సిక్కింలో ట్రక్కు బోల్తా..16 మంది సైనికులు మృతి
సిక్కిమ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న ట్రక్కు లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు సహా 16 మంది చనిపోయారు. నార్త్ సిక్కిమ్‌లోని జెమా వద్ద ట్రక్కు మలుపు తిరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు ఆర్మీ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. నలుగురు సోల్జర్లు గాయపడ్డట్లు తెలిపింది.
అమెరికాలో మంచు తుఫాన్
అమెరికాను మంచు తుఫాను వణికిస్తున్నది. మైనస్ 40 డిగ్రీల టెంపరేచర్ రికార్డు కావడంతో జనజీవనం స్తంభించిపోయింది. జాతీయ రహదారులు మూసివేశారు. వేలాది విమానాలు క్యాన్సిల్ చేశారు. భారీగా మంచు కురుస్తుండటంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ‘‘బాంబ్ సైక్లోన్’గా బలపడే ప్రమాదం ఉందని అక్యూవెదర్ సంస్థ హెచ్చరించింది.
హైదరాబాద్‌లో కుంగిన నాలా
హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద నాలా కుంగింది. రోడ్డు కింద ఉన్న నాలా కుంగిపోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. దాదాపు 100 మీటర్ల మేర నాలా కుంగిపోవడంతో.. రోడ్డుపై నిలిపిన వాహనాలు అందులో పడిపోయాయి. ఈ ఘటన గోషామహల్ లోని చాక్నవాడిలో జరిగింది. శుక్రవారం వీక్లీ మార్కెట్ కావడంతో వ్యాపారులు తమ దుకాణాలు ఏర్పాటు చేసుకుంటుండగా నాలా కుంగింది. తోపుడు బండ్లన్నీ అందులో పడిపోయాయి. రెండు కార్లతో పాటు ఐదారు టూవీల్లర్లు, ఆటో, నాలుగు తోపుడు బండ్లు గుంతలో పడిపోయాయి.
జగిత్యాల వాసికి 30 కోట్ల లాటరీ
ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టిన ఓ యువకుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగుర్ కు చెందిన ఓగుల అజయ్ గతేడాది దుబాయ్ వెళ్లి డ్రైవర్ గా పనిలో చేరాడు. ఈ క్రమంలో దుబాయ్ లో ఎమిరేట్స్ డ్రా లో 30 యూఏఈ ధరహమ్స్ తో రెండు లాటరీ టికెట్స్ కొన్నాడు. నిర్వాహకులు శుక్రవారం డ్రా తీయగా అజయ్ ఒక టికెట్ కు లాటరీ తగిలింది. ట్యాక్స్ పోను ఇండియన్ కరెన్సీ లో దాని విలువ రూ.30 కోట్లు ఉంటుందని ఆ యువకుడు చెబుతున్నాడు.
ఐటీ కారిడార్‌లో సైబర్ దొంగలు:
ఐటీ కారిడార్ సైబరాబాద్ పరిధిలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఆర్థిక నేరాలు, ఆన్‌లైన్ చీటింగ్ కేసులు భారీగా నమోదయ్యాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు 25.84 శాతం, చీటింగ్ కేసులు15 శాతం ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయి. ఓవరాల్ క్రైమ్ రేట్ మాత్రం12 శాతం తగ్గింది. . గతేడాది 30,954 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 27,322 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 27 లక్షల ట్రాఫిక్ చలాన్లు విధించామని, మొత్తం రూ. 121 కోట్ల ఫైన్లు వేశామని పోలీసులు తెలిపారు.
పోలీస్ రిక్రూట్‌మెంట్‌పై సంజయ్ లేఖ
రాష్ట్రంలో పోలీసు రిక్రూట్మెంట్‌కు సంబంధించి ఫిజికల్ టెస్ట్ లోని లోపాలు, అవకతవకలను వెంటనే సవరించాలని సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ శుక్రవారం లేఖ రాశారు. లాంగ్ జంప్, షాట్ పుట్ పరీక్షల్లో నోటిఫికేషన్ లో చెప్పిన దానికి భిన్నంగా వ్యవహరించడంతో దాదాపు రెండు లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించలేకపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాంగ్ జంప్ డిస్టెన్స్ 3.8 మీటర్లు ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించడంతో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ప్రస్తావించారు. లాంగ్ జంప్ తో పాటు షాట్ పుట్ విషయంలో పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
581 వార్డెన్ పోస్టులకు నోటిఫికేషన్
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (వార్డెన్) పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 10 విభాగాల్లో 581 ఖాళీలను నింపుతామని ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5గంటల దాకా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
30 నుంచి గ్రూప్ 4 అప్లికేషన్లు
గ్రూప్ 4 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన అప్లికేషన్ల ప్రక్రియ టెక్నికల్ కారణాలతో నిలిచిపోయింది. దీంతో దరఖాస్తుల ప్రక్రియను 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ఓ వెబ్ నోట్‌లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 30 నుంచి జనవరి 19 సాయంత్రం 5 గంటల వరకు గ్రూప్ 4 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
26 నుంచి కాంగ్రెస్ హాత్‌సే హాత్
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుసంధానంగా ‘హాత్ సే హాత్’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో జనవరి 26 నుంచి ప్రారంభించనున్నట్లు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ దాకా ఈ ప్రోగ్రాం జరుగుతుందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జ్‌షీట్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను రాష్ట్రంలోని ఇంటింటికీ తీసుకెళ్తామని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్లు కోరిన రాష్ట్ర సర్కార్
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ను స్పీడప్ చేస్తామని, ఇందుకోసం వ్యాక్సిన్ డోసులు పంపించాలని కేంద్ర సర్కార్‌ను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8లక్షల కోవాగ్జిన్, 80వేల కొవిషీల్డ్ డోసులు ఉన్నాయన్నారు. కార్బొవాక్స్ డోసులు మొత్తానికే లేవని తెలిపారు. కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్ పాల్గొని మాట్లాడారు.
టెస్టులు పెంచండి.. కేంద్రం సూచన
చుట్టుపక్కల దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున అన్ని రాష్ట్రాలు అలర్ట్ గా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. అన్ని జిల్లాల్లో టెస్టులు చేయాలని, కొత్త వేరియంట్ను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలని చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితిపై ఆయన రాష్ట్రాల హెల్త్ మినిస్టర్లతో శుక్రవారం సమావేశమయ్యారు. భయపడాల్సిన అవసరం లేదని, కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచాలన్నారు.
కోట్లల్లో కరోనా కేసులు
చైనాలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ వారంలో ఒక్కరోజే 3.7 కోట్ల మందికి కరోనా సోకిందని, ఈ నెల మొదటి 20 రోజుల్లో దాదాపు 24.8 కోట్ల మంది వైరస్ బారినపడ్డారని అక్కడి అధికారులు అంచనా వేశారు. సిచువాన్ ప్రావిన్స్, దేశ రాజధాని బీజింగ్ లో దాదాపు సగం మంది కరోనా బారినపడ్డారని అధికారులు అంచనా వేశారు.
యుద్ధానికి ముగింపు పలుకుతాం
ఉక్రెయిన్‌తో యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. రష్యాను బలహీనపరిచేందుకు అమెరికా.. ఉక్రెయిన్ను పావుగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. తాము లేవనెత్తిన అంశాలను ఉక్రెయిన్, అమెరికా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
బికినీ కిల్లర్ విడుదల
ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్(78) నేపాల్ జైలు నుంచి శుక్రవారం రిలీజ్ అయ్యాడు. ఆరోగ్య కారణాల రీత్యా అతన్ని విడుదల చేస్తున్నట్టు నేపాల్ సుప్రీం కోర్టు వెల్లడించింది. సాయంత్రం అతను నేపాల్ నుంచి గట్టి పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ఫ్రాన్స్వెళ్లిపోయినట్టు అతని తరఫు అడ్వొకేట్ గోపాల్ శివకోటి చింతన్ మీడియాకు చెప్పారు. 1970 నుంచి ఆసియా వ్యాప్తంగా మొత్తం 20కు పైగా యంగ్ ఫారెనర్స్ను టార్గెట్ చేసుకుని చంపేశాడు. 1975లో శోభరాజ్ చేతిలో హత్యకు గురైన ఓ మహిళ డెడ్బాడీని బీచ్లో గుర్తించారు. అప్పుడు ఆమె బాడీపై బికినీ మాత్రమే ఉంది. అందుకే అతణ్ని ‘బికినీ కిల్లర్’ అని కూడా పిలుస్తుంటారు.
నట సార్వభౌమ కైకాల మృతి
నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకుని రాజకీయ, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. కైకాల మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ నటులు చిరంజీవి, బాలకృష్ణ సహా రాజకీయ సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.