తెలంగాణ డీజీపీగా పని చేస్తున్న మహేందర్ రెడ్డి డిసెంబర్ 31న రిటైర్ అవుతున్నారు. దీంతో తెలంగాణలో కాబోయే కొత్త డీజీపీ ఎవరనే అంశంపై పోలీసు వర్గాల్లో మాత్రమే కాకుండా.. రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఐపీఎస్ సర్వీస్ సీనియారిటీ ప్రకారం హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఏసీబీ చీఫ్ అంజనీ కుమార్ పేర్లు డీజీపీ రేసులో ఉన్నాయి. వీరిలో రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన వారిని.. డీవోపీటీ ఆమోదిస్తుంది. దీంతో సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నవారికి ఈ పోస్టు దక్కుతుంది. ఈ రేసులో అంజనీ కుమార్, సీవీ ఆనంద్ పేర్లే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలోనూ సీవీ ఆనంద్ వైపే కేసీఆర్ మొగ్గు చూపే అవకాశముందని పోలీసు డిపార్టుమెంట్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఆ బాధ్యతలను సీవీ ఆనంద్కు అప్పగించినప్పటికీ నుంచీ ఈ ప్రచారం మరింత పెరిగింది.
![](https://udayum.com/wp-content/uploads/2022/11/CV-Anand-1.jpg)
ఆయన మీద నమ్మకంతోనే కేసీఆర్ ఈ కీలక బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో హైదరాబాద్ సీపీగా పని చేస్తున్న వారే డీజీపీగా నియమితులవటం ఆనవాయితీగా వస్తోంది. డీజీపీ మహేందర్ రెడ్డి, అంతకు ముందు డీజీపీ అనురాగ్ శర్మ కూడా డీజీపీగా పని చేయడానికి ముందు హైదరాబాద్ కమిషనర్ గా పని చేశారు. ఈ నేపథ్యంలోనే సీవీ ఆనంద్ కు కూడా డీజీపీగా అవకాశం దక్కవచ్చని అంతా భావిస్తున్నారు.