నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్
నేటి నుంచి రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పరీక్షను పకడ్భందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4.94 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనుండగా.. 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించనున్నారు. 9.35 గంటల తర్వాత విద్యార్థులను లోనికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
8న హైదరాబాద్ కు ప్రధాని మోదీ..
ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు వస్తున్నారని, ఆయన కొన్ని మౌలికవసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని కేంద్ర టూరిజం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం తెలిపారు. మోడీ తన పర్యటన సందర్భంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలుకు జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు. హైదరాబాద్ లో మొత్తం రూ.11,355 కోట్ల పనులను ప్రధాని ప్రారంభిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు.
’తెలంగాణలో సర్వేలన్నీ బీజేపీకే అనుకూలం‘
తెలంగాణలో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. కమల దళాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు ఏకమవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పొత్తుపై హస్తం పార్టీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో సంజయ్ మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే బిల్ట్, నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని చెప్పారు. సీఎం కేసీఆర్ గిరిజన ద్రోహి అని సంజయ్ విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్‌తో ముడిపెడుతూ గిరిజన రిజర్వేషన్లపై జాప్యం చేస్తున్నారని.. దమ్ముంటే ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్లు పెంచాలని సవాల్ చేశారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా గెలవకుండా కేసీఆర్ రూ.కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు.
పది లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?
దేశంలో నిరుద్యోగ రేటు 7.8 శాతంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైంది? మోసపూరిత హామీతో యువతను కూడా దగా చేస్తిరి కదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పది లక్షల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారు? అని ప్రశ్నించారు. అసలు వాటిని భర్తీ చేసే ఉద్దేశం కనిపించడం లేదని ధ్వజమెత్తారు.
గజ్వేల్ లో లక్ష మందితో నిరుద్యోగ దీక్ష
టీఎస్పీఎస్సీ పేపర్ లేకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేటీఆర్ ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని, టీఎస్పీఎస్సీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో ఈ నెల 20 నుంచి 25 వరకు గజ్వేల్ లో లక్ష మందితో నిరుద్యోగ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.
6 నెలల్లో 80 వేల ఉద్యోగాలు: హరీశ్ రావు
నిరుద్యోగులు ప్రతిపక్షాల వలలో పడి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని, మంచిగా చదువుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. మొత్తం 80 వేల ఉద్యోగాలను ఆరు నెలల్లో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త ఉద్యోగాల కోసం బడ్జెట్ లో రూ.వేయి కోట్లు కేటాయించామన్నారు. ఆరునూరైనా 80వేల ఉద్యోగాలు నింపడం ఖాయమన్నారు. నిరుద్యోగులు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని సూచించారు. దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే బీజేపీ ఏం చేస్తుందో చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు.
మరో 4 రోజులు వర్షాలు
రాష్ట్రానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. నాలుగు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. హైదరాబాద్‌లో పొద్దంతా పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, రాత్రిపూట వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గొచ్చని చెప్పింది.
అధికారికంగా దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి
దొడ్డి కొమురయ్య జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సంవత్సరం దొడ్డి కొమురయ్య జయంతి ఏప్రిల్ 3న, వర్ధంతి జులై 4న ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికయ్యే ఖర్చును బిసి సంక్షేమ శాఖ బడ్జెట్ నుండి ఖర్చు చేయనుంది ప్రభుత్వం.