కుప్పకూలిన నేపాల్ సర్కార్
నేపాల్ రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపాల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కుప్పకూలింది. కూటమి నుంచి మావోయిస్టు సెంట్రల్ పార్టీ వైదలగడంతో ప్రభుత్వం పడిపోయింది. ప్రధాని మంత్రి పదవి విషయంలో నేపాల్ కాంగ్రెస్, మావోయిస్టు సెంట్రల్ పార్టీ మధ్య ఒప్పందం కుదరలేదు. దీంతో ప్రతిపక్ష పార్టీతో పొత్తు పెట్టుకుని, మావోయిస్టు సెంట్రల్ పార్టీ నేత ప్రచండ అధ్యక్ష పీఠాన్నిచేపట్టారు.
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిది కోసం ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. శ్రీశైలం, భద్రాచలం, రామప్ప, యాదాద్రి ఆలయాలను సందర్శించనున్న రాష్ట్రపతి.. హైదరాబాద్‌లో జరగనున్న వివిధ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. రాష్ట్రపతి హోదాలో మొదటిసారి రాష్ట్రానికి వస్తున్న ద్రౌపదీ ముర్ముకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
నన్ను అరెస్ట్ చేసే కుట్ర: ఎమ్మెల్యే పైలెట్
తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా తగ్గేదే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. తనను మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈడీ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తానని వెల్లడించారు. బీజేపీ కుట్రలను బయటపెట్టినందుకు తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంలో మనీ లాండరింగ్ జరగలేదు ఎక్కడా డబ్బులు దొరకలేదని.. నందకుమార్ స్టేట్మెంట్ ద్వారా తనను కేసులో ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
మెట్రోపై కూలిన డ్రోన్.. ఆగిన రైళ్లు
ఢిల్లీలోమొ జసోలా విహార్ మెట్రో మార్గంలోని పట్టాలపై ఒక డ్రోన్ కుప్పకూలడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆదివారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఈ సంఘటన చోటుచేసుకుంది. డ్రోన్ కుప్పకూలిన సమాచారం తెలియగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు మెట్రోరైళ్లను ఎక్కడికక్కడే నిలిపివేయడంతో పాటు మెట్రో స్టేషన్‌లోకి ప్రయాణికుల రాకపోకలను నిలిపివేశారు. ఆ వెంటనే ఘటనా స్థలికి ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎస్ఎఫ్, డీఎంఆర్‌సీ సిబ్బంది చేరుకుని పట్టాలపై నుంచి డ్రోన్‌ను తొలగించడంతో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. డ్రోన్ కూలిన చోట మెడిసిన్ ఉందని, నొయిడాకు చెందిన ఒక కంపెనీ ఈ మందులను డ్రోన్ ద్వారా సరఫరా చేస్తున్నట్టు గుర్తించామని పోలీసులు చెప్పారు.
స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్స్
దేశంలోని అన్ని రకాల తినుబండారాలు ఒకే చోట లభించే ఫుడ్ స్ట్రీట్స్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతి నగరంలోనూ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలు తమకు నచ్చిన ఆహారం ఈ ఫుడ్ స్ట్రీట్‌లో ఆరగించి, ఆనందించే విధంగా వీటిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
మద్యానికి బానిసై మంత్రి కొడుకు మృతి
మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయానంటూ కేంద్ర మంత్రి కంటతడి పెట్టారు. ఓ కార్యక్రమంలో కేంద్ర గృహ, అర్బన్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌషల్ కిషోర్ భావోద్వేగానికి గురయ్యారు. ”నా కుమారుడు ఆకాష్ కిషోర్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగే అలవాటు ఉంది. ఆ అలవాటు మారుతాడనే ఆశతో డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్చాం. ఆరు నెలల తర్వాత వివాహం కూడా చేశాం. అయితే, పెళ్లి తర్వాత మళ్లీ మందుతాగడం మొదలుపెట్టాడు. దురదష్టవశాత్తూ తాగుడు వల్లే ప్రాణాలు కోల్పోయాడు. రెండేళ్ల క్రితం అక్టోబర్ 19న నా కొడుకు కాలం చేసేనాటికి అతనికి రెండేళ్ల పిల్లవాడు ఉన్నాడు” అని కౌషల్ కిషోర్ చెప్పారు.
గాలి జనార్థన్‌రెడ్డి కొత్త పార్టీ
కర్ణాటక మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. బీజేపీకి రాజీనామా చేసిన ఆయన..సొంతంగా పార్టీ పెడుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరులోని తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి.. బీజేపీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నూతన పార్టీ ద్వారా కన్నడ రాజకీయాల్లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టనున్నట్లు గాలిజనార్థన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇద్దరిని చంపేసిన 12 ఏండ్ల బాలుడు
12 ఏళ్ల బాలుడు 60 ఏళ్ల దంపతులను దారుణంగా హతమార్చాడు. ఈ కేసు విచారణలో హత్యలు చేసింది ఓ బాలుడు అని తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది. ఇబ్రహీం(60) అనే స్ర్కాప్ వ్యాపారి అతని భార్య హాజ్రాతో కలిసి ఉంటున్నాడు. వీరితో 12 ఏళ్ళ బాలుడు కొంత కాలంగా సన్నిహితంగా మెలుగుతున్నాడు. వారి దగ్గర చాలా డబ్బులు, బంగారం ఉంటాయని భావించిన బాలుడు.. తన స్నేహితులతో కలిసి వారి ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లాడుఆ వృద్ద దంపతులు ప్రతిఘటించడంతో అత్యంత దారుణంగా ఇరువురిని హతమార్చారు.
పురుగుల అన్నం వద్దంటూ బిల్డింగ్ ఎక్కిన స్టూడెంట్లు
ఆదిలాబాద్ జిల్లాలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు నిరసన గళం వినిపించారు. ఆహారంలో పురుగులు పడినా.. పాచిపోయినా.. పాడైపోయినా.. అలాగే తినమంటుండడంతో ఆగ్రహించిన విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ ఎక్కి నిరసనకు దిగారు. పాడైపోయిన ఆహారం తినలేకపోతున్నామంటూ నేరడిగొండ కస్తూర్బా పాఠశాల విద్యార్థులు బిల్డింగ్ పైకి ఎక్కి నినాదాలు చేశారు. అర్ధాకలితో ఉండలేం.. గేటు ఓపెన్ చేయండి.. ఇంటికి వెళ్లిపోతాం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరాలు వస్తున్నా.. ప్రిన్సిపల్, సిబ్బంది పట్టించుకోవడం లేదన్నారు. దీంతో సిబ్బంది స్పందించి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని చికిత్స కోసం తీసుకెళ్లారు.
బైకు యాక్సిడెంట్‌లో నలుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాంసి మండలం హస్నాపూర్ అంతర్రాష్ట్ర రహదారిపై రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చలపతిరావు మృతి
ప్రముఖ తెలుగు సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన చలపతి రావు అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నారు. పార్థివ దేహాన్ని మహా ప్రస్థానానికి తరలించారు. చలపతిరావు కుమార్తెలు అమెరికా నుంచి వచ్చే వరకు అక్కడే ఫ్రీజర్‌లో ఉంచనున్నారు. చలపతిరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.