కవితకు నోటీసులు.. అరెస్ట్ తప్పదా?
ఢిల్లీ మధ్యం కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవితకు బుధవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న ఢిల్లీలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. అయితే.. ముందస్తు కార్యక్రమాల కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాసింది. ఈ నెల 11 న విచారణకు హాజరవుతానని తెలిపింది. ముందస్తు అపాయింట్మెంట్లు మరియు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేమని తేల్చి చెప్పారు. అయితే.. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అరుణ్ రామచంద్రపిళ్లై అరెస్టు అయిన నేపథ్యంలో కవిత కూడా అరెస్ట్ అవుతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఎల్లుండి విచారణకు రండి.. కవితకు ఈడీ రిప్లై
ఈ నెల 10న విచారణకు రాలేనంటూ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖకు ఈడీ సమాధానం ఇచ్చింది. 11 వ తారీకు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు నేషనల్ మీడియాతో కవిత మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఆమె నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.
కేంద్రానికి తలవంచం
చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇలాంటి చర్యల వల్ల కేంద్రానికి తలవంచేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంపై పోరాడుతున్న సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత ఈ ప్రకటన విడుదల చేశారు. అయితే.. నిన్న కవిత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈడీ నుంచి స్పందన రాకపోవడంతోనే ఆమె ఢిల్లీకి వెళ్లారన్న ప్రచారం సాగుతోంది.
నేడు కేబినెట్.. రేపు పార్టీ మీటింగ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ రేపు పార్టీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపు ఉదయం పది గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశానికి రావాలని పార్టీ ఆదేశించింది. నేడు తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుండటం.. ఎల్లుండి బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తుండటంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న అంశం ఉత్కంఠగా మారింది.
ప్రీతి కుటుంబానికి కేటీఆర్ పరామర్శ
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబాన్ని మంత్రులు కేటీఆర్, దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని ఈ సందర్భంగా వారు అన్నారు. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడతామని, ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుని అండగా ఉంటామని మంత్రులు హామీ ఇచ్చారు. కేటీఆర్ వరంగల్ సీపీ రంగనాధ్ తో ఫోన్లో మాట్లాడి కేసు విచారణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్
వనపర్తి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి, మంత్రి నిరంజన్ రెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్ ఇచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి బీఆర్‌ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనతో పాటు వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి, పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి సాగర్, మాజీ జడ్పీటీసీ రమేశ్ గౌడ్, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు సత్యారెడ్డి, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, సింగిల్‌విండో అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు తదితరులు కూడా పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. అయితే వారు తమ పదవులకు రాజీనామా చేస్తారా? అన్న అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
నేడు కాంగ్రెస్ సభ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా గురువారం సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బగేల్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పార్టీ ఇతర ముఖ్య నాయకులు ఈ సభలో పాల్గొననున్నారు.
హైకమాండ్ వద్దకు కోమటిరెడ్డి వ్యవహారం
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ చేసిన ఫిర్యాదు ఏఐసీసీ కోర్టుకు చేరింది. ఈ ఫిర్యాదును ఏఐసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీకి టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ సిఫారసు చేసింది. దీంతోపాటు ఇతర ఫిర్యాదులపైనా సమీక్షించేందుకు కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి, సభ్యులు శ్యాంమోహన్, గడ్డం వినోద్, కమలాకర్‌లు బుధవారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో చిన్నారెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై చెరుకు సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించామని, తనను చంపుతానని కోమటిరెడ్డి బెదిరించినట్లుగా సుధాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. కోమటిరెడ్డి ఎంపీ, ఏఐసీసీ సభ్యుడూకావడంతో ఆయనపై చర్యలు తీసుకునే అధికారం టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీకి లేదని, అందుకే కోమటిరెడ్డిపై సుధాకర్ ఫిర్యాదును ఏఐసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీకి సిఫారసు చేసినట్లు తెలిపారు.
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన హరీశ్
కరీంనగర్ లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అక్క చెల్లెల్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు కార్యక్రమాలను కానుకగా మీకు ఈరోజు ఇచ్చారన్నారు. ఒకటి ఆరోగ్య మహిళ, రెండు న్యూట్రీషన్ కిట్స్, మూడోది రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు. మహిళలు ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. వాటికి పరిష్కారంగా ఆరోగ్య మహిళ ప్రారంభించామన్నారు.