముగిశాక రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంగళవారం మళ్లీ రమ్మన్నారని చెప్పారు. ఈడీ విచారణకు ముందు హైడ్రామా జరిగింది. సోమవారం ఉదయాన్నే కేసీఆర్​తో భేటీ అయిన రోహిత్ రెడ్డి.. విచారణకు రాలేనని.. జనవరి 15 వరకు గడువు కావాలని ఈడీకి లెటర్ పంపించారు. కుదరదని ఈడీ తేల్చేయటంతో మధ్యాహ్నం 3 గంటలకు రోహిత్​ ఈడీ విచారణకు హాజరయ్యారు.

మంత్రి మల్లారెడ్డికి మరో షాక్​

మంత్రి మల్లారెడ్డిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటుకు దిగారు. మేడ్చల్​ జిల్లాలోని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అయిదుగురు మంత్రి ఒంటెత్తు పోకడలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో ఎమ్మెల్యేలు వివేకానంద, ఆరికెపూడిగాంధీ, మాధవరం కృష్ణారావు, బేతిసుభాష్​రెడ్డిలు సోమవారం రహస్య సమావేశమయ్యారు. మంత్రి తమను లెక్క చేయటం లేదని, పార్టీ పదవులన్నీ ఆయన అనుచరులకే ఇస్తున్నారని ఆరోపించారు. మేడ్చల్​ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ విషయంలో మంత్రి రాత్రికి రాత్రికి నిర్ణయం తీసుకోవటాన్ని తప్పుబట్టారు. అధిష్ఠానాన్ని మంత్రి తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.

ఢిల్లీలోనే కాంగ్రెస్​ పంచాయితీ

పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలు రేపు మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. రేపటి అసమ్మతి నేతల మీటింగ్‌ను వాయిదా వేసుకోవాలని ఢిల్లీ నేతలు కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని సీనియర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25 తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై హైకమాండ్ చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బార్డర్‌లో చైనా యుద్ధ విమానాలు:

అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబరు 9న భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్ లో చైనా దూకుడు పెంచింది. భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే వైమానిక స్థావరాలను యాక్టివేట్ చేసింది. టిబెట్లోని బాంగ్డా, లాసా, షిగాత్సే ప్రాంతాల్లో ఉన్న తన వైమానిక స్థావరాలను అత్యాధునిక డ్రోన్లు, యుద్ధ విమానాలతో నింపుతోంది. పలు జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాలు ప్రచురించాయి. టిబెట్ లోని బాంగ్డా, లాసా, షిగాత్సే వైమానిక స్థావరాలలో పెద్ద సంఖ్యలో ‘WZ-7 సోరింగ్ డ్రాగన్’ రకం డ్రోన్లు, ‘సుఖోయ్ ఎస్యూ 27’ రకం యుద్ధ విమానాలను చైనా మోహరించిందని నిర్ధారించే పలు శాటిలైట్ దృశ్యాలతో కథనాలను ప్రచురించాయి. ఆ ఉపగ్రహ చిత్రాలు డిసెంబరు 14 నాటివని కథనంలో పేర్కొన్నాయి.

చైనాను చూసి భయమా: అసదుద్దీన్​ ఒవైసీ

భారత్ భూభాగంలోకి ఎవరూ ప్రవేశించలేదంటూ ప్రధాని మోడీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. డెప్సాంగ్, డెమ్ చోక్ ప్రాంతాలను చైనా సైనికులు ఆక్రమించుకున్నట్టు శాటిలైట్ ఫొటోల్లో తెలుస్తోందన్నారు. ఇంత జరుగుతున్నా చైనాతో వ్యాపార , వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఏమిటని ప్రశ్నించారు. బార్డర్లో ఇష్యూస్ పై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. భారత సైన్యం చాలా పవర్ ఫుల్ అని…. కానీ కేంద్రం బలహీనంగా ఉందని అసద్ విమర్శించారు. చైనాను చూసి కేంద్రం భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

₹500కే అక్కడ గ్యాస్ సిలిండర్:

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రాజస్ధాన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేవలం రూ. 500కే వంట గ్యాస్ అందిస్తామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు ఎవరూ దూరం కాకూడదని, ప్రస్తుతం ధరల పెరుగుదల సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర రాజస్ధాన్ లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం అశోక్ గెహ్లాట్ ఈవిషయాన్ని ప్రకటించారు.

ఇంటర్ ఎగ్జామ్‌ షెడ్యూల్‌ విడుదల:

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 15వ తేద నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి మొదలవుతాయి.ఉదయం 9 నుంచి 12 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. రెండు విడుతలుగా అంటే ఉదయం 9 నుంచి 12 వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల టైంటేబుల్ ను ఇంటర్ బోర్డు రిలీజ్ చేసింది.

బీఆర్ఎస్​ పేరేలా మారుస్తారు: రేవంత్​రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. బంగారు కూలీ కేసు… కోర్టులో విచారణలో ఉండగా.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా ఎలా మారుస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ చట్ట విరుద్ధమని రేవంత్ ట్వీట్ చేశారు. ఇదే విషయంపై కాంగ్రెస్ అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిచ్చేలా ఉందన్నారు.

ముందస్తు లీకులు కేసీఆర్‌వే

ముందస్తు ఎన్నికలకు వెళ్తానని సీఎం కేసీఆర్ లీకులు ఇస్తున్నారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. జమిలి ఎన్నికలు జరిగితే సీఎం కేసీఆర్‭కు ఇబ్బంది ఏర్పడుతుందని.. అవి జరగకుండా ఆలోచిస్తున్నారని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబర్ 7 జరిగాయని, అవి జరిగి నాలుగేండ్లు పూర్తైందని గుర్తు చేశారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశంలో రఘునందర్ రావు ఈ కామెంట్స్ చేశారు.

వరంగల్ మెట్రోపై సైలెంట్:

వరంగల్​ మెట్రోపై రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్​గా ఉందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చింది. తెలంగాణలో మెట్రో రైల్ ప్రాజెక్టులపై రాజ్యసభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి కౌశల్ కిషోర్ ఈ సమాధానమిచ్చారు. వరంగల్ నియో మెట్రో కింద 15.5 కిలోమీటర్ల కు రూ.998 కోట్లతో ప్రపోజల్ తమకు అందిందని.. కేంద్ర మంత్రిత్వ శాఖ సూచించిన మార్పులతో మరోసారి ప్రతిపాదనలు పంపాలని సూచించగా తెలంగాణ సర్కారు స్పందించలేదని అందులో స్పష్టం చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలకు సంబంధించిన ప్రపోజల్స్ ఏవీ రాలేదని తెలిపింది.

హీరోపై‌ చెప్పుతో దాడి

కన్నడ హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురైంది. సాంగ్‌ విడుదల కోసం వెళ్లిన దర్శన్ పై ఓ వ్యక్తి చెప్పు విసిరేశాడు. ‘క్రాంతి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం కర్ణాటకలోని హోస్పేట్‌లో సాంగ్‌ విడుదల కార్యక్రమానికి దర్శన్ హాజరయ్యాడు. స్టేజీపై నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఆయనపై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శన్‌ ఇటీవల అదృష్ట దేవతపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

మెస్సీది అస్సామే

అర్జెంటినా సాకర్ దిగ్గజం లియోన్ మెస్సీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్‌లో అద్భుత ఆటతీరుతో మెస్మరైజ్ చేసిన మెస్సీ దేశానికి మూడో ప్రపంచకప్ అందించాడు. మెస్సీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న వేళ కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ ఆయనను ఓన్ చేసుకునే ప్రయత్నంలో తడబడి అభాసుపాలయ్యారు. మెస్సీకి ట్బిటర్‌లో అభినందనలు తెలుపుతూనే.. ఆయనకు అసోంతో సంబంధాలు ఉన్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు.‌ ఓ యూజర్.. మెస్సీకి, అసోంకు ఎలాంటి సంబంధం ఉందని ప్రశ్నించాడు. దానికి ఖలీక్.. మెస్సీ అసోంలో పుట్టాడని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న ఎంపీ ఖలీక్ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయినప్పటికీ ఆయన నెటిజన్ల దాడి నుంచి తప్పించుకోలేకపోయారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc