Homecinemaతెలంగాణ ప్రాజెక్టుల కథలు 2

తెలంగాణ ప్రాజెక్టుల కథలు 2

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌ ప్రాజెక్టులుగా ముద్రపడిన వాటిని తెలంగాణలోనూ పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పెండింగ్‌ ప్రాజెక్టుల దశ మార్చుతామని చెప్పినా ఆచరణలో మాత్రం ఏమీ చేయలేదు. శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ టన్నెల్‌ స్కీం అడుగు ముందుకు కదలలేదు. 2017లో సవరించిన అంచనా ప్రకారం రూ.3,152.72 కోట్లతో అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఇచ్చినా పైసలు విడుదల చేయలేదు. టన్నెల్‌లో నీళ్లు ఎత్తిపోసే కరెంట్‌ బిల్లులకు కూడా డబ్బులు విడుదల చేయడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించే సమయంలో మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రాణహిత ప్రాజెక్టును నిర్మిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచినా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ స్థలం వద్ద తట్టెడు మట్టి కూడా తీయలేదు. సాంకేతిక కారణాలతో ఈ బ్యారేజీనే తెరమరుగు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

కాళేశ్వరం థర్డ్‌ టీఎంసీ పనుల్లో పైపులైన్ల పేరుతో వేల కోట్లు కాంట్రాక్టు కంపెనీకి లాభం చేస్తున్నారు. మొత్తం పనుల్లో 42.48 కి.మీ.ల దూరం పైపులైన్‌లు వేస్తున్నారు. అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ తవ్వితే వందేండ్లు పని చేసే అవకాశమున్నా పక్కన పెట్టేశారు. ఎక్స్‌పర్ట్‌ల నివేదికలను కూడా పక్కన పెట్టి ప్రభుత్వం పైపులైన్లకు ఓకే చెప్పింది.

కి.మీ. టన్నెల్‌ తవ్వకానికి లైనింగ్‌తో కలుపుకుని రూ.80 కోట్లు ఖర్చయితే, కి.మీ. పైపులైన్‌ వేయడానికి రూ.280 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. మెయింటనెన్స్‌, కరెంట్‌ బిల్లుల భారం కూడా ఎక్కువే. థర్డ్‌ టీఎంసీలో పైపులైన్‌ల పేరుతో రూ.8,496 కోట్లు వృథా చేస్తున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీటినే ఉపయోగించుకోలేకపోతున్న ప్రభుత్వం థర్డ్‌ టీఎంసీ పేరుతో రూ.27 వేల కోట్ల అదనపు పనులు చేపట్టింది. ఇందులో రూ.21 వేల కోట్ల పనులు మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీకి కట్టబెట్టింది. కాళేశ్వరం థర్డ్‌ టీఎంసీ కింద అదనంగా ఒక్క ఎకరం సాగులోకి వచ్చే అవకాశం లేకున్నా భారీ ఎత్తున ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెడుతోంది.

==============================================

కరెంట్‌ బిల్లుల భారం

కాళేశ్వరం పేరుతో వేల కోట్ల కరెంట్‌ బిల్లుల భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. యేడాదికి రూ.5 వేల కరెంట్‌ బిల్లే అవుతుందని ప్రభుత్వం చెప్తున్నా, తక్కువలో తక్కువగా రూ.8 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని ఎక్స్‌పర్ట్‌లు చెప్తున్నారు.

2019 జూలైలో కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి 5.7 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడంతో పాటు అంతకుముందు నిర్వహించిన డ్రై రన్‌, వెట్‌ రన్‌ కలిపి రూ.20 కోట్ల కరెంట్‌ బిల్లు వచ్చింది. ఒక్క కన్నెపల్లి పంపుహౌస్‌ బిల్లే నెలకు రూ.12.64 కోట్లు వచ్చింది.

అడిషనల్‌ టీఎంసీని కలుపుకుంటే యేటా కరెంట్‌ బిల్లు రూ.12 వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా వేశారు. ఇంత భారీ ఖర్చుతో ఎత్తిపోసే నీళ్లతో ఏ పంటలు వేస్తే గిట్టుబాటు అవుతుందో ఎవ్వరికీ అంతుపట్టని పరిస్థితి.

================================================

రాయలసీమకు ‘కృష్ణా’ర్పణం

కృష్ణా నీళ్లలో తెలంగాణకు అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైంది. శ్రీశైలం నీళ్లను పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా పెన్నా బేసిన్‌లోని రాయలసీమకు తరలించుకుపోతున్నారనే పది జిల్లాలు ఒక్కటై కొట్లాడాయి. హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీ పెంపునకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ సైతం గళమెత్తింది. టీఆర్‌ఎస్‌ గెలిచి కేసీఆర్‌ సీఎం అయ్యాక కృష్ణా ప్రాజెక్టులను గాలికొదిలేశారు. పోతిరెడ్డిపాడు కెపాసిటీ 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు ప్రశ్నించిన కేసీఆర్‌.. ఇప్పుడు 80 వేల క్యూసెక్కులకు పెంచుతున్నా కిమ్మనడం లేదు. రాయలసీమ లిఫ్ట్‌ స్కీం ద్వారా ఇంకో 3 టీఎంసీలు ఎత్తిపోసే ప్రాజెక్టు పనులను కేసీఆర్‌ తనకు సన్నిహితుడైన మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఓనర్‌ కృష్ణారెడ్డికి ఇప్పించుకున్నారు. మొత్తంగా శ్రీశైలం నీళ్లను రాయలసీమకు ధారాదత్తం చేసి దానిని రతనాల సీమగా మార్చడానికి కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రకు ప్రగతి భవన్‌లోనే పథక రచన చేశారు.

===============================================

తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మొదలు పెట్టిన దేవాదుల ప్రాజెక్టు పనులు 16 ఏళ్లుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఎప్పటికీ కంప్లీట్‌ అవుతుందనే క్లారిటీ ప్రభుత్వానికే లేదు. నిధుల విడుదలలో జాప్యమే ఇందుకు కారణం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఉదయసముద్రం లిఫ్ట్‌, ఆర్డీఎస్‌ ఏళ్ల తరబడి పెండింగ్‌ ప్రాజెక్టులుగా ఉండిపోయాయి. గట్టు ఎత్తిపోతల పథకం, ఆమ్రాబాద్‌ లిఫ్ట్‌ స్కీం పేరుతో సర్వేలు చేసినా అవి ఎప్పటికి పట్టాలెక్కుతాయో తెలియని పరిస్థితి. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ లిఫ్టు స్కీములకు సంబంధించిన పెండింగ్‌ పనులపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. కాళేశ్వరంతో పాటు మహారాష్ట్రతో అగ్రిమెంట్‌ చేసుకున్న లోయర్‌ పెన్‌గంగా, చనకా – కొరాట బ్యారేజీల నిర్మాణాలు ఆగిపోయాయి. పంపుహౌస్‌లు, రిజర్వాయర్ల పనులపై మొదట్లో హడివిడి చేసిన ప్రభుత్వం తర్వాత వాటిని పూర్తిగా పక్కనపెట్టేసింది. సదర్మాట్‌ బ్యారేజీ, కుంప్టి ప్రాజెక్టు పనులూ పైసలివ్వక ముందుకు సాగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే మొదట పునాది రాయి వేసిన పాలమూరు ఎత్తిపోతల పథకం, ఆ తర్వాతి రోజే ప్రారంభించిన డిండి ఎత్తిపోతల పథకం సైతం పెండింగ్‌ ప్రాజెక్టుల జాబితాలో చేరిపోయాయి. నిధుల కొరతతో ఇవి ఎప్పటికి కంప్లీట్‌ అవుతాయో తెలియడం లేదు.

==========================================

తెలంగాణాను కోటి ఎకరాల మాగాణం చేస్తామన్న ప్రభుత్వం ఆరేండ్లలో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ఎస్సారెస్పీ స్టేజ్‌ -2తో పాటు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాల కింద చెరువులు నింపడం తప్ప చేసిందేమి లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన ప్రాజెక్టుల కింద 41 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగవుతోంది. ప్రభుత్వం రూ.60 వేల కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. 2020 వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో ఒక కోటి 26 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే అందులో ప్రాజెక్టుల కింద సాగు అయ్యింది కేవలం మూడో వంతు మాత్రమే. మిషన్‌ కాకతీయలో భాగంగా పునరుద్ధరించిన చెరువుల కింద 8 లక్షల ఎకరాలను అధనంగా సాగులోకి తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నా, అందులో సగం ఆయకట్టుకు మాత్రమే ప్రాజెక్టుల నీళ్లు అందుతున్నాయి.

==============================================

కల్వకుర్తి లిఫ్ట్‌ స్కీం కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా కేవలం 4 టీఎంసీల కెపాసిటీ గల రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై చూపిన నిర్లక్ష్యమిది అని కేసీఆర్‌ ఎన్నోసార్లు అన్నారు. కల్వకుర్తి నిల్వ కెపాసిటీ పెంచేందుకు వనపర్తి, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 47 చెరువులను బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయాలని 2017లో ప్రతిపాదనలు పంపారు. వీటి నిర్మాణానికి భూసేకరణతో కలిపి రూ.4,177 కోట్లు ఖర్చవుతుందని, 16.11 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు.

––––––––––––––––––––––––––––––––
ప్రాజెక్టులు పెరిగాయి ఇలా.. (రూ.కోట్లల్లో)

––––––––––––––––––––––––––––––––––––––––
ప్రాజెక్టు                              మొదటి అంచనా           పెంచిన అంచనాలు

––––––––––––––––––––––––––––––––––––––––

కాళేశ్వరం                              38,500                           1,14,609

పాలమూరు – రంగారెడ్డి              35,200                          52,056

దేవాదుల                              8,560                             13,445

ఎస్సారెస్పీ పునరుజ్జీవం             1,067                            1,999

దుమ్ముగూడెం (సీతారామ)    1,681                                 13,058

వరద కాలువ                         1,331                             9,886

ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌                2,813                              3,152

డిండి రిజర్వాయర్‌                 349                                 1,147

కోయిల్‌సాగర్‌                        359                                  720

––––––––––––––––––––––––––––––––––––––––

                                                              89,860                                            2,08,925
––––––––––––––––––––––––––––––––––––––––

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc