మోదీ కన్నా మన్మోహన్ మంచోడు: కేసీఆర్
దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పనిచేశారని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ మన్మోహన్ ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదన్నారు. ఆదివారం అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడారు. అదానీ సంస్థలకు చెందిన రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైందని, ఇందులో చాలా బ్యాంకులు, ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టాయని అన్నారు. అదానీ గ్రూప్ విషయం గురించి కనీసం ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై మండి పడ్డారు. మొత్తం 192 దేశాల్లో మన దేశ ఆర్థిక వ్యవస్థ ర్యాంకు 139గా ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్‌ల కంటే మన ఆర్థిక వ్యవస్థ ర్యాంకునే తక్కువగా ఉందన్నారు. ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరగకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈటల పేరును 13 సార్లు పలికిన కేసీఆర్
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తన ప్రసంగం సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును మొత్తం 13 సార్లు ప్రస్తావించారు. ఓ సందర్భంలో ‘మిత్రులు రాజేందర్ మాట్లడుతూ అనేక అంశాలను లేవనెత్తారు’ అంటూ.. వ్యాఖ్యానించారు. హాస్టల్‌లో చదివే పిల్లలకు సన్న బియ్యం అందించాలనే ఆలోచన తన మాజీ సహచరుడు ఈటలదేనని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని ఈటల కోరగా.. వెంటనే ఛార్జీలు పెంచుతూ జీవో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కావాలంటే ఈటలకు ఫోన్ చేయండి.. డైట్ ఛార్జీల పెంపు విషయంలో ఆయన సలహాలు కూడా తీసుకోండి’ అని మంత్రులకు సీఎం సూచించారు.
1500 పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్
తెలంగాణ జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ వర్కర్ పోస్టులకు ఈ నెలలో (ఫిబ్రవరి) నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. బస్తీ దవాఖానాల్లో మార్చి నుంచి 134 పరీక్షలు చేస్తామన్నారు. ఇంకా ఏప్రిల్ 33 నుంచే 33 జిల్లాలకూ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
దేశంలోని పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ఏపీకి గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ స్థానంలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ను నియమించింది. ఇక బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ ఘడ్ గవర్నర్ గా నియమించారు. మేఘాలయ గవర్నర్ గా చౌహన్, మహారాష్ట్ర గవర్నర్ గా రమేష్ బైస్, నాగాలాండ్ గవర్నర్ గా గణేషన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రసాద్ శుక్లా, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా త్రివిక్రమ్ పట్నాయక్, మణిపూర్ గవర్నర్ గా అనసూయ, బీహార్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్, సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్, అస్సాం గవర్నర్ గా గులాబీ చంద్ కటారియా, జార్ఖండ్ గవర్నర్ గా రాధాకృష్ణన్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా మిశ్రాను కేంద్రం నియమించింది.
కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే: బండి సంజయ్
అసెంబ్లీ వేదికగా కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆధారాలతో సహా నిరూపించేందుకు తాము సిద్ధమని.. ముఖ్యమంత్రి రాజీనామాకు సిద్ధమా..? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో రెండు గంటలు మాట్లాడిన కేసీఆర్.. బడ్జెట్ గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదన్నారు. బడ్జెట్‌లో ఏమీ లేదని, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే మోదీపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో మాట్లాడారు. సభలో లేని వ్యక్తి గురించి కేసీఆర్ మాట్లాడుతుంటే స్పీకర్ నిలువరించకపోవడం శోచనీయమన్నారు.
ఇది బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ: షర్మిల
ఇది బీర్ల తెలంగాణ, బార్ల తెలంగాణ అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కేసీఆర్ పెద్ద మోసగాడని, ఆయనకు ఓట్ల తోనే పని అని, ఆయన బోడ మల్లన్న లెక్కఅంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అర చేతిలో బంగారు తెలంగాణను చూపించారన్న ఆమె… బంగారు తెలంగాణ అయ్యిందా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో 16 లక్షల మంది రైతులు డీ ఫాల్టర్లుగా మిగిలారన్నారు. వ్యవసాయానికి సబ్సిడీ పథకాలు బంద్ పెట్టారని, పంట నష్టపోతే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.
కేసీఆర్ నమ్మకాన్న వమ్ము చేయను: బండా ప్రకాశ్
కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని నూతనంగా నియమితులై.. బాధ్యతలు స్వీకరించిన శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. బలహీనవర్గాల బిడ్డను శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ చేసినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను ప్రజాస్వామ్యయుతంగా నిర్వర్తిస్తానన్నారు. ఛైర్మన్ సలహాలు, సూచనల మేరకు సభను నిర్వర్తిస్తానని, తెలంగాణ బిడ్డ రాజ్యసభ సభ్యుడు అయితే ఏమీ చేయగలడో మూడున్నరేళ్లలో చేసి నిరూపించానని చెప్పారు.
ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల తేదీలు:
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ డేట్స్ ప్రకటించింది. ఈ నెల 15నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు జనరల్, ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.