ఆ ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నో టికెట్.. ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మరో ఏడాది టైం ఉన్నా.. అన్ని పార్టీలు కూడా మరో నెలలోనే ఎన్నికలు అన్న తీరుగా పావులు కదుపుతున్నాయి. అయితే.. ఎలాగైనా ముచ్చటగా మూడో సారి అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టులతో మొదలైన పొత్తును వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చారు. బీజేపీని రాష్ట్రంలో అడ్డుకోవడమే లక్ష్యంగా సీపీఐ, సీపీఎం పార్టీలు సైతం టీఆర్ఎస్ తో జత కట్టడానికి దాదాపు నిర్ణయానికి వచ్చాయి. దీంతో ఆ పార్టీలకు ఏ సీట్లను టీఆర్ఎస్ పార్టీ కేటాయిస్తుందన్న అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకు మంచి బలం ఉంది. దీంతో ఆ జిల్లాలో మెజార్టీ సీట్లను ఆయా పార్టీలు అడిగే అవకాశం ఉంది. జిల్లాలో మూడు జనరల్ సీట్లు ఉండగా టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం ఒక్కోటి చొప్పున పంచుకుంటాయని ఆయా పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు.

ఇందులో పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేయడం ఖాయమేనన్న ప్రచారం జిల్లాలో ఊపందుకుంది. ఇంకా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గతంలో తాను ఎమ్మెల్యేగా పని చేసిన కొత్తగూడెం నుంచి పొత్తుల్లో భాగంగా బరిలోకి దిగుతారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వనమా వేంకటేశ్వర రావు ఇటీవల హైదరాబాద్​లో మంత్రి కేటీఆర్ ను కలవటం వెనుక అదే కారణమనే ప్రచారం జరిగింది. అదే జిల్లాలో వైరా సీటును సీపీఐ, భద్రాచలం సీటును సీపీఎం పొత్తుల్లో భాగంగా అడిగే అవకాశం ఉంది.

మధిర నియోజకవర్గాన్ని కూడా తమకు కేటాయించాలని సీపీఎం కోరే అవకాశం ఉంది. గతంలో ఆయా పార్టీలు ఈ సీట్ల నుంచి గెలుపొందడమే ఇందుకు కారణం. ఈ మొత్తం ఐదు సీట్లలో మధిర, భద్రాచలం మినహా మిగతా మూడు సీట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తమ సీట్లను ఇతర పార్టీలకు కేటాయిస్తే ఆయా ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారోనన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ ఒకటి రెండు సీట్లు కమ్యూనిస్టులు అడిగే అవకాశం ఉంది.

ఈ జిల్లా మొత్తం ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారు పొత్తుల్లో తమ సీట్లను వదులుకుంటారా? లేదా? అన్న చర్చ కూడా ఉంది. గతంలో తాము ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి, కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ సీట్లను సీపీఐ కోరుతుందన్న ప్రచారం కూడా ఉంది. ఇన్ని సీట్లను అధికార పార్టీ త్యాగం చేస్తుందా? లేదా? అన్నది తేలాలంటే ఎన్నికల నాటి వరకు ఆగాల్సిందే!

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here