నేడే రాష్ట్ర బడ్జెట్.. అసెంబ్లీలో హరీష్.. కౌన్సిల్లో ప్రశాంత్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ఈరోజే 2023-24 బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దాదాపు రూ.3 లక్షల కోట్లకు చేరువలో బడ్జెట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం సమావేశమైన రాష్ట్ర కేబినేట్ ఈ బడ్టెట్‌ను ఆమోదించింది. సోమవారం ఉదయం 10.30కు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. అదేసమయంలో కౌన్సిల్ లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్‌పై చర్చ 8వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ఏడాది కావటంతో రాష్ట్ర బడ్జెట్ ఏయే రంగాలకు ప్రాధాన్యమిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. రైతు బంధు, దళిత బంధు, గిరిజన బంధుతో పాటు ఖాళీ జాగాల్లో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయానికి ఈ పద్దులో నిధులు కేటాయించే అవకాశముంది. గత ఏడాది రూ.2,56,958.51 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
నేటి నుంచే రేవంత్ యాత్ర
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ యాత్ర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మేడారంలోని గట్టమ్మ, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం ఆయన యాత్రను ప్రారంభిస్తారు. మేడారంలో సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటారు. పస్రాలో కార్నర్ మీటింగ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తొలిరోజు యాత్ర సుమారు 15-20 కిలోమీటర్లు పూర్తి చేసుకుని, రామప్ప గ్రామం వరకుకొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ్యనేతలు పాద యాత్రలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే వెల్లడించారు. ఈ పాదయాత్రల ద్వారా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపై చార్జ్‌షీట్లను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.
ఈనెలలోనే అసెంబ్లీ రద్దవుతుంది: ఉత్తమ్
ఫిబ్రవరి చివరికల్లా రాష్ట్రంలో అసెంబ్లీ రద్దవుతుందని.. రాష్ట్రపతి పాలన వస్తుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్లు చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం హాత్ సే హాత్ జోడో అభియాన్ సన్నాహక సమావేశం లో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనలో తాము ముందస్తు ఎన్నికలు జరపాలని కేంద్రాన్ని కోరుతామన్నారు. కోదాడలో కాంగ్రెస్ పార్టీ 50 వేల మెజారిటీతో గెలవకుంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు.
చైనా యాప్‌లపై నిషేధం
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులతో చైనాతో లింకులున్న 138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లను కేంద్రం నిషేధించింది. ఇటీవలే కేంద్ర ఐటీ శాఖకు హోంశాఖ వ్యవహారాల శాఖ ఈ ఆదేశాలను అందించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం.. ఈ యాప్‌లు దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయని కేంద్రం ఈ చర్యలకు సిద్ధపడింది. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకొని కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం వెలుగులోకి వచ్చింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఈ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరడంతో రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ ఈ నిషేధం విధించింది.
నాందేడ్ సభ గ్రాండ్ సక్సెస్
ప్రజలు తమకు కేంద్రంలో అధికారం ఇస్తే.. ఆరు నెలల్లోనే నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. 33 సీట్లు పెంచి ఏడాదిలోగా వాటిని మహిళలకు కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. శాసనసభ, శాసనమండలితో పాటు పార్లమెంట్‌లోనూ మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ ఏర్పడిన తర్వాత మహారాష్ట్రలోని నాందేడ్‌లో నిర్వహించిన మొట్ట మొదటి బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అతి పెద్ద స్కామ్‌లో చిక్కుకున్న అదానీ గ్రూపు వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీలో చర్చించాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. అవసరమైతే శ్రీరాంసాగర్ నుంచి మహారాష్ట్ర నీళ్లు లిఫ్ట్ చేసుకోవాలని.. హృదయ పూర్వకంగా నీళ్లు ఇవ్వడానికి తాము సిద్ధమేనని కేసీఆర్ హామీ ఇచ్చారు.
పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ముషారప్ దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం ఆయన వయసు 79 సంవత్సరాలు. ఢిల్లీలో జన్మించిన ముషారఫ్.. దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. ఆ తరువాత పాక్ సైన్యంలో చేరారు. 1990లో పాక్ అర్మీ జనరల్ అయ్యారు. అంచెలంచెలుగా పాక్ ప్రెసిడెంట్ అయ్యారు. 2001 నుంచి 2008వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కార్గిల్ యుద్ధానికి ముషారఫ్ ప్రధాన కారకుడు. 2016 నుంచి ముషారఫ్ దుబాయిలోనే ఉంటున్నాడు.