ఆప్‌దే ఢిల్లీ కార్పోరేషన్
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో 134 సీట్లతో ఆప్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. బీజేపీ 104 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. మొత్తం 250 సీట్లు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 126. ఆప్ పార్టీకి చెందిన 134 మంది అభ్యర్థులు విజయం సాధించడంతో ఢిల్లీ మేయర్ స్థానం ఆ పార్టీకి దక్కుతుందని అంతా భావిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఎంసీడీలో అధికారంలో ఉన్న బీజేపీ అనూహ్యంగా ఓటమి చెందింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. స్వతంత్రులు మూడు స్థానాల్లో విజయం సాధించారు.-
పది రోజుల్లో రైతుబంధు

రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మరో పదిరోజుల్లో అకౌంట్లలో రైతు బంధు నగదు జమ చేస్తామని ఆయన వెల్లడించారు. కేబినెట్ మీటింగ్ లో రైతు బంధుపై నిర్ణయం తీసుకుంటామని..ఆ తర్వాత రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు. జగిత్యాలలో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కొత్త మెడికల్ కాలేజీకి భూమి పూజ చేశారు. అక్కడే బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.
నేడే గుజరాత్ రిజల్ట్స్:
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. మొత్తం 182 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కి్ంపు ప్రారంభం కానుంది. అన్ని ఎగ్జి్ట్ పోల్స్ రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పాయి. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీకి కనీసం 92 సీట్లు గెలుచుకోవాలి. 1995 నుంచి గుజరాత్ లో బీజేపీనే అధికారంలో ఉంది.
వికారాబాద్‌లో నేలకూలిందేమిటి

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని మొగిలిగుండ్ల గ్రామంలోని పొలాల్లో బుధవారం ఉదయాన్నే ఆకాశం నుంచి ఒక భారీ మిషన్ నేలకు పడింది. ఆదిత్య 369 సినిమాలోని టైమ్ మిషన్‌ను ఇది పోలి ఉండడంతో అందరూ ఆశ్చర్యపోయారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో మిషన్‌ను చూడ్డానికి వచ్చారు. వాతావరణం లో వచ్చే మార్పులను తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని టాటా ఇన్స్టిట్యూట్ ఈ హీలియం బెలూన్ను ప్రయోగించినట్లు పోలీసులు తేల్చారు.
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 19 సబ్జెక్ట్ లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ నెల 14 నుంచి జనవరి 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించిన మరింత సమాచారాన్ని అధికార వెబ్ సైట్ లో ఉంచామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. మరిన్ని వివరాలకు
నేడు ఆకాశంలో మరో వింత:

బుధవారం ఆకాశంలో మరో ఖగోళ వింత దర్శనమివ్వనుంది. భూమికి దగ్గరగా కుజ గ్రహం రానుంది. ఒకే కక్ష్యలోకి భూమి, కుజుడు, సూర్యుడు రానున్నారు. ఈ అరుదైన దృశ్యం ఉదయం 11: 20 నిమిషాలకు అంతరిక్షంలో అవతరించనుంది. ప్రతి 26నెలలకు ఒకసారి ఇలా ఈ మూడు ఒకే కక్ష్యలోకి వస్తాయి. అయితే ఇప్పుడున్నంత కాంతివంతంగా ఈ గ్రహం మళ్లీ 2031 వరకు కనిపించదు. సాధారణ కళ్లతో కూడా దీన్ని చూడవచ్చు. పొద్దుపోయిన తర్వాత ఆకాశంలో తూర్పు దిక్కున చూస్తే నక్షత్రంలా మిణుకు మిణుకుమనకుండా స్థిరకాంతితో ఒక ఎర్రటి ఆబ్జెక్ట్ రూపంలో ఈ గ్రహం కనిపిస్తుంది.
పవన్ కల్యాణ్ ప్రచార రథం.. వారాహి:

ఏపీలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ త్వరలో చేపట్టనున్న యాత్రకు స్పెషల్ వెహికిల్ రెడీ అయ్యింది. ఈ వాహనం వీడియోను పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు . ‘వారాహి’… రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – అంటూ ప్రకటించారు. హైదరాబాద్ లో పవన్ వెహికిల్, ట్రయల్ రన్ ను పరిశీలించారు . వాహనానికి సంబంధించి పార్టీ నేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ముఖ్య సూచనలు చేశారు. వెహికిల్ రెడీ చేస్తున్న టెక్నికల్ టీమ్ తోనూ పవన్ మాట్లాడారు. ఈ వాహనానికి పవన్ ఇంకా రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో వాహనంపై ఎలాంటి నంబర్ కనిపించలేదు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు… ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.-
మీరాబాయి ఖాతాలో మరో అవార్డు:

ఇండియన్ స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మరోసారి మెరిసింది. మణికట్టు గాయం ఇబ్బంది పెడుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా అద్భుత ప్రదర్శనతో ‘2022 వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్’లో రజతం సాధించింది. కొలంబియా వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్‌షిప్ కీలక పోరులో చైనా క్రీడాకారిణి హౌ జిహూయిని వెనక్కి నెట్టి సిల్వర్ మెడల్‌ను ముద్దాడింది.
సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా:
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా మరో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఉత్కంఠభరిత రెండవ వన్డేలో 5 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. 272 పరుగుల లక్ష్య చేధనలో శ్రేయర్ అయ్యర్ (82), అక్షర్ పటేల్ (52), చివరిలో కెప్టెన్ రోహిత్ శర్మ (51 నాటౌట్) ధాటిగా ఆడినా భారత్‌ను గట్టెక్కించలేకపోయారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 3 వన్డేల సిరీస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో బంగ్లాదేశ్ సిరీస్ గెలుచుకుంది
అక్కడ శవాలు దాచిపెడుతున్నారు
ఎవరైనా చనిపోయినా తర్వాత మళ్లీ బతికి రావడం వంటి వాటిని సినిమాల్లోనే మాత్రమే చూస్తాం. కానీ ఎప్పటికైనా అది నిజం కాకపోతుందా…. అని అమెరికాకు చెందిన అల్కోర్ లైఫ్ ఎక్స్‌టెన్షన్ ఫౌండేషన్ కొత్త ప్రయత్నం చేస్తోంది. 1972లో లిండా, ఫ్రెడ్‌చాంబర్ లైన్ ఈ ఫౌండేషన్ స్థాపించారు. చనిపోయిన వాళ్లు ఎప్పటికైనా తిరిగి బతికివస్తారనే ఆశతో మృతదేహాలను జాగ్రత్తగా కాపాడతున్నారు. క్రయో ప్రిజర్వ్ విధానంలో మృతదేహాలను లిక్విడ్ నైట్రోజన్ నింపిన స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకుల్లో భద్రపరుస్తున్నారు. ఒక్క మృత దేహానికి సుమారు కోటి రూపాయలు ఫీజు తీసుకుంటోంది.