28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు.. కాంగ్రెస్​లో సంక్షోభం.. సంజయ్​కు మోడీ పిలుపు.. ఫుట్ బాల్​ ప్రపంచ కప్ విజేత అర్జెంటినా.. టుడే టాప్​ న్యూస్​

ఫిఫా ప్రపంచ కప్​ విజేత అర్జెంటినా

ఫిఫా వరల్ట్ కప్ ఫైనల్లో అర్జెంటీనా విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్​ మ్యాచ్​​ ఫ్రాన్స్ పై పెనాల్టీ షూటవుట్ లో మెస్సీ సేన 4-2 తేడాతో నెగ్గింది. నిర్ణీత సమయంలో రెండు జట్లకు 3–3 గోల్స్​ ఉండటంతో పెనాల్టీ షూటవుట్ అనివార్యమైంది. పెనాల్టీ షూటవుట్లో అర్జెంటీనా ఆటగాళ్లు వరుసగా 4 సార్లు గోల్ చేయగా.. ఫ్రాన్స్ రెండు ఛాన్స్​లు మిస్సయ్యాయి. అర్జెంటీనా గోల్ కీపర్ అద్భుతంగా బంతిని అడ్డుకుని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్ కప్ చరిత్రలో అర్జెంటీనాకు ఇది మూడో టైటిల్. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన అర్జెంటీనాకు రూ.347 కోట్ల భారీ ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ ఫ్రాన్స్ రూ.248 కోట్లు అందుకుంది.

ఈ నెల 28 నుంచి రైతు బంధు

యాసంగి రైతుబంధు నిధులు ఈనెల 28 నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. డిసెంబర్ 28 నుంచి నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. ఎప్పటిలాగే ఒక ఎకరం నుంచి ప్రారంభించి సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈసారి మొత్తం రూ.7,600 కోట్లను రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది.

రేవంత్‌ వర్గం రాజీనామా

రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతోంది. రేవంత్​, సీనియర్ల మధ్య పంచాయితీ ముదిరింది. రేవంత్​ ఏర్పాటు చేసిన మీటింగ్​లను సీనియర్లు బహిష్కరించారు. ఆదివారం ఇందిరాభవన్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి సీనియర్లు గైర్హాజరయ్యారు. పీసీసీ కమిటీల్లో పదవులన్నీ రేవంత్ తన వర్గానికే ఇప్పించుకున్నారనే విమర్శల నేపథ్యంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలు అందరూ కమిటీల్లోని తమ పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌‌కి 13 మంది నేతలు తమ రిజైన్‌ లెటర్లు పంపారు.

సంజయ్ యాత్రకు మోడీ ఫిదా

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు ప్రధాని మోడీ ఆహ్వానం అందింది. తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు బీజేపీ హైకమాండ్ నుంచి మంచి గౌరవం దక్కిందని ఆ పార్టీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం ఢిల్లీలో జరగనున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో సంగ్రామ యాత్రపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

ముందస్తు కాదు.. జమిలీ ఎన్నికలే

రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు చేయడం మాత్రమే సీఎం కేసీఆర్ చేతుల్లో ఉందని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఈసీ నిర్ణయిస్తుందని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు. కేసీఆర్‌‌ అసెంబ్లీని రద్దు చేసి కర్ణాటకతో పాటే ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారన్న ప్రచారంపై లక్ష్మణ్ స్పందించారు. ‘‘కేసీఆర్ చెప్పినప్పుడే ఎన్నికలు జరపటానికి ఈసీ ఆయన జేబు సంస్థ కాదు” అని అన్నారు. ముందస్తు ఎన్నికలు తేవడం బీజేపీ విధానం కాదని, జమిలీ ఎన్నికలే తమ విధానం అని చెప్పారు.

బిగ్‌బాస్ విన్నర్ రేవంత్‌

బిగ్‌బాస్ సీజన్ 6 ఫైనల్స్ ఈసారి​ ఆసక్తి రేపాయి. సీజన్​ సిక్స్​ ట్రోఫీని సింగర్ రేవంత్ సొంతం చేసుకున్నాడు. నటుడు శ్రీహాన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వాస్తవానికి రేవంత్‌ కంటే, శ్రీహాన్‌కే ప్రజల ఓట్లలో నెంబర్​ వన్​గా నిలిచారు. విజేతను ప్రకటించడానికి ముందు బిగ్‌బాస్ ఇచ్చిన రూ.40 లక్షల క్యాష్​ ఆఫర్​ను శ్రీహాన్​ సొంతం చేసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో రేవంత్ ట్రోఫీ విన్నర్‌‌గా నిలిచాడు. రేవంత్‌ రూ.పది లక్షల క్యాష్‌, మారుతీ బ్రెజా కారు, రూ.25 లక్షల విలువైన ఓ ప్లాటును సొంతం చేసుకున్నాడు.

2 హత్యలు.. 30 లక్షల సుపారి

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుగురి సజీవ దహనం ఘటన.. పక్కా ప్లాన్డ్​మర్డర్​అని తెలుస్తోంది. మృతుడు శనిగారపు శాంతయ్య భార్య సృజన.. తన ప్రియుడు లక్షెట్టిపేటకు చెందిన మేడి లక్ష్మణ్​సాయంతో హత్యలు చేయించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇందుకు ఉత్కూరులో ఉన్న రూ.30లక్షల విలువ చేసే భూమిని లక్ష్మణ్​కు సుఫారీగా ఇచ్చేందుకు మూడు నెలల కింద అగ్రిమెంట్​చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. రాజ్యలక్ష్మితో శాంతయ్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, ఆయన ఆస్తులన్నీ రాజ్యలక్ష్మికే దక్కుతాయని, భవిష్యత్తులో తన కొడుకులకు వారసత్వ ఉద్యోగం కూడా రాదన్న భయంతో హత్యలు చేయించినట్లు తెలుస్తోంది. సృజన, లక్ష్మణ్ సహా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు.

ఘనంగా కొమురవెల్లి మల్లన్న లగ్గం

కొమురెల్లి మల్లన్న పెండ్లి మనోహరంగా జరిగింది. వీరశైవ సంప్రదాయం ప్రకారం తోటబావి కల్యాణ వేదికపై ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది. ఆలయగర్భ గుడి నుంచి మల్లికార్జునస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా మండపానికి చేర్చారు. మహదేవుని, పగిడన్నగారి వంశస్తుల ఇండ్ల నుంచి మల్లికార్జున స్వామి, బలిజ మేడాలదేవి, గొల్లకేతమ్మ అమ్మవార్లకు పట్టువస్త్రాలు, పుస్తె మట్టెలు, ముత్యాల తలంబ్రాలు, ఒడిబియ్యంను తీసుకొచ్చారు. బలిజమేడాలదేవి, గొల్లకేతమ్మల తరుఫున మహాదేవుని వంశస్తులైన రవి, -సింధు దంపతులు, వరుడు మల్లికార్జునస్వామి తరుఫున పగిడన్నగారి వంశస్తులైన మల్లయ్య, బాలమణి దంపతులు పెండ్లి పెద్దలుగా వ్యవహారించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు వరుడు మల్లికార్జునస్వామి వధువులు మేడాలదేవి, కేతమ్మలకు మాంగళ్యధారణ చేసి పరిణయమాడారు.

ఫోన్‌ ఎక్కువగా చూస్తోందని చంపేశాడు

సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడుతోందని కూతురిని సవతి తండ్రి చంపేశాడు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాకారం ఏరియాకు చెందిన రెహమున్నీసా.. తన భర్త చనిపోవడంతో ఆటో డ్రైవర్ సాదిక్ను రెండో పెండ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. రెండో కూతురు యాస్మిన్ ఉన్నీసా (17) తొమ్మిదో తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. యాస్మిన్ తరచూ సెల్ ఫోన్ లో మాట్లాడుతుండడం గమనించిన సాదిక్.. చాలా సార్లు ఆమెను హెచ్చరించాడు. సెల్ ఫోన్ లో ఎక్కువ సేపు మాట్లాడవద్దని చెప్పినా యాస్మిన్ వినట్లేదని ఆదివారం తెల్లవారుజామున ఆమె గొంతు నులిపి సాదిక్ హత్య చేశాడు. తర్వాత పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.

బాలికపై 8 మంది గ్యాంగ్‌ రేప్

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. 16 ఏండ్ల బాలికను 8మంది కలిసి గ్యాంగ్​రేప్ చేశారు. సుమారు 12 గంటల పాటు చిత్రహింసలు పెడుతూ.. ఒకరి తరువాత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఓ బంగ్లాకు తీసుకెళ్లారని, అక్కడ ఆమెను రేప్​ చేశారన్నారు. అక్కడి నుంచి బీచ్​కు తీసుకెళ్లి.. మరోసారి అత్యాచారం చేశారని తెలిపారు. శనివారం ఉదయం 11 గంటల దాకా ఆమెను నిర్బంధించి చిత్ర హింసలు పెట్టి లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు వివరించారు. వారి నుంచి తప్పించుకున్న బాలిక శనివారం సత్పతి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు.

నేవిలోకి ఐఎన్ఎస్ మోర్ముగావ్

ఇండియన్ నేవీ చేతికి మరో అత్యాధునిక యుద్ధనౌక అందింది. శత్రు దేశాల రాడార్ లకు చిక్కకుండా ప్రయాణిస్తూ గైడెడ్ మిసైల్స్ తో యుద్ధ విమానాలను ధ్వంసం చేయగల స్టెల్త్ వార్ షిప్ ‘ఐఎన్ఎస్ మోర్ముగావ్’ నేవీ అమ్ములపొదికి చేరింది. ఆదివారం ముంబైలోని నావల్ డాక్ యార్డులో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ మోర్ముగావ్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేవీకి అందజేశారు.

మిసైల్స్ ప్రయోగించిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్​ మిసైల్స్​ను ప్రయోగించింది. ఆదివారం ఉదయం ఉత్తర ప్యోంగాన్​ ప్రావిన్స్​లోని టోంగ్ చాంగ్​రి ఏరియా నుంచి రెండు క్షిపణులను టెస్ట్ చేసింది. అమెరికా ప్రధాన భూభాగాలను టార్గెట్ చేసుకుని మరిన్ని మిసైల్స్​ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని ఉత్తర కొరియా రెండు రోజుల కిందే ప్రకటించింది. ఉత్తర కొరియా మిసైల్స్​ ప్రయోగాలను దక్షిణ కొరియా జాయింట్​ చీఫ్ ఆఫ్ స్టాఫ్​తో పాటు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ధ్రువీకరించారు. ఈ సందర్భంగా జపాన్​ హై అలర్ట్​ ప్రకటించింది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here