తెలంగాణకు భారీగా పెట్టుబడులు
తెలంగాణలో గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ శివారు జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తమ కార్యకలాపాలు విస్తరించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం గ్లాండ్ ఫార్మా సీఈవో శ్రీనివాస్ కార్యకలాపాలపై ప్రకటన చేశారు. సంస్థ విస్తరణతో 500 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్లు పేర్కొన్నారు. గ్లాండ్ ఫార్మా సంస్థ ప్రకటన పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. బయోలాజికల్స్, బాయోసిమిలర్, యాంటీబాడీస్, రీకాంబినెంట్ ఇన్సులిన్ తదితర అడ్వాన్స్డ్ రంగాలపై సంస్థ దృష్టి సారించడం సంతోషకరమని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో మరో 1400 జాబ్స్
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో త్వరలో మరో 1400 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్లేట్ల బురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్ ను చంపుతానని పాకిస్థాన్ నుంచి ఫోన్
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోమారు పాకిస్థాన్ నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. తనను చంపుతానని ఓ ఆగంతుకుడు ఫోన్ చేసి బెదిరించినట్లు ఆయన సోమవారం ట్విటర్ ద్వారా తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఓ ఆగంతుకుడు ఫోన్ చేశాడని, తనతో పాటు తన కుటుంబ వివరాలు పూర్తిగా వారికి తెలుసునని, తనను చంపుతానని బెదిరించాడని రాజాసింగ్ వెల్లడించారు. ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి కాల్స్ వచ్చాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర డీజీపీ, సిటీ సీపీని ట్యాగ్ చేస్తూ తనను బెదిరించిన వ్యక్తి ఫొటోను కూడా రాజాసింగ్ ట్వీట్ చేశారు.
మరో ఏడాదిలో కాంగ్రెస్ సర్కార్
ఓరుగల్లు నీవురుగప్పిన నిప్పులా ఉందని, రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏనుమాముల మార్కెట్ దళారుల పాలైందని రైతులు తమ గోడు వినిపించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వరంగల్ నగరంలోని ఎమ్మెల్యేలు భూకబ్జాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా భూకబ్జాలే కనిపిస్తున్నాయన్నారు. కబ్జాల కారణంగా నాళాలు కుంచించుకుపోయి.. చెరువులు కనుమరుగై భారీ వరదలకు వరంగల్ నగరం మునిగిపోయిందన్నారు. మరో ఏడాదిలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నిన్న వరంగల్ లో రేవంత్ పాదయాత్ర నిర్వహించారు.
ఖదీర్ ఖాన్ మృతి కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఖదీర్‌ఖాన్(37) మృతిపై హైకోర్టు స్పందించింది. పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్న ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డిజిపి, మెదక్ ఎస్‌పి, డిఎస్‌పి, ఎస్‌హెచ్‌ఒను ప్రతివాదులుగా చేర్చింది న్యాయస్థానం. పోలీసులు దెబ్బలకు తట్టుకోలేకనే మెదక్‌కు చెందిన ఖదీర్ ఖాన్ మృతి చెందినట్లు మీడియాలో వార్తలు రావడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
నేటి నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ గీత రెడ్డి తెలిపారు. ఈ నెల 21 పాల్గుణ శుద్ధ పాడ్యమిన స్వస్తివాచనం, అంకురారోపణం, విష్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మార్చి 3 వరకు అత్యంత వైభవోపేతంగా సాగే వేడుకల్లో 27న ఎదుర్కోలు, 28న స్వామివారి తిరుకల్యాణోత్సవం, మార్చి ఒకటిన దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు. నాలుగు రోజులపాటు అలంకార సేవలు చేపట్టనున్నారు. కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
మోటార్లకు మీటర్లు పెడతామన్నది కేసీఆరే..
మోటార్లకు మీటర్లు పెడతామన్నది కేసీఆరే అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. రుణం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీపై ఇంతవరకు డీఎఫ్ఆర్ ఇవ్వని మాట నిజం కాదా? అని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ తప్పేనన్నారు. నిరూపించేందుకు నేను సిద్ధం…. బహిరంగ చర్చకు సిద్ధమా? అని అన్నారు. దమ్ముంటే డేట్, టైం, వేదిక ఫిక్స్ చేసి తన సవాల్ ను స్వీకరించాలన్నారు. బీజేపీ కార్యకర్తలను వేధిస్తే ఖబడ్దార్ అంటూ పోలీసులను హెచ్చరించారు.
టీఎస్ఆర్టీసీ నుంచి ఏసీ స్లీపర్ బస్సులు
మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది.
ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల్లో ఆందోళన
అనారోగ్యంతో ఆదివారం రోజు మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు ముగిశాయి. సాయన్న అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించి.. అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై ఆయన అభిమానులు ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే అభిమానులు కేసీఆర్ డౌన్ డౌన్, బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
దళిత ఎమ్మెల్యే కాబట్టే ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయడం లేదని మండిపడ్డారు. దీంతో మంత్రి పద్మారావు గౌడ్ వారితో మాట్లాడారు. అభిమానుల నిరసనలతో అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మల్లారెడ్డిలు వెళ్లిపోయారు. తర్వాత పద్మారావు గౌడ్ ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చజెప్పినట్లు సమాచారం.
హాల్ టికెట్లు విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
తెలంగాణలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (DAO) పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 6 వరకు కొనసాగింది. ఈ రాతపరీక్షను ఈ నెల 26న నిర్వహించనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం ఈ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేశారు అధికారులు. టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/) నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ తదితర వివరాలు నమోదుచేసి హాల్ టికెట్ ను టీఎస్సీఎస్సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.