ఈ నెల 9న కేబినెట్ మీటింగ్..
ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో సొంత స్థలం కలిగిన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆ రోజు ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన సైతం విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇంకా పలు అంశాలను కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పీఆర్సీ, ధాన్యం కొనుగోళ్ల అంశంపై సైతం చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహిళల కోసం కొత్త స్కీమ్
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం సీఎం సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలపై వైద్యారోగ్య శాఖ ఫోకస్ పెట్టింది. ప్రతీ మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ హెల్త్ స్కీమ్ తీసుకొస్తుంది. ప్రతీ మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందించబోతుంది. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలు ప్రవేశ పెట్టనున్నారు మొత్తం 1200 పీహెచ్ సి, యూపిహెచ్‌సీ, బస్తి దావాఖనా కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు.
మంత్రి కేటీఆర్ పై రేవంత్ తీవ్ర విమర్శలు
మంత్రి కేటీఆర్ అవినీతికి కేరాఫ్ కాళేశ్వరం 9 వ ప్యాకేజీ పనులని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన పాదయాత్రంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ఉద్యమ కారుడైతే వందల ఎకరాల భూములు, పత్రికలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అమెరికాలో బాత్రూంలు కడిగే కేటీఆర్ ..ఉద్యమ కారుడు ఎలా అవుతారని అన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబాలకు బుక్కెడు తిండి పెట్టలేదు కానీ..పార్టీ ఫిరాయించిన సన్నాసులకు పదవులిచ్చారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేటీఆర్ కుటుంబ సభ్యులైతే..పేద ప్రజలను ప్రగతి భవన్ లోకి రానిచ్చి వారి సమస్యలు వినాలని సూచించారు.
రేవంత్ కాన్వాయ్ కు ప్రమాదం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓవర్ స్పీడ్‌తో ఆరు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో నేతలకు ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ దగ్గర ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బీఆర్ఎస్ కు బండి సంజయ్ కొత్త అర్థం..
రానున్న ఎన్నికల్లో పిట్టల రాయుడు ముఖ్యమంత్రిని పదవి నుంచి పీకి పారేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ బిడ్డ కవిత చేసిన మద్యం దందా వల్ల తెలంగాణ ఇజ్జత్ పోతోందన్నారు. బీఆర్‌ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సమితి అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాక, ఆదిలాబాద్‌లో పచ్చజెండా ఎగురవేయాలని ఎంఐఎం నేతలకు సవాలు విసిరారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్య ఘటనపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్‌లో శనివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ కు షాక్?
ఉద్యమ టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ గా మారినా.. తెలంగాణ ప్రజల నోళ్లలో టీఆర్ఎస్ పేరు ఇప్పటికీ నానుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని మాజీ ప్రతినిధులు, అసంతృప్తి నాయకులూ, ఉద్యమ సమయం నుండి పార్టీలో ఉంటూ రాజకీయంగా అవకాశాలు రాని వారంతా ఒక్కటై పార్టీ పెట్టాలని భావిస్తున్నారట. ఇందులో ముఖ్యంగా 4 జిల్లాలకు చెందిన నేతలు ఉన్నట్టు సమాచారం. తమకున్న ప్రజాబలం, టీఆర్ఎస్ పేరుతో ఎన్నికల్లో కీలకం కావాలని వీళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే.. ఈ ప్రత్యత్నం కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
హైదరాబాద్ లో 3 రోజుల పాటు నీటి సరఫరా బంద్
హైదరాబాద్ శివారులోని షాపూర్, చింతల్, జీడిమెట్ల, వాణి కెమికల్స్, గాజుల రామారం, జగద్గిరిగుట్ట, సూరారం, మల్కాజిగిరి డిఫెన్స్ కాలనీ, దమ్మాయిగూడ, నాగారం, కొంపల్లి, కీసర, బొల్లారం, గుండ్ల పోచంపల్లి, ఘన్‌పూర్ (మేడ్చల్/శామీర్‌పేట), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్, తుర్కపల్లి బయోటెక్ పార్కు, కాప్రా మున్సిపాలిటీ పరిధితో పాటు కొండపాక, ప్రజ్ఞాపూర్, ఆలేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వద్ద రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండపాక నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు సరఫరా చేస్తున్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపులైన్‌ను పక్కకు మార్చనున్నారు. దీంతో మార్చి 8 నుంచి 10వ తేదీ వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జలమండలి అధికారులు వెల్లడించారు. మార్చి 8న ఉదయం 6 గంటల నుంచి 10 అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 66 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
ధరణితో పేదల నోట్లో మట్టి
తెలంగాణలో ధరణి వచ్చాక పేదల నోట్లో మట్టి పడిందని, వారికి చీకటే మిగిలిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వ అవసరాలకు అసైన్డ్ భూములు లాక్కుంటున్నారని, ల్యాండ్ బ్రోకర్‌గా సర్కారు వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన గ్లోబల్ ఇన్ఫామ్ మాదిగ అల్లైడ్ కాస్ట్ జాతీయ సమావేశానికి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈసారి మహాత్మగాంధీ యూనివర్సిటీ ఈ ఎంట్రన్స్ నిర్వహిస్తుంది. మే 18న ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 6వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ తో పాటు రూ.750 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఏప్రిల్ 20వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నిర్ణయించారు. లేట్ ఫీతో ఏప్రిల్ 25వ తేదీ వరకు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మే 5వ తేదీ నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
ఆ పరీక్ష వాయిదా
తెలంగాణ స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (తెలంగాణ సెట్) TS SET 2022 పరీక్ష వాయిదా పడింది. ఈనెల మార్చి 13న జరగాల్సిన సెట్ పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్‌సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆ రోజు జరిగే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. షెడ్యూలు ప్రకారం మార్చి 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. మార్చి 10 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు తమ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.