ఇలా కాస్త తేరిపార జూడండి… ఆసుపత్రి ఇలా ఉంటుందా? ఉండదు… ఓ అద్భుత మహల్‌లా, ఓ రాజప్రాసాదంలా ఠీవిగా కనిపించే ఆ కట్టడం నిజంగా ఓ హాస్పిటల్. అచ్చంగా హాస్పిటలే. దానిపేరే ‘గవర్నమెంట్ నిజామియా జనరల్ హాస్పిటల్’. జనవాడుకలో ‘యునానీ దవాఖానా’!
ఓ చిన్న కొండలాంటి ఐల్తైన ప్రదేశంలో… మరింత ఎత్తుగా ఉండే భవనం అది. సరిగ్గా మక్కా మసీదుకు ఎదురుగా. ఓరగా చూసినట్టుగా చార్మినార్‌కు ఓ పక్కగా. ముందు వైపు నుంచి చూస్తే… రెండంతస్తులుగా కనిపించే భవనం పొడవునా… అనేక ఆర్చీలూ… పైన సౌష్ఠంగా, ఠీవిగా కిరీటంలో శిఖల్లా కనిపించే చిన్నా, పెద్దా గుంబజ్‌లూ, చిన్న చిన్న మినారెట్లతో అలరారుతుంటుందది. అలా రెప్పవాల్చకుండా పరికించి చూస్తే ఓ అద్భుత రాజప్రాసాదం లాగానే అనిపిస్తుంది.
ముందు ఏడో నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దుర్ నిర్మాణం చేసిన హాస్పిటల్ ఇది. 1929లో దానికి పునాదిరాయి పరిస్తే… దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అంటే 1938 ప్రాంతాల్లో అది అందుబాటులోకి వచ్చిందట. అప్పట్లో ఆ అద్భుత భవన నిర్మాణానికి ఏడో నిజాం పెట్టిన ఖర్చు అక్షరాలా ఐదు లక్షలు.
ఇప్పటికీ రోగులెందరికో యూనానీ వైద్యవిధానంలో సేవలందిస్తూ నిటారుగా నిల్చుని ఉందది.
చూస్తే మానసిక ఆనందం… లోనికెళ్తే శారీరక ఆరోగ్యం సమకూరే ప్రదేశమది.
కాబట్టి… రండి… చూడండి… అబ్బురంగా చూస్తూ… ఆశ్చర్యపొండి. సంబరంగా చూస్తూ… స్వాస్థ్యం పొందండి.