బిగ్ బ్రేకింగ్: కవితకు సమన్లు, అరెస్టుకు రంగం సిద్ధం? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. హోలీ రోజున విషాదాలు.. రేపు కరీంనగర్ లో కాంగ్రెస్ సభ.. ఎంపీ కోమటిరెడ్డిపై కేసు.. ఆ పరీక్ష తేదీ ప్రకటన.. నేటి టాప్ టెన్ న్యూస్ ఇవే..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిని ఈ నెల 9వ తేదీన నామినేషన్ వేయాల్సిందిగా కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను కేబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరో సారి సమాన్లు జారీ చేసింది. ఈ నెల 10న విచారణకు ఢిల్లీకి రావాలని నోటీసుల్లో పేర్కొంది. చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం ఈ నెల 10న కవిత ఢిల్లీలో దీక్ష చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే.. ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో కవిత అరెస్టు సైతం జరిగే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మహిళా జర్నలిస్టులకు కేటీఆర్ గుడ్ న్యూస్

మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్‌ మహిళా పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అక్రిడేషన్ కలిగిన ప్రతి మహిళా జర్నలిస్ట్‌ కోసం హెల్త్ చెకప్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల్ని, ఆడవాళ్లను గౌరవించాల్సిన బాధ్యతను పాత్రికేయులే తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. మహిళా పాత్రికేయులంతా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాత్రికేయ రంగంలో రిపోర్టర్‌లు, యాంకర్‌లు, న్యూస్‌ ప్రెజెంటర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని మంత్రి కేటీఆర్ అభినందించి సన్మానించారు. హానరింగ్ విమెన్ ఇన్ జర్నలిజం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

ఢిల్లీ మద్యం కేసులో అరుణ్ పిళ్లై అరెస్ట్

ఢిల్లీ మద్యం కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అరుణ్ పిళ్లైని అరెస్టు చేసింది. ఎమ్మెల్సీ కవితకు ఆయన బినామీ అంటూ ఆరోపించింది. ఈ వ్యవహారంలో మొత్తం రూ.296 అక్రమార్జన చోటు చేసుకుందని తెలిపింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని వెల్లడించింది. ఇంకా రిమాండ్ రిపోర్ట్ లో పలు అభియోగాలను నమోదు చేసింది ఈడీ. రుణ్ రామచంద్ర పిళ్లైకి కోర్టు ఈనెల 13 వరకు కస్టడీకి అనుమతి ఇచ్చింది. పిళ్లై అరెస్టుతో తర్వాత కవిత అరెస్టు ఉండొచ్చన్న ఊహాగానాలో జోరుగా వినిపిస్తున్నాయి.

బండి సంజయ్ సంచలన ఆరోపణలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాల్లేకుండా 27 వేలకుపైగా బర్త్, 4 వేలకుపైగా డెత్ సర్టిఫికెట్లను జారీ చేయడం వెనుక ఆశ్యర్యం, ఆందోళన కలిగించే అంశమని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. జారీ చేసిన బర్త్, డెత్ సర్టిఫికెట్లలో ఎక్కువగా పాతబస్తీలోనే బయటపడటం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశమన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అంతులేని అవినీతికి ఇది నిదర్శనమని ధ్వజమెత్తారు. దీనికంతటికి మొదటి ముద్దాయి సీఎం కేసీఆరే అని ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బర్త్ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాస్ పోర్టులు పొంది, హైదరాబాద్ లో అడుగుపెట్టి పాతబస్తీని అడ్డగా మార్చి దేశంలో అల్లర్లు స్రుష్టించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నారు.

హోలీ పూట విషాదం

హోలీ పండుగ రోజున విషాదం చోటు చేసుకుంది. హోలీ సంబరాలు చేసుకుని స్నానానికి అలుగునూర్ మానేర్ వాగులోకి వచ్చిన యువకులు రివర్ ఫ్రంట్ కోసం తీసిన గుంతలో పడి ప్రాణాలు కోల్పోయారు. వీరు ఒంగోలు జిల్లా చీమకుర్తి మండలానికి చెందినవారిగా గుర్తించారు. వీరి తల్లిదండ్రులు కరీంనగర్ కు వచ్చిన వలసకూలీలను అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో వీరాంజనేయులు(16), సంతోష్(13), అనిల్(14) ఉన్నారు.

రంగు పోశాడని పెట్రోల్ చల్లి నిప్పు

ఉమ్మడి మెదక్ జిల్లాలో జరిగిన హోలీ సంబరాలు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోయడానికి కారణమయ్యాయి. రేగోడ్ మండలం మర్పల్లి సరదాగా హోలీ ఆడుతున్న ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. షబ్బీర్ పై రంగు పోసేందుకు అంజయ్య అనే వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహంతో నాపై రంగు పోస్తావా అంటూ పెట్రోల్ తో అంజయ్య కు షబ్బీర్ నిప్పు అంటించాడు. అంజయ్య పరిస్థితి విషమంగా మారడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

నిమ్స్ ఆస్పత్రి రికార్డు

ప్రఖ్యాత హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి మరో జాతీయ రికార్డు సృష్టించింది. ఈఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆసుప‌త్రిగా నిమ్స్ జాతీయ రికార్డు సాధించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు నిమ్స్‌ యూరాలజీ విభాగాన్ని అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర‌కు అవయవ మార్పిడి సర్జరీలను ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రేపు కరీంనగర్ లో కాంగ్రెస్ సభ

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఈ నెల 9న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్​లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ సభకు చత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి ‘యాత్ర ఫర్ చేంజ్’ పాదయాత్రలో భాగంగా ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు పోలీసులు 23 షరతులతో కూడిన పర్మిషన్​ఇచ్చారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహించుకునే అవకాశం ఇచ్చారు. సభకు 50 వేల మందికి అనుమతినివ్వాలని పార్టీ నేతలు కోరగా.. సిటీ ఏసీపీ మాత్రం కేవలం 15 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదైంది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు నల్గొండలో పోలీసులు ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. చెరుకు సుధాకర్, ఆయన కుమారుడిపై వెంకట్ రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యల కాల్ రికార్డులు ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందేజ

టీఎస్ సెట్ పరీక్ష తేదీలు ప్రకటన

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2022 పరీక్ష తేదీలను అధికారులు రీషెడ్యూల్ చేశారు. ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంకా.. 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎగ్జామ్స్ ను మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీఎస్ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ సి. మురళీకృష్ణ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్ హాల్ టికెట్లను మార్చి 10 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here