రాహుల్ పై మోదీ వ్యంగ్యాస్త్రాలు.. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ షాక్.. ఎంసెట్ రాసేవారికి గుడ్ న్యూస్.. పోలీస్ ఈవెంట్స్ లో అనర్హత సాధించిన వారికి మరో ఛాన్స్.. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

మా హయాంలో దేశం అభివృద్ధి: ప్రధాని మోదీ


దేశ ప్రగతిని చూసి బాధపడే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, అది కొందరిని బాధిస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం లోక్‌సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇప్పుడు అందరూ జమ్ము కశ్మీర్‌కు వెళ్లివస్తున్నారని రాహుల్ గాంధీని ఉద్ధేశించి వాఖ్యానించారు. కానీ, గతంలో లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఎగురవేయడం ఓ కలగా ఉండేదన్నారు. దమ్ముంటే లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని తీవ్రవాదులు పోస్టర్లు వేసేవారని.. తమ ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేశామని పేర్కొన్నారు. ఇప్పుడు లాల్‌చౌక్‌లో స్వేచ్ఛగా జెండా ఎగురవేయగలుగుతున్నామని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ రావు ఫైర్

ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ బీజేపీ నేతలు ‘కవి’లు అయ్యారని సెటైర్లు వేశారు. క అంటే కనబడదని., వి అంటే వినబడదన్నారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని చూసి నీతి ఆయోగ్ ప్రశంసిస్తున్నా.. ప్రతిపక్ష నేతలకు కనబడటం లేదని.., వినబడటం లేదని మండిపడ్డారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని అప్పుడే తాము చేస్తున్న అభివృద్ధి కనిపిస్తుందని వంగ్యాస్త్రాలు విసిరారు.

కవిత మాజీ ఆడిటర్ అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబు. మూడు రోజుల క్రితం బుచ్చిబాబును ఢిల్లీకి పిలిపించిన సీబీఐ.. ఆయనను మంగళవారం రాత్రి అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతంలో కూడా సీబీఐ, ఈడీ బుచ్చిబాబును పలుమార్లు ప్రశ్నించాయి. బుధవారం బుచ్చిబాబును సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు శనివారం వరకు కస్టడీ విధించింది.

రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

ప్రగతి భవన్‌ను నక్సలైట్లు గ్రనైట్లు పెట్టి పేల్చివేసినా తమకు అభ్యంతరం లేదంటూ మంగళవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎల్‌. రమణ, శంబీపూర్‌ రాజు, తక్కెళ్లపల్లి రవీందర్‌, తాతా మధు, దండె విఠల్‌లు బుధవారం హైదరాబాద్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీఎం పరిపాలన కార్యాలయం, ప్రగతిభవన్‌ను డైనమెట్లు పెట్టి పేల్చివేయాలని మాట్లాడడం అప్రజాస్వామికమన్నారు.

పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

ఇటీవల నిర్వహించిన పోలీస్ నియామక ఈవెంట్స్ లో ఒక సెం.మీ లేదా అంతకన్నా తక్కువ ఎత్తు తేడాతో అర్హత కోల్పోయిన వారికి నియామక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. హైకోర్టు ఆదేశాల మేరకు వారికి మళ్లీ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆ అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12 వరకు అధికారిక వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలని సూచించింది.

ఎంసెట్ సిలబస్ తగ్గింపు

తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ కు సంబంధించి సిలబస్ పై ఉన్నత విద్యామండలి క్లారిటీ ఇచ్చింది. ఎంసెట్ ఎగ్జామ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ లో 70 శాతం, సెకండియర్ లో 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మే 7 నుంచి ఎంసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

10 వేల పాఠశాల్లో గ్రంథాలయాలు

రాష్ట్రంలోని 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల నుంచి లైబ్రరీ సెస్సు బకాయిల వసూలుపై దృష్టి సారిస్తామన్నారు.

ఆరుగురికి డీఐజీలుగా పదోన్నతి


రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీలుగా రాష్ట్రప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 2009 బ్యాచ్‌కు చెందిన అంబర్‌ కిశోర్‌ ఝా, రెమా రాజేశ్వరి, ఎల్‌.ఎస్‌ చౌహాన్‌, కె.నారాయణ్‌ నాయక్‌, పరిమళా హనా నూతన్‌ జాకోబ్‌, ఎస్‌. రంగారెడ్డిలకు డీఐజీలుగా పదోన్నతి కల్పించింది. కాగా, అంబర్‌ కిశోర్‌ ఝా ప్రస్తుతం డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులో కొనసాగుతున్నారు.

రైల్ నిలయంలో అగ్ని ప్రమాదం:

సికింద్రాబాద్ లోని రైల్ నిలయం పాత్వ క్వార్టర్స్ లో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్వార్టర్స్ లో ఉన్న చెత్తకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. క్వార్టర్స్ నుంచి ఒక్కసారిగా భారీగా మంటలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ-వెహికిల్స్‌ హబ్‌గా రాష్ట్రం

ఈ-వెహికిల్స్‌ హబ్‌గా రాష్ట్రం మారనుందని, విద్యుత్తు వాహనాల (ఈవీ) తయారీ, పరిశోధలు, వినియోగంలో దేశంలోనే తెలంగాణ కీలక భూమిక పోషించనుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆధునాతన సాంకేతికల అభివృద్ధి, వాడకంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో బుధవారం ఎలక్ర్టిక్‌ వాహనాల ‘ఈవీ ఎక్స్‌పో’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈవీల ప్రోత్సాహానికితెలంగాణ కట్టుబడి ఉందని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీలు, ఎమర్జింగ్‌ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ గమ్యస్థానంగా ఉందని తెలిపారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here