నేడు మళ్లీ కవిత విచారణ
![](https://udayum.com/wp-content/uploads/2023/03/kavitha8-Copy-1024x897.jpg)
సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ దాదాపు 10 గంటల పాటు సాగింది. ఓ దశలో కవిత అరెస్ట్ ఖాయన్న ప్రచారం రోజుగా సాగింది. వైద్య బృందం లోపలికి వెళ్లడంతో కవితకు పరీక్షలు నిర్వహించి అరెస్టు చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్రం ఆందోళన వ్యక్తమైంది. కానీ.. రాత్రి 9 గంటల సమయంలో కవిత బయటకు రావడంతో ఆ ఉహాగానాలకు తెరపడ్డాయి. అయితే.. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు మళ్లీ రావాలని కవితకు ఈడీ తెలిపింది. నేడు ఏం జరగనుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బీజేపీవి బరితెగింపు దాడులు: కేసీఆర్
![](https://udayum.com/wp-content/uploads/2023/03/335325733_543194537800256_7135938594231024495_n-1024x664.jpg)
దేశం కోసం బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ సర్కార్ బరితెగింపు దాడులు చేస్తూ.. తెలంగాణ ప్రగతిని అడుగడునా అడ్డుకుంటుందోనని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. కొన్ని పార్టీలు చేస్తోన్న దుష్ప్రచారాన్ని అప్రమత్తతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నిన్న పార్టీ శ్రేణులకు కేసీఆర్ సందేశం విడుదల చేశారు. లక్షల కుట్రలను చేధించి.. నిలిచిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలివిలేదని ధ్వజమెత్తారు. అందుకే బీఆర్ఎస్ ప్రస్థానాన్నిప్రారంభించామన్నారు. రాష్ట్రంలో మరోసారి తమ పార్టీ విజయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రం అప్పులు రూ.155.8 కోట్లు
![](https://udayum.com/wp-content/uploads/2023/03/329032277_760530535695855_7523552327589035038_n-1024x574.jpg)
కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 మార్చి నాటికి రూ.155.8 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇది జీడీపీలో 57.3%కి సమానమని వెల్లడించారు. ఇందులో విదేశీ అప్పు తాజా మారకద్రవ్య విలువ ప్రకారం రూ.7.03 లక్షల కోట్లని (జీడీపీలో 2.6%) తెలిపారు. లోక్‌సభలో సోమవారం బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆమె ఈమేరకు సమాధానమిచ్చారు. మొత్తం రుణాల్లో విదేశీ అప్పు కేవలం 4.5% మాత్రమేనన్నారు.
రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు
![](https://udayum.com/wp-content/uploads/2023/03/337051711_530491169229999_1991479392674611684_n.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ నెల 23న విచారణకు రావాలని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ పీఏ తిరుపతి సొంత మండలం అయిన మల్యాల నుంచి పరీక్షలు రాసిన 100 మందికి 103కు పైగా మార్కులు వచ్చాయని ఇటీవల రేవంత్ ఆరోపించారు. ఇంకా పేపర్ కేసులో నిందితుడు రాజశేఖర్ రెడ్డి కేటీఆర్ పీఏకి సన్నిహితుడన్నారు. ఈ కారణంగానే ఆయనకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఆరోపించిన ఆ 100 మంది అభ్యర్థుల వివరాలను ఇవ్వాలని సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి నోటీసులు అందించింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. రేవంత్ తో పాటు ఇంకా అనేక మంది నేతలకు నోటీసులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వేధించేందుకే నోటీసులు: రేవంత్
పేపర్ లీకేజీ కుట్ర వెనుక ఉన్న వారి వివరాలను వెల్లడించినందుకు తనను వేధించాలన్న కట్రతో సిట్ నోటీసులను అందించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిందితులను విచారించకముందే కేవలం ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి మాత్రమే ఈ కేసులో నిందితులని మంత్రులు కేటీఆర్, సబితారెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.
రేణుక, ఆమె భర్త ఢాక్యా సస్పెన్షన్:
![](https://udayum.com/wp-content/uploads/2023/03/runuka-tspsc-paper-leak.jpg)
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితులనైన హిందీ టీచర్ రేణుక, ఆమె భర్త ఢాక్యాను అధికారులు సస్పెండ్ చేశారు. రేణుక వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్ధారం ఎస్సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పని చేస్తున్నారు. ఆమె భర్త వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ ఆఫీస్ లో ఉపాధి హామీ సాంకేతిక సహాయకుడిగా పని చేస్తున్నారు.
గవర్నర్ కు నోటీసులు ఇవ్వలేం: సుప్రీం
![](https://udayum.com/wp-content/uploads/2023/01/1669034457_supreme-court.jpg)
తెలంగాణ అసెంబ్లీ తీర్మానించిన పది బిల్లులపై ఇంతవరకు సంతకాలు చేయని విషయమై గవర్నర్‌కు నోటీసులు ఇవ్వడానికి సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనది కావడంతో ఎలాంటి నోటీసు ఇవ్వడం లేదని తెలిపింది. సొలిసిటర్ జనరల్ (ఎస్‌జీ) వినతి మేరకు కేంద్ర ప్రభుత్వానికి లాంఛనంగా ఎలాంటి నోటీసులు పంపనప్పటికీ ఈ సమస్యపై సమాధానం చెప్పాలని మాత్రం ఆదేశించింది. బిల్లులపై గవర్నర్ సంతకం చేయని విషయమై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ పి.ఎ్‌స.నరసింహ, జస్టిస్ జె.బి.పార్డీవాలాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
టీఎస్పీఎస్సీకి హైకోర్టు కీలక ఆదేశాలు
![](https://udayum.com/wp-content/uploads/2022/12/tspsc-group1-1659686324.jpg)
జూనియర్ లెక్చరర్ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. పేపర్–2 ప్రశ్నాపత్రాన్ని తెలుగులోనే ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. మొత్తం రెండు పేపర్లతో 300 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. అయితే, పేపర్–1 జనరల్ స్టడీస్‌ను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూలో ఇవ్వనున్నట్లు తెలిపిన టీఎస్పీఎస్సీ.. పేపర్–2 అయిన సంబంధిత సబ్జెక్ట్ ప్రశ్నాపత్రం మాత్రం కేవలం ఇంగ్లిష్‌లోనే ఇవ్వనున్నట్లు తెలిపింది. దీంతో పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పేపర్–2 కూడా తెలుగులో ఇచ్చేలా ఆదేశించాలని అభ్యర్థించారు. కేసు విచారణ జరిపిన హైకోర్టు పేపర్–2ను తెలుగులోనే ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1392 పోస్టులను భర్తీ చేయనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్.
2.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం
![](https://udayum.com/wp-content/uploads/2023/03/hol-vari-copy-1024x589.jpg)
రాష్ట్రంలో మూడు రోజుల పాట కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులకు దాదాపు 2.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 96 మంది రైతులు నష్టపోయారని అధికారులు భావిస్తున్నారు. ఎక్కువగా మొక్కజొన్నకు నష్టం జరిగిందని.. తర్వాత వరి, మిర్చి, వేరుశెనగ, పత్తి పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఇంకా మామిడి, టమాట, బెండ, ఉల్లి, బొప్పాయి, వంకాయ రైతులు నష్టపోయారని తెలిపింది.
భగ్గుమన్న బంగారం.. భారీగా పెరిగిన ధర
![](https://udayum.com/wp-content/uploads/2023/03/72177817.jpg)
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా, స్విట్జర్లాండ్‌లలో బ్యాంకులు దివాలా తీయడం, అమెరికాలో వడ్డీరేట్లు ఇంకా పెంచుతారనే సంకేతాల నడుమ స్టాక్‌మార్కెట్లు నష్టపోతున్నాయి. సోమవారం అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 2005 డాలర్లకు చేరింది. డాలర్ విలువ రూ.82.56కు చేరడంతో, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఉదయం ఒక దశలో రూ.62,000ను తాకింది. సాయంత్రానికి అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,978 డాలర్లకు దిగిరావడంతో, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.61,300గా ఉంది. శనివారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.61,600గా ఉంది. వెండి కిలో ధర రూ.70,500.