జోకులు వద్దు కేసీఆర్:

కేసీఆర్ ప్రభుత్వం పై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ ఫైర్ అయ్యారు. 2014లో తెలంగాణకు 60వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు 3 లక్షల కోట్లు ఎలా అయ్యిందని ఆమె ప్రశ్నించారు. 2014 నుండి ఇప్పటివరకు కేంద్రం నుండి తెలంగాణ ప్రభుత్వానికి లక్షా 39వేల కోట్లు గ్రాంట్ రూపంలో వచ్చాయన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని నొవోటెల్‌లో కేంద్ర బడ్జెట్ పై దూరదర్శన్ ఏర్పాటు చేసిన.. కాక్లేవ్లో ఆమె పాల్గొన్నారు. తెలంగాణలో మెడికల్ కాలేజీల కోసం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదన్నారు. మెడికల్ కాలేజీలున్న ఖమ్మం, కరీంనగర్ పేర్లనే కేంద్రానికి పంపడంతోనే తిరస్కరించామని చెప్పారు. తెలంగాణలో ఏ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా కేసీఆర్‌కి తెలియదని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం బాగుందన్న భగవంత్ మాన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు నాలెడ్జ్ షేరింగ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ ను, కొండపోచమ్మ పంప్ హౌస్ ను, ఎర్రవల్లిలోని చెక్ డాంను చివరిగా గజ్వేల్ పట్నంలోని పాండవుల చెరువును సందర్శించారు. 500 మీటర్ల పైకి గోదావరి నీటిని కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకువచ్చి మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం ఆదర్శనీయమని ఆయన అన్నారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంతో పాటు నీటిపారుదల, పారిశ్రామిక, వైద్య, ఆరోగ్యం తదితర అన్ని రంగాలలో అద్భుతమైన అభివృద్ధి చెందిందన్నారు.
కేసీఆర్ కు కొత్త అర్థం చెప్పిన హరీశ్ రావు

సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ‘కేసీఆర్’ పదానికి మంత్రి హరీశ్ రావు కొత్త నిర్వచనం చెప్పారు. కే అంటే కారణజన్ముడు, సీ – అంటే చిరస్మరణీయుడు, ఆర్ అంటే ఎంతో మంది రాతను మార్చిన మహనీయుడంటూ కొనియాడారు. ఇదిలా ఉంటే కేసీఆర్ జన్మదిన వేడులను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి.
అంధుల లిపిలో కేసీఆర్ జీవిత చరిత్ర:

రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో అంధుల ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపిలో ముద్రించిన కేసీఆర్ జీవిత చరిత్రను ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. పుస్తక ఆవిష్కరణకు విచ్చేసిన అంధులతో ఆ పుస్తకాన్ని చదివించుకుని ఆ పుస్తకంలోని విశేషాలను వాసుదేవరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
నిర్మలపై కవిత ఫైర్

ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారాన్ని మోపి రూ. 100 లక్షల కోట్ల మేర అప్పులు చేసిన మోడీ ప్రభుత్వం తెలంగాణ రుణాలపై మాట్లాడడం ఏంటని వీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిలదీశారు. తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. కవిత మాట్లాడుతూ..2014 నాటికి రూ.55 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు దాదాపు రూ. 155 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం దాదాపు 100 లక్షల కోట్ల అప్పు చేసిందని స్పష్టం చేశారు. కాబట్టి అప్పుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన దానికి కేంద్ర ప్రభుత్వం చేసిన పొంతనేలేదని అన్నారు.
కేంద్రంపై కేటీఆర్ ఫైర్

డాటా ఎంబసీలను కేవలం గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో మాత్రమే ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మంత్రి కే తారక రామారావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి అత్యంత కీలకమైన ఈ విషయంలో మొత్తం డేటా ఎంబసీలని కేవలం ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేక సమస్యలకు దారితీస్తుందని మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం డేటా ఎంబసీలను ఏర్పాటు చేయాలన్నకుంటున్న గుజరాత్ గిఫ్ట్ సిటీ, భూకంపాలు వచ్చేందుకు అవకాశం ఉన్న భౌగోళిక ప్రాంతమని, దీంతో పాటు దేశ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రంలో డేటా ఎంబసీలను ఏర్పాటు చేయడం అత్యంత రిస్క్ తో కూడుకున్నదని తెలిపారు. ఇదే లేఖలో హైదరాబాద్ నగరానికి భౌగోళికంగా ప్రకృతి వైపరీత్యాలు నుంచి సహజంగా వస్తున్న రక్షణ, అనుకూలతలను కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కి వివరించి, డేటా ఎంబసీ సెంటర్లను తెలంగాణలో ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ధరణిని రద్దు చేస్తాం:

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వర్ధన్నపేట పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తప్ప… కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడా లేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి రూ.5లక్షలు మంజూరు చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి రూ. 5 లక్షల వరకు ఇస్తామన్నారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుదని చెప్పారు. ఇక కాంగ్రెస్ కార్యకర్త లపై దాడులు చేస్తే సహించేది లేదని రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వడ్డీతో సహా రుణం తీర్చుకుంటామని చెప్పారు.
ముగిసిన గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ

తెలంగాణలో గత నెల 18వ తేదీన ప్రారంభమైన గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గడువు ముగిసే సమయం వరకు మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మొత్తం 783 గ్రూప్-2 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందుకు సంబంధించిన పరీక్షల తేదీలను త్వరలో ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది.
కేసీఆర్‌ను గద్దె దించడం ఒక్క బీజేపీతోనే సాధ్యం

కేసీఆర్‌ను గద్దె దించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కుంభకోణాలతో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మహిళ అయిన ఎమ్మెల్సీ కవిత పేరు మద్యం కుంభకోణంలో వినిపించడం తెలంగాణ సమాజం సిగ్గుపడే విషయమన్నారు. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గురువారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూఫ్‌ఖాన్‌పేట్‌లో శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ నిర్వహించారు. బీజేపీ-బీఆర్‌ఎస్ లు ఒక్కటి కావడం జరగదన్నారు.