గెలుపు మాదేనన్న రేవంత్​.. కేసీఆర్​కు ఇదే ఆఖరి అసెంబ్లీ అన్న సంజయ్​.. ప్రగతిభవన్​ ఎదుట టీచర్ల ఆందోళన.. హైదరాబాద్ సిటీ రోడ్డుపై మర్డర్

ఈ అసెంబ్లీ సమావేశాలే కేసీఆర్​కు ఆఖరివి : బండి సంజయ్​

త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలే కేసీఆర్‌కు చివరివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. బీజేపీ నేతలను ఇబ్బందులకు గురిచేయడమే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యమని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో జరుగుతున్న నాగోబా జాతరలో కేంద్రమంత్రి అర్జున్‌ ముండాతో కలిసి సంజయ్ పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీలలో ఎన్నింటిని అమలు చేశారో తెలపాలని డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వ టీచర్లను అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్ ఖండించారు. మానవత్వం లేని మృగం అంటూ సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 317 జీవోను సవరించాలని.. అరెస్ట్ చేసిన టీచర్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్​ లొల్లులు అయిపోయినయ్.. గెలుపు మాదే

PCC Chief Revanth : బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి

కాంగ్రెస్​లో గొడవలన్నీ సమసిపోయాయని.. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్​ను బొంద పెడితేనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేకూరుతుందని అన్నారు. ఆదివారం రాత్రి బిజినేపల్లిలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణలో దొరల ఆధిపత్య పోరుకు ఇటీవలి బిజినేపల్లి ఘటనే నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల్లారా కాచుకోండి. ఠాక్రే తెలంగాణ ఇన్‌చార్జ్‌గా వచ్చిన తర్వాత మా పంచాయితీలన్నీ సమసిపోయాయి. రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, దళితులు-బీసీలు కాంగ్రెస్‌ పార్టీకి రెండు కళ్లలాంటివని అన్నారు. దళిత, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బీఆర్‌ఎస్‌ లీడర్లను గిరిజన గూడేలకు రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ముందస్తుకు వెళ్లేది లేదు: మంత్రి ప్రశాంత్​రెడ్డి

ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అయిదేండ్దు పరిపాలించాలని అధికారం ఇచ్చారని, అందుకే పూర్తికాలం అధికారంలో ఉంటామని అన్నారు. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ప్రజల్లో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. 

బదిలీలపై టీచర్ల ఆందోళన.. ప్రగతిభవన్​ ముట్టడి

స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆదివారం కూడా ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించారు. జీవో నెంబరు 317ను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. వివిధ జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌ చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. వీరందరినీ అడ్డుకున్న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.

మంగ్లీ కారుపై రాళ్ల దాడి

సింగర్ మంగ్లీ కారుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బళ్లారి ఉత్సవ్ ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వస్తుండగా కారుపై దాడి జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే చిక్‌బళ్లాపూర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో మంగ్లీ కన్నడలో మాట్లాడకపోవటం.. తెలుగు అందరికి వస్తుందని సమాధానమివ్వటంపై కన్నడ నెటిజన్లు మండిపడ్డారు. కన్నడలో మాట్లాడడం రానివారికి అవకాశం ఎందుకు ఇస్తున్నారనే వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే కారుపై దాడి జరిగిందని తెలుస్తోంది.

కేసీఆర్​తో రామచంద్ర మిషన్​ కమలేష్​

ప్రఖ్యాత ఆధ్యాత్మిక సంస్థ, రామచంద్ర మిషన్ ప్రతినిధులు ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో త్వరలో నిర్వహించనున్న ఆధ్యాత్మిక సమ్మేళనానికి హాజరు కావాల్సిందిగా మిషన్ ప్రస్తుత గురువు కమలేష్ పటేల్.. సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు. రామచంద్ర మిషన్ గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ రంగంతో పాటు పలు సామాజిక రంగాల్లో సేవలు అందిస్తోంది.

హైదరాబాద్​లో నడిరోడ్డుపై నరికేశారు

హైదరాబాద్​లోని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. జియాగూడ రోడ్డుపై అందరూ చూస్తుండగానే ముగ్గురు వ్యక్తులు నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని కత్తులతో నరికి చంపారు. కోఠి ఇసామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌ (35) గ్లాస్‌ వర్క్‌, కార్పెంటర్‌ పనిచేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం సాయినాథ్​ తన బైక్‌పై పురానాపుల్‌ నుంచి కార్వాన్‌ వైపు వెళ్తుంటే గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైక్‌లపై వెంబడించారు. రోడ్డుపైనే అడ్డగించారు. తప్పించుకొని పారిపోతుంటే వెంటాడి నరికి చంపారు. అటుగా వెళ్లే వాహనదారులు కొందరు ఈ మర్డర్​ను వీడియోలు తీసి పెట్టడంతో సోషల్‌ మీడియాలో పెట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని తెలుస్తోంది.

హైదరాబాద్​లో చెగువేరా కుమార్తె.. మనవరాలు

క్యూబా విముక్తి పోరాట యోధుడు చేగువేరా కుమార్తె, ఆయన మనవరాలు హైదరాబాద్​కు వచ్చారు. ఆదివారం రవీంద్ర భారతిలో జరిగిన క్యూబా సంఘీభావ సభలో చెగువెరా కుమార్తె అలైదా గువెలా, ఆమె కుమార్తె ప్రొఫెసర్‌ ఎస్తఫానియా హాజరయ్యారు. చేగువేరా కూతురిగా కాకుండా క్యూబా మహిళనైనందుకు తాను గర్వపడుతున్నానని అన్నారు. క్యూబాలోని వనరులకు ప్రజలే యజమానులని చెప్పారు. ప్రపంచంలో పలు దేశాల వనరులు దోచుకుంటున్న అమెరికా క్యూబా ధైర్యాన్ని చూసి భయపడుతోందన్నారు. క్యూబాను స్ఫూర్తిగా తీసుకుని ఇతర దేశాలు ప్రతిఘటిస్తాయన్న ఆందోళన అమెరికాకు ఉందని అన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here