ఎస్టిమేట్స్.. రివైజ్డ్ ఎస్టిమేట్స్ పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన అవినీతి కొత్త రాష్ట్రంలో మరింత పెరిగిపోయింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆరంభించిన ప్రాజెక్టుల అంచనాలు లెక్కకు మించి పెరిగిపోయాయి. ఆరేండ్ల కిందట రూ. 89,860 కోట్లు ఉన్న ప్రాజెక్టుల అంచనా వ్యయం.. రూ.2,08,925 కోట్లకు సవరించారు. దీంతో ప్రాజెక్టుల అంచనాల్లోనే లక్ష కోట్లకు పైగా (రూ.1,19,065 కోట్లు) పెంచుకోవటం.. భారీ ఎత్తున అవినీతికి, కమీషన్ల దందాకు స్కోప్ ఇచ్చింది. కాళేశ్వరం (ప్రాణహిత – చేవెళ్ల) ప్రాజెక్టు విలువ ఏకంగా మూడు ఏడు రెట్లు పెరిగింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవం నిర్మాణ వ్యయం ఏడాదిలోనే డబుల్‌అయ్యింది. పాలమూరు – రంగారెడ్డి, దేవాదుల లిఫ్ట్‌ఇరిగేషన్‌ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరిగింది. వరద కాలువ అంచనా వ్యయం ఏకంగా ఏడు రెట్లు పెరిగింది. సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టును మూడు రెట్లు పెంచగా అంచనాలు ఎనిమిది రెట్లు పెరిగాయి.
సర్వేల నుంచే దోపిడీ
కోటి ఎకరాలకు నీటిని అందించే రీడిజైన్ ప్లాన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్వేల నుంచి దోపిడీకి రంగం సిద్ధం చేసుకుంది. తాము అనుకున్న ప్రకారం ప్రాజెక్టులను కట్టుకునేందుకు సర్వేలన్నీ డొల్లగా తయారు చేసింది. కొందరు రిటైర్డ్ ఇంజనీర్లను మచ్చిక చేసుకునేందుకు ఈ సర్వేలను వాడుకుంటోంది. వాళ్ల పేరిట ఉన్న ఏజెన్సీలకు సర్వే పనులు అప్పగించి.. తాము కోరిన విధంగా ప్రాజెక్టుల డిజైన్లు మార్చుకుంది. ప్రాణహిత ను కాళేశ్వరంగా మార్చటంలో సీఎం కేసీఆర్ తన సొంత సర్వేలకే ప్రియారిటీ ఇచ్చారు.
నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టుకు ఇప్పటికే నాలుగు సార్లు సర్వే చేయించటం.. సర్వే ఏజెన్సీలు, రిటైర్డ్ ఇంజనీర్లకు ఉపాధి కల్పించే స్కీమేనని బహిరంగంగా ప్రచారంలో ఉంది.
కల్వకుర్తిలో మోటార్లు కొట్టుకుపోయేందుకు ప్రధాన కారణమైన పాలమూరు పంప్ హౌజ్ నిర్మాణం కూడా రిటైర్డ్ ఇంజనీర్లు, వాళ్ల సారథ్యంలో నడిచే కాంట్రాక్టు కంపెనీల కోసం చేసిందే.
సీతారామ నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ లింక్, చెన్నూరు లిఫ్టులు, ఆమ్రాబాద్ లిఫ్ట్ స్కీం, గట్టు ఎత్తిపోతల పథకం ఇలా అన్ని సర్వేలు రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించిన ఏజెన్సీలకే కట్టబెట్టారు.
===================================
ఎర్త్ వర్క్ బడా ట్రిక్
కొత్త ప్రాజెక్టుల అంచనాల తయారీలో ప్రభుత్వం మరో గోల్మాల్ చేస్తోంది. తాము ఇచ్చిన సర్వే రిపోర్టుల ఆధారంగానే ఎస్టిమేట్లు తయారవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా చేసి ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగం ఎస్టిమేట్లలో మాయ చేస్తోంది. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును భూతద్దంలో చూపించి.. అటు కాంట్రాక్టర్లకు, ఇటు కమీషన్ల మార్జిన్ ఉండేలా అంచనాలను తయారు చేస్తోంది. ఎలక్ట్రో మెకానికల్, టెక్నికల్ అంశాల్లో ఇంజనీర్లు ఆడిందే ఆట కావటంతో ఈ అంచనాల తయారీ ఫార్స్‌గా మారింది. సివిల్ పనుల్లో జరుగుతున్న ఈ ఎస్టిమేట్ల లోగుట్టు బయట పెడుతోంది. ప్రధానంగా ఎర్త్ వర్క్ (మట్టి పనుల్లో) భారీ గోల్మాల్ జరుగుతోంది. బ్యారేజీలు, రిజర్వాయర్లు, మట్టి కట్టలన్నింటా ఇష్టమొచ్చిన రేట్లు, సైజులను పెంచుతోంది.
మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో తొలుత కోటి క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాలని అంచనా వేసి.. రెండు కోట్ల క్యూబిక్ మీటర్లుగా బిల్లులు చెల్లించారు.
అన్నారంలో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాలని అంచనా వేసి.. 1.70 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచారు. దీంతో కాంట్రాక్టు కంపెనీ రెండితలు లాభపడింది.
2016 – 17 లో టెండర్ల సమయంలో ఎర్త్ వర్క్ క్యూబిక్ మీటర్ కు రూ.130 చొప్పున రేటు చెల్లించగా.. ఇప్పుడు అదే క్యూబిక్ మీటర్‌కు రూ.280 కట్టబెడుతున్నారు. దీంతో అటు సైజులోనూ.. ఇటు రేట్ లోనూ కంపెనీలు డబుల్ ధమకా అన్నట్లు సంపాదిస్తున్నాయి. టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ఈ మట్టి పనులను క్యూబిక్ మీటర్‌కు రూ.64 రేటుకు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నాయి. దీన్ని బట్టి.. మట్టి పనుల్లోనే భారీగా ముంచుతున్న తీరు బయటపడుతోంది.
===================================
సర్వేలు, ఎస్టిమేషన్లు దాటగానే… కీలకమైన టెండర్ల స్టేజ్‌లో కాంట్రాక్టర్లకు మించి ప్రభుత్వం రింగ్ తిప్పుతోంది. తాము ముందుగా ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టు కంపెనీలకు పనులు కట్టబెట్టేందుకు వీలుగా క్వాలిఫికేషన్లను మార్చుతోంది. అందుకు వీలుగా టెక్నికల్ బిడ్లను సిద్ధం చేస్తోంది. దీంతో టెండర్లు ఫార్స్‌గా మారాయి. ప్రభుత్వమే తమ అనుయాయ కంపెనీలకు పోటీ లేకుండా నిబంధనలు తయారు చేస్తోంది. ఇతర కంపెనీలను టెక్నికల్ బిడ్ నుంచి ఎలిమినేట్ చేస్తోంది. దీనికి తోడు ఎక్సెస్ రేట్లకు కోట్ చేయించి.. టెండర్లను అప్పగిస్తోంది.
రాష్ట్రంలో గత ఆరేండ్లలో టెండర్లు పిలిచిన ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వం ఎక్సెస్ రేట్‌కే కట్టబెట్టడం విచిత్రం.
కాళేశ్వరం థర్డ్ టీఎంసీ, మల్లన్నసాగర్ నాలుగు రీచ్‌లతో పాటు సీతారామ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీకి పిలిచిన టెండర్లన్నీ ఎక్సెస్‌కే కోట్ చేశాయి.
ప్రభుత్వం, కాంట్రాక్టర్ల మధ్య ఉన్న మిలాఖత్ కు ఈ ఎక్సెస్ కోటింగ్ ఒక ఉదాహరణ. ఇప్పటివరకు ఇరిగేషన్ వింగ్ పిలిచిన అన్ని టెండర్లు మినిమమ్ 3 నుంచి 5 శాతం వరకు ఎక్సెస్ రేటుపై ఇచ్చేశారు. దీంతో దాదాపు రూ.15000 కోట్లు కాంట్రాక్టు కంపెనీలు అదనంగా దోచుకున్నాయి.
===================================
గంపగుత్త కాంట్రాక్టులు
నీళ్లు.. నిధులు.. నియామకాల్లో అన్యాయానికి వ్యతిరేకంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే దక్కాయి. చిన్నాచితకా పనులు తప్ప బడా ప్రాజెక్టులన్నీ గంపగుత్తగా ఒక కాంట్రాక్టు కంపెనీకి కట్టబెట్టారు. ఏపీకే నవయుగ, ఇతర వర్క్ ఏజెన్సీలకు పెద్ద ఎత్తున పనులు అప్పగించారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డి, సీతారామ, దేవాదుల లిఫ్ట్‌స్కీముల్లో కీలక పనులన్నీ మేఘానే దక్కించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కంపెనీకి రూ.65 వేల కోట్ల పనులు అప్పగించారు. మిగతా ప్రాజెక్టులన్నీ కలిపితే దాదాపు రూ.90 వేల కోట్ల పనులు ఈ కంపెనీకి ధారాదత్తం చేశారు.
===================================
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతిని ప్రభుత్వం రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి రూ.15 వేల కోట్లను వృథా చేసింది. తుమ్మడిహెట్టి నుంచి 75 కి.మీ.ల గ్రావిటీ కెనాల్ తవ్వి లైనింగ్ చేసి వృథాగా వదిలేశారు. పాలముపర్తి (కొండపోచమ్మ) రిజర్వాయర్ నుంచి చేవెళ్ల నియోజకవర్గానికి నీళ్లు అందించేందుకు తవ్విన అండర్ గ్రౌండ్ టన్నెల్ కూడా నిరుపయోగంగా మారింది. ప్రాణహిత 5 ప్యాకేజీలో 17.9 కి.మీ.ల పైపులైన్ వేసేందుకు రూ.350 కోట్లతో తెప్పించిన పైపులు వృథాగా పడి ఉన్నాయి. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నింపడానికి ప్రాణహిత లిఫ్ట్ స్కీంలో భాగంగా నిర్మాణం మొదలు పెట్టిన పంపుహౌస్ కూడా వృథా అయ్యింది.
దుమ్ముగూడెం ఎత్తిపోతల కోసం వినియోంచడానికి కొన్న పైపులు వృథాగా మారాయి. ఈ లిఫ్ట్ స్కీం కోసం కొన్న మోటార్లను భక్త రామదాసు, తుమ్మిళ్ల లిఫ్ట్ స్కీంలకు ఉపయోగించినా పైపులు మాత్రం వృథాగా పడి ఉన్నాయి.
======================================
ఎస్సారెస్పీకి పునరుజ్జీవం
మహారాష్ట్ర నుంచి పోచంపాడు ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోస్తామంటూ మొదలు పెట్టిన పునరుజ్జీవం ప్రాజెక్టు ఎస్సారెస్పీకి అక్కరకు రాకుండా పోయింది. పునరుజ్జీవంలో భాగంగా రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట, ముప్కొల్ పంపుహౌస్‌లను నిర్మించాల్సి ఉండగా, మొదటి రెండు పంపుహౌస్‌లు మాత్రమే పూర్తి చేశారు. ఒక సీజన్‌లో 45 టీఎంసీల నీళ్లను ఎస్సారెస్పీలోకి పంపు చేయాలంటే పోచంపాడు దిగువన ముప్కొల్ పంపుహౌస్ తప్పనిసరి. కీలకమైన పంపు హౌస్ కట్టకుండానే ప్రాజెక్టు ఖర్చును డబుల్ చేశారు.
=======================================
నిర్వహణ
ప్రాజెక్టుల నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు ఎస్సారెస్పీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు అంతంతమాత్రంగానే నిధులు ఇస్తున్నారు. ఐడీసీ లిఫ్ట్ స్కీంలకు మెయింటనెన్స్‌కు పైసలు ఇవ్వడం మరిచారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూసీ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఈ రిజర్వాయర్ క్రస్ట్ గేటు ఒకటి తెరుచుకోవడం లేదు. ఆరు రెగ్యులేటరీ గేట్లది అదే పరిస్థితి. కడెం ప్రాజెక్టు గేట్ స్ట్రక్ అయి నీళ్లు వృథా అయ్యింది. ఇంజనీర్లు, సిబ్బంది రోజుల తరబడి కష్టపడి దానికి రిపేర్లు చేశారు. సరళాసాగర్‌కు గండి పడింది. దీంతో ప్రాజెక్టు కింద 4,200 ఎకరాలకు నీళ్లు అందుకుండా పోయాయి. రామన్‌పాడు నుంచి సరళాసాగర్‌లోకి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ స్కీం రిపేర్లు, లీకేజీలతో అస్తవ్యస్తంగా మారిపోయింది.
నాగార్జునసాగర్‌కు 26 గేట్లు ఉండగా అందులో 8 గేట్ల నుంచి నీళ్లు లీకవుతున్నాయి. జూరాల ప్రాజెక్టు 26 గేట్లు తుప్పుపట్టాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులు మినహా శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. 2016లో సింగూరుకు భారీ వరద పోటెత్తడంతో రిజర్వాయర్ మధ్యలో గేట్లు తెరుచుకోకపోవడంతో రెండు వైపులా గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కిన్నెరసాని గేట్లకు రిపేర్లు చేయకపోవడంతో నీళ్లు గేట్ల నుంచి లీకవుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మత్తడివాగు, సాత్నాల, స్వర్ణ, వట్టివాగు, సుద్దవాగు రిజర్వాయర్ల గేట్ల మెయింటనెన్స్ అధ్వనంగా మారింది. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ గేట్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా నీటి లీకేజీ ఆగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై సరైన పర్యవేక్షణ లేక కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి నీటిని తరలించే గ్రావిటీ కాలువ లైనింగ్ కొట్టుకుపోయింది. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడంతోనే మల్లన్నసాగర్ కాల్వకు రెండుసార్లు గండ్లు పడ్డాయి. కొండపోచమ్మ వాకోవర్ బ్రిడ్జి కూలిపోయింది.
మిడ్ మానేరు కట్టకు బుంగపడి రాత్రికి రాత్రే గేట్లు ఎత్తాల్సి వచ్చింది. 2019లో ఎస్సారెస్పీకి భారీ వరదలు వచ్చినప్పుడు మిడ్ మానేరును వరద కాలువ ద్వారా పైసా ఖర్చు లేకుండా నింపుకునే అవకాశమున్నా రిపేర్ల పేరుతో ఆ అవకాశం కోల్పోయాం. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులోని కర్వెన రిజర్వాయర్ ఆనకట్ట నిర్మాణ దశలోనే రెండుసార్లు తెగిపోయింది.
==========================================
కోటి రూపాయలకు మించి ఏ పని చేసినా టెండర్‌లు పిలువాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మేఘా కంపెనీకి లాభం చేకూర్చడానికి వేల కోట్ల రూపాయల టెండర్లను నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టింది. మేడిగడ్డ నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల.. సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులు రూ.4,600 కోట్లతో చేపట్టగా వాటికి మేఘాకు నామినేషన్ పద్ధతిన అప్పగించింది.
=============================================
పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మోటార్ల కొనుగోళ్లలో రూ.2,426.07 కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. 2016 జనవరిలో ఎల్లూర్ పంపుహౌస్‌లోని మోటార్లు, పంపుల ఏర్పాటు వ్యయం రూ.1,411.37 కోట్లు అవుతుందని అంచనా వేయగా అదే ఏడాది జూన్‌లో దానిని రూ.2,025 కోట్లకు పెంచారు. 145 మెగావాట్ల కెపాసిటీ గల ఒక్కో పంపునకు రూ.118 కోట్లు ఖర్చవుతుందని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఇస్కీ) అంచనా వేయగా ప్రభుత్వం ఒక్కో మోటారుకు రూ.179 కోట్లు చెల్లిస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
మొత్తంగా పంపులు, మోటార్ల కొనుగోలు ఖర్చు రూ.5,960.79 కోట్ల నుంచి రూ.8,386.86 కోట్లకు పెరిగిందని తన పిటిషన్‌లో తెలిపారు. పంపులు, మోటార్ల కొనుగోళ్లలో అక్రమాలపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.
===============================================