తెలంగాణలో ప్రధాని పోటీ చేసేది అక్కడి నుంచే?

తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ చేయడంపై బీజేపీ అగ్రనేతలు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న ఆ పార్టీ.. మోదీ పోటీ చేస్తే తమ లక్ష్యం సులువు అవుతోందని అంచనా వేస్తోంది. ఆ ప్రభావం చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాలపై సైతం పడుతుందని భావిస్తోంది. అయితే.. మోదీ మల్కాజ్ గిరి లేదా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. మల్కాజ్ గిరి దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు నివాసం ఉంటారు. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి నుంచి మోదీ పోటీ చేసే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇక్కడి నుంచి కాకుండే మహబూబ్ నగర్ నుంచి సైతం పోటీ చేసే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పాలమూరు జిల్లా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నిన్న వాఖ్యానించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.
19న ప్రధాని హైదరాబాద్ రాక
ఈనెల 19న హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలు ప్రారంభించనున్నారు. ఈ రైటు సికింద్రాబాద్ నుండి విజయవాడ మధ్య ప్రయాణించనుంది. అదే రోజున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అధికారికంగా ప్రధాని పర్యటన వివరాలు ఇంకా వెల్లడించలేదు.
నాగాలాండ్ లో బీఆర్ఎస్ పోటీ..

నాగాలాండ్‌లో వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని నాగాలాండ్ ఎన్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వై. సులంతుంగ్ హెచ్ లోథా స్పష్టం చేశారు. ఈ విషయమై శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో లోథా భేటీ అయ్యారు. విద్యార్థి నాయకుడిగా ఎదిగిన లోథా ప్రస్తుతం ఎన్సీపీ నాగాలాండ్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
అభ్యర్థులకు TSPSC హెచ్చరిక

తెలంగాణలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తామంటూ ఎవరైనా దళారులు సంప్రదిస్తే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొంతమంది మెరిట్ లిస్ట్ ల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపింది. అసలు మెరిట్ లిస్ట్ విధానమే లేదని స్పష్టం చేసింది. కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ నియామక పత్రాన్ని అభ్యర్థులకు వ్యక్తిగతంగా పంపదని తెలిపింది. అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ సాగుతోందని వెల్లడించింది. దళారుల మాటలను నమ్మి మోసపోవద్దని అభ్యర్థులు సూచించింది. అప్డేట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.
తెలంగాణలో మరో కొత్త మండలం
తెలంగాణలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసింది కేసీఆర్ సర్కార్. జయశంకర్ జిల్లాలోని పల్లిగోరి మండలాన్ని ఏర్పాటుకు శనివారం రెవెన్యూ శాఖ ప్రాథమిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 8 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. అభ్యంతరాలను 15వ రోజుల్లో తెలపాలని సూచించింది. ఈ కొత్త మండలంతో తెలంగాణలో మొత్తం మండలాల సంఖ్య 595కు చేరింది.
ప్రముఖ తెలుగు దర్శకుడికి ప్రమాదం

ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు సురేందర్‌రెడ్డి కాలికి గాయమైంది. అక్కినేని అఖిల్ హీరోగా ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘ఏజెంట్’ సినిమా షూటింగ్ సమయంలో ఓ ఇనుప చువ్వ ప్రమాదవశాత్తు ఆయన కాలికి బలంగా తగలడంతో గాయమైంది. దీంతో ఆయనను వెంటే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్న నిశ్చయంతో ఉన్న సురేందర్ రెడ్డి కట్టుతోనే షూటింగ్ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో కుప్పకూలిన భవనం

హైదరాబాద్ లోని కూకల్ పల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం కూలడంతో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. కూకట్ పల్లికి చెందిన ఓ వ్యక్తి 200 చదరపు అడుగుల స్థలంలో స్టిల్ట్+4 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. అయితే స్టిల్ట్+2 కే అనుమతులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం చివరి రెండు అంతస్థుల శ్లాబు పనులను సెవెన్ హిల్స్ అనే రెడీ మిక్స్ సంస్థ ఆధ్వర్యంలో చేశారు. స్లాబ్ పూర్తయిన తర్వాత అప్పడే వేసిన స్లాబ్ కూలింది. ఆ ప్రమాదంలో యూపీకి చెందిన ఆనంద్ కుమార్, దయా శంకర్ ప్రాణాలు కోల్పోయారు.
టోల్‌ప్లాజాల్లో ఆర్టీసీ సంక్రాంతి బస్సులకు స్పెషల్ లైన్

పండుగల సందర్భంగా టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ లు అవుతూ ఉండే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ అధికారులు టోల్‌ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, టోల్‌ప్లాజా నిర్వాహకులను కోరగా.. వారు అంగీకరించారు. ఈ నెల 10 నుంచి 14 వరకు హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-నిజామాబాద్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-సిద్దిపేట తదితర జాతీయ రహదారుల్లోని టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక మార్గ సదుపాయం అందుబాటులో ఉంటుందని టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ప్రత్యేక బస్సుల పర్యవేక్షణకు హైదరాబాద్‌లోని బస్‌భవన్, ఎంజీబీఎస్ బస్‌స్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
టీడీపీ నెక్ట్స్ మీటింగ్ నిజామాబాద్ లో?

ఈ నెలాఖరులో లేదా ఫిబ్రవరిలో నిజామాబాద్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని తెలిపారు. శనివారం నిజామాబాద్ జిల్లా నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖమ్మం మీటింగ్ కు మించి భారీ ఎత్తున నిజామాబాద్ సభను సక్సెస్ చేస్తామన్నారు.
ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు: బండి సంజయ్

ఆరు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల జీజేపీ పోలింగ్ బూత్ కమిటీల సమ్మేళనం శనివారం నిర్వహించారు. రాష్ట్ర కార్యాలయం నుంచి బండి సంజయ్ ఈ సమ్మేళనాన్ని ఉద్ధేశించి మాట్లాడారు. కష్టపడి పని చేస్తే వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని ఆయన దిశానిర్ధేశం చేశారు.
11న ఠాక్రే రాక..

తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంచార్జిగా నియమితులైన మాణిక్ రావు ఠాక్రే ఈ నెల 11న రాష్ట్రానికి రానున్నారు. రెండ్రోజుల పాటు ఆయన హైదరాబాద్ లో ఉండనున్నట్లు సమాచారం. ఇన్చార్జిగా నియమితుడైన తర్వాత ఆయన రాష్ట్రానికి తొలిసారి వస్తున్నారు. పార్టీ బలోపేతానికి, నాయకుల మధ్య సయోద్యకు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.