పేదలపై తెలంగాణ కేబినెట్ వరాలు.. ఢిల్లీలో కవిత ప్రెస్ మీట్.. బీజేపీ అంతు చూస్తామన్న కేటీఆర్.. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు ఎప్పటినుంచంటే?.. హైదారాాబాద్ లో ఈ రూట్లో 3 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు.. నేటి టాప్ న్యూస్ ఇవే..

తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు

తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. గృహలక్ష్మి పథకం కింద రూ.3లక్షల చొప్పున 4 లక్షల మందికి సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్ల రుణాలు రూ.4 వేల కోట్లను మాఫీ చేయనున్నట్లు తెలిపింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు కటాఫ్ 2020కి పొడిగించింది. 1.55 లక్షల మందికి పోడు భూములను పంపిణీ చేయనుంది. ఇంకా దళిత బంధు పథకం కింద రెండో విడతలో 1.30 లక్షల మందిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇంకా కాశీ, శబరిమలలో భక్తుల కోసం రూ.50 కోట్లతో వసతీ గృహాలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది.

ఈడీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తా: కవిత

ఈడీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సత్యం, న్యాయం, ధర్మం తమవైపే ఉన్నాయన్నారు. ఢిల్లీలో గురువారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళల రిజర్వేషన్‌ బిల్లు కోసం గత 27 ఏళ్లుగా పోరాటం జరుగుతోందన్నారు. 2014లో అధికారంలోకి వస్తే బిల్లు తెస్తామని మోదీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. మహిళా బిల్లు కోసమే జంతర్‌మంతర్ దగ్గర ఈ రోజు భారత జాగృతి పోరాటం చేయనుంది. రేపు కవితను ఈడీ విచారించనున్న విషయం తెలిసిందే.

ప్రజాక్షేత్రంలో బీజేపీ అంతుచూస్తాం: కేటీఆర్

కవితకు వచ్చినవి ఈడీ సమన్లు కావు.. మోదీవని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇది చిల్లర రాజకీయ ప్రయత్నమని ఆరోపించారు. తమకు విచారణ ఎదుర్కునే దమ్ము ఉందన్నారు. ప్రజాక్షేత్రంలో బీజేపీ అంతుచూస్తామన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో విచారణకు హాజరయ్యే దమ్ము బీఎల్ సంతోష్ కు ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. నిన్న తెలంగాణ భవన్ లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలలో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

కవిత దీక్ష సిగ్గుచేటు: కోదండరాం

కవిత ఈడీ నోటీసుల అంశం తెలంగాణకు ముడిపెట్టడం అధికార మదం, అహంకారానికి నిదర్శనమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ మండిపడ్డారు. సారాయి వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేసిన కవిత.. మహిళా బిల్లుపై జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ హమీలను ప్రకటించిన రేవంత్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పేద రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా గురువారం కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోని పద్మా నగర్ బైపాస్ రోడ్ నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన కరీంనగర్ కవాతు పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. గుజరాత్ మోడల్ కావాలో.. ఛత్తీస్‌గఢ్ మోడల్ కావాలో విజ్ఞులు ఆలోచించాలని కోరారు.

43 మంది విద్యార్థినులకు అస్వస్థత:

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 43 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారికి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొన్న రాత్రి నుంచే విద్యార్థులు అస్వస్థతకు గురైనా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం బయటకు పొక్కకుండా డాక్టర్ల ను కస్తూర్భా పాఠశాలలోనే పిలిచి సీక్రెట్ గా వైద్యం అందించే ప్రయత్నం చేశారని సమాచారం. విషయం బయటకు రావడంతో హుటాహుటిన రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

తెలంగాణలో 15 నుంచి ఒంటి పూట బడులు

తెలంగాణలో ఒంటి పూట బడులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ప్రతిరోజూ ఉదయం 7.45 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. వేసవి నేపథ్యంలో అన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది. ఇంకా ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ వేసవి సెలవులు ఉంటాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది.

హైదరాబాద్ లోని ఈ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఇందిరా పార్క్‌ నుంచి వీఎస్టీ వరకు స్టీల్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ మీదుగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ద్వారా ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది.ఇందులో భాగంగానే మూడు నెల‌ల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రక‌టించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని వెల్లడించారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహ‌న‌దారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

ఈ నెల 13న కృష్ణా బోర్డు భేటీ

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చెందిన త్రీమెంబర్‌ కమిటీ ఈ నెల 13న సమావేశం కానుంది. ఉమ్మడి జలాశయాల్లో (శ్రీశైలం, నాగార్జునసాగర్‌) వాటాకు మించి ఏపీ నీటిని తరలిస్తోందని తెలంగాణ ఇటీవలే కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసింది. 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here