6వ తేదీన బడ్జెట్.. గవర్నర్​ స్పీచ్​తో ప్రారంభం.. హైకోర్టులో పిటిషన్​ వెనక్కి తీసుకున్న సర్కారు.. ఇంటర్​ బోర్డులో లొల్లి..

గవర్నర్ స్పీచ్​కు సర్కారు ఓకే

గవర్నర్​పై హైకోర్టుకెక్కిన ప్రభుత్వం దిగివచ్చింది. బడ్జెట్​ను అనుమతించటం లేదంటూ హైకోర్ట్ లో వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంది. ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభం అవుతాయని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ ధవే కోర్టుకు తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన టైమ్​లో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ వ్యవస్థలు కావటంతో ఇందులో న్యాయ వ్యవస్థ ఎలా జోక్యం చేసుకుంటుంది..? పరస్పరం అవగాహనకు వస్తే మంచిదని హైకోర్టు చేసిన సూచనతో ప్రభుత్వం దిగివచ్చింది. అనంతరం శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్​రెడ్డి, ఫైనాన్స్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ రామకృష్ణారావు, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచార్యులు రాజ్​భవన్​కు వెళ్లి మర్యాదపూర్వకంగా గవర్నర్​ కలిసి అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. తాజా పరిణామాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రొరోగ్​ చేసేందుకు ప్రభుత్వం ​ రెడీ అయింది. ముందుగా ప్రకటించిన విధంగా 3వ తేదీన కాకుండా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి బడ్జెట్ మీటింగ్స్​ ప్రారంభించే అవకాశాలున్నాయి.

ఇంటర్​ బోర్డులో రచ్చకెక్కిన లొల్లి​

ఇంటర్​ పరీక్షలను ఆన్​ లైన్​ వాల్యుయేషన్​ చేయాలనే నిర్ణయం.. ఇంటర్‌ బోర్డులో వివాదం లేపింది. ఏకంగా ఇంటర్​ బోర్డులో తనకు సమాంతర వ్యవస్థ నడుస్తోందని.. ఆఫీసులోని సీసీ కెమెరాలను ట్యాంపర్​ చేస్తున్నారని ఆదివారం రాత్రి ఇంటర్​ బోర్డు కమిషనర్​ నవీన్​మిట్టల్​ సంచలన ఆరోపణలు చేశారు. అనుమతి లేకుండా ఆఫీసులోకి ప్రవేశించి కంప్యూటర్‌లోని పాస్‌వర్డ్‌ను మార్చారని.. డేటా డిలీట్‌ చేశారంటూ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. మ్యాన్యువల్‌ వాల్యుయేషన్‌ ద్వారా డబ్బులు సంపాదించే వారు ఆన్‌లైన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని, లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు కొన్ని ఐటీ కంపెనీలతో కలిసి కొంత మంది అధికారులు తనకు హాని చేయడానికి సిద్ధమయ్యారని, తనను అంతం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. తనకు ఏ హాని జరిగినా.. అందుకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఓ కార్పొరేట్‌ సంస్థకు ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌ టెండర్‌ కేటాయించి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అవినీతిపరుడు మిట్టల్‌ను తక్షణమే బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

గవర్నర్​ వ్యవస్థ రద్దు చేయాలి: కేటీఆర్​

ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజలు ప్రధానిని, ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. గవర్నర్​తో ఇప్పుడేమి ఉపయోగమో అర్థం కావడం లేదని మంత్రి కేటీఆర్​ అన్నారు. ప్రధాని పేరును వైస్రాయ్​ గా మార్చుకోవాలని, లేదంటే లేదంటే గవర్నర్ వ్యవస్థను ఎత్తేయాలని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం, పార్టీల తరఫున చర్చల్లో పాల్గొనడం, రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని మంత్రి కేటీఆర్ సూచించారు. సోమవారం సిరిసిల్లలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు.

గ్రూప్​ 4 అప్లికేషన్లకు గడువు పొడిగింపు

గ్రూప్‌-4 ఉద్యోగాలకు దరఖాస్తు గడువును టీఎస్​పీఎస్​పీ పొడిగించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 30 తోనే ఉద్యోగాల దరఖాస్తు గడువు ముగిసింది. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ గడువు పొడిగించినట్లు ప్రకటనల విడుదల చేసింది. వీటితో పాటు అగ్రికల్చర్‌ అధికారుల పోస్టులకు దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 2 వరకు పొడిగించారు. కాగా, ఫారెస్ట్‌ కాలేజీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ ఇంటర్వ్యూలను ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో నిర్వహించనుంది.

ఈ వారంలోనే పోడు భూములకు హక్కు పత్రాలు

ఫిబ్రవరి మొదటి వారంలో పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హక్కు పత్రాల జారీపై గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్​ శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఫిబ్రవరిలోనే అర్హులైన లబ్దిదారులందరికీ పోడు హక్కు పత్రాలు ఇవ్వాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పత్రాల పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని సూచించారు.

టీచర్ల బదిలీల గడువు రేపటి వరకు

 ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 1వ తేదీ వరకు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారంతో ముగియనుండగా ఆన్‌లైన్‌లో సమస్యలు ఎదురవుతున్నందున కొందరు ఉపాధ్యాయులు సకాలంలో దరఖాస్తులు చేసుకోలేకపోతున్నారని, గడువు పొడిగించాలని పలు ఉపాధ్యాయ సంఘాల నుంచి విద్యాశాఖకు వినతులు అందాయి. పరిస్థితిని గమనించిన పాఠశాల విద్యాశాఖ ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని సంబంధించిన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here