కొండగట్టు ఆలయంలో చోరీ:
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలోకి చొరబడ్డ నిందితులు స్వామి వారి వెండి వస్తువులు అపహరించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశం అయింది. సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించి వెళ్లిన తొమ్మిది రోజులకే చోరీ జరగడంతో పోలీస్ యంత్రాంగం ఈ ఘటనను సవాల్ గా తీసుకుంది. కొండగట్టు ఆలయచోరీ లో సిసి పుటేజ్ లోని ఫొటోలను జిల్లా పోలీసులు విడుదల చేశారు. దొంగలను పట్టుకోవడానికి 10 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.
ప్రీతి కేసులో సంచలన నిజాలు:
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతిని సైఫ్ వేధించడం నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రీతి చాలా సెన్సిటివ్ అని వివరించారు. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడని, ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దని తన స్నేహితులకు చెప్పాడని శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని రంగనాథ్ నిర్ధారించారు. ప్రీతికి నేర్పించే క్రమంలో గట్టిగా చెబుతున్నానని సైఫ్ వాదిస్తున్నాడని, కానీ మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతూ వచ్చిందని వివరించారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేశామని.. దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు.
ప్రీతికి మంత్రి హరీశ్ పరామర్శ:
నిమ్స్ లో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. రెండు రోజుల జిల్లా పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు వచ్చిన మంత్రి నేరుగా నిమ్స్‌కు వెళ్లి ప్రీతి ఆరోగ్యంపై సమీక్ష నిర్వహించారు. ఆమెకు అందిస్తున్న వైద్యం గురించి, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్, చికిత్స అందిస్తున్న ప్రత్యేక వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు. అత్యుత్తమ వైద్యం అందించాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు.
ఎంసెట్, ఐసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ప్రవేశ పరీక్షల సమయం మొదలైంది. ఎంసెట్, పీజీఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రయ మార్చి 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28న పూర్తి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎంసెట్ అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు, పీజీఈసెట్ అభ్యర్థులు ఏఫ్రిల్ 30 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.
వేసవికి ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు దిశానిర్దేశం చేశారు. బస్టాండ్‌ల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు, కూలర్లు, బెంచిలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వేసవిలో ప్రయాణికులకు ఏర్పాట్లు, సంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్‌లోని బస్ భవన్ నుంచి ఆర్‌ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆన్‌లైన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు వటపత్ర శాయి అలంకార సేవలు జరిగాయి. వటపత్ర శాయి అలంకార సేవలో గవర్నర్ తమిళసై, కలెక్టర్ పమేల సత్పతి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జేబు సంస్థగా సింగరేణి
సింగరేణి రాష్ట్ర సర్కారుకు జేబు సంస్థగా మారిందని, ఆ సంస్థ గనులు సీఎం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సింగరేణిని కేసీఆర్ ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేయబోతోందన్నారు. కార్మికులకు నెలవారి జీతాలు ఇవ్వలేని స్థితికి సీఎం కేసీఆర్ తీసుకు వచ్చారని ధ్వజమెత్తారు. బీజేపీ పేరు చెప్పి సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే బట్టలూడతీసి కొడ్తం అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
ప్రారంభమైన బయో ఏషియా -2023 సదస్సు
తెలంగాణలో నైపుణ్యం గల సిబ్బందికి కొదవలేదని, తమ విజయం వెనుక తమ ఉద్యోగులదే కీలకపాత్ర అని నొవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎంతో సహకారం లభించిందని చెప్పారు. అద్భుత అవకాశాలకు కొలువైన తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు. 15 ఏండ్ల క్రితం ఇక్కడ వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని వచ్చామని, నేడు ఇక్కడి అవకాశాలు, ప్రభుత్వ సహకారంతో తమ కార్యకలాపాలను అనేక రెట్లు పెంచామని వెల్లడించారు. శుక్రవారం ప్రారంభమైన బయో ఏషియా -2023 సదస్సులో నరసింహన్ కీలకోపన్యాసం చేశారు. గత ఐదేండ్లలో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను రెట్టింపు చేశామని చెప్పారు.
కీచక ఉపాధ్యాయులపై కేసు
మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థినులను అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు ఉపాధ్యాయులు, పాఠశాల బస్సు డ్రైవర్ ఇలా ప్రవర్తిస్తుండడంతో విద్యార్థినులు తమ పేరెంట్స్ కు ఫిర్యాదు చేశారు. దీంతో శుక్రవారం పాఠశాలకు చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులపై దాడికి యత్నించారు. ఒక దశలో పాఠశాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. స్థానిక ఎస్సై ఝాన్సీ ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఉపాధ్యాయులు, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మరిపెడ సీఐ సాగర్ తెలిపారు. అంతకుముందు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు, జిల్లా ఛైల్డ్‌లైన్ విభాగం, ఐసీడీఎస్ అధికారులు పాఠశాలను సందర్శించి విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు.
వీధి కుక్కల దాడిలో మరో ఏడుగురికి గాయాలు
తెలంగాణలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీధి కుక్కల దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం ఉదయం ఇంటి గుమ్మం వద్ద ఆడుకుంటున్న జర్పుల భానుశ్రీ(17 నెలలు)పై వీధి కుక్క దాడి చేయడంతో ఎడమచేయిపై గాయమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో బొల్లె శరీష్మ(4) గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా రెండు కుక్కలు దాడి చేయడంతో తలపై గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌బజార్‌లో శుక్రవారం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. వాహనం అదుపు తప్పి కింద పడిన ఇద్దరిపై శునకాలు దాడి చేసి కాళ్లపై గాయపరిచాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం పదేళ్ల బాలుడు చెర్రిపై వీధి కుక్కలు దాడి చేయడంతో ఛాతీపై గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఇదే కాలనీకి చెందిన 11 ఏళ్ల తరుణ్, పదేళ్ల షేక్ షాహిన్ శునకాల దాడిలో గాయపడ్డారని కాలనీవాసులు తెలిపారు.