అలాంటి వారికి టికెట్లు ఇవ్వం: కేసీఆర్.. ముందస్తు ఎన్నికలపై సీఎం క్లారిటీ.. బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్.. టెన్షన్.., నేడే కవిత విచారణ.. అప్పటి వరకు పోరాటం ఆపేదిలేదన్న కవిత.. నేడు హైదరాబాద్ కు అమిత్ షా.. 26 ఏళ్ల ఐటీ ఉద్యోగికి గుండెపోటు.. నేటి టాప్ న్యూస్ ఇవే

సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తాం

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ శుభవార్త చెప్పారు. సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేస్తే మాత్రం అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడొద్దని సూచించారు. అవినీతికి పాల్పడొద్దని.. ప్రజల్లో ఉండాలని దిశానిర్ధేశం చేశారు. ఇంకా ముందస్తు ఎన్నికల ఊహాగానాలపై సైతం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తేల్చిచెప్పారు. నిన్న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ వాఖ్యలు చేశారు.

కావాలనే వేధింపులు: కవిత అంశంపై కేసీఆర్ స్పందన

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు, విచారణ అంశంపై సైతం సీఎం కేసీఆర్ స్పందించారు. కేంద్రం కావాలనే ప్రతిపక్షాల నేతలను వేధిస్తోందని మండిపడ్డారు. గతంలో మంత్రులు గంగుల, తలసాని, మల్లారెడ్డిపై దాడులు చేశారని గుర్తు చేశారు. ఈ సారి కవితకు ఇచ్చారని.. ఏం చేస్తారో చేయనివ్వండి చూద్దామని కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో వాఖ్యానించారు. ఈ అంశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయపరంగా ఎదుర్కొందామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడే ప్రసక్తే లేదాన్నారు.

చట్టం చేసే వరకు పోరాటం: ఎమ్మెల్సీ కవిత

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం చట్టం చేసే వరకూ తన పోరాటం ఆగదని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈనెల 13న ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో ఆమె శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరాహార దీక్ష చేసిన ఆమె.. సోమవారం (13వ తేదీ) నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలను కోరారు.

నేడే కవిత విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు హాజరుకానున్నారు. ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ హెడ్ ఆఫీసుకు ఉదయం 10:30 గంటల వరకు ఆమె చేరుకోనున్నారు. 11 గంటలకు కవితను అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే.. విచారణ తర్వాత కవిత అరెస్ట్ తప్పదన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఈ అంశంపై టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రులు, ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై వివరాలను సేకరిస్తున్నారు. కవితను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ భారీ నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం ఉంది.

నేడు హైదరాబాద్ కు అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా నేడు హైదరాబాద్​ రానున్నారు. శనివారం సాయంత్రం 6:15కు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్‌‌‌‌ జిల్లా హకీంపేట్‌‌‌‌లోని నేషనల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ సెక్యూరిటీ అకాడమీ(ఎన్‌‌‌‌ఐఎస్‌‌‌‌ఏ)కి వచ్చి.. రాత్రి అక్కడే బస చేస్తారు. రాత్రి 9.30కు అధికారులతో భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.16 వరకు సెంట్రల్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌) 54వ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా నిర్వహించే రైజింగ్‌‌‌‌ డే పరేడ్‌‌‌‌లో ఆయన పాల్గొంటారు. తర్వాత 11.45 గంటలకు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి కేరళ వెళ్తారు. శనివారం రాత్రి 9:30కు, ఆదివారం ఉదయం 9:30 నుంచి 11:30 మధ్య బీజేపీ రాష్ట్ర నేతలతో అమిత్​షా సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం.

కవితపై షర్మిల విమర్శలు

లిక్కర్ స్కామ్​లో అరెస్ట్ అవుతారనే భయంతోనే ఢిల్లీలో మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత దీక్షకు దిగారని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. శుక్రవారం లోటస్ పాండ్ లో మీడియాతో షర్మిల మాట్లాడారు. తాజా పరిణామాలను చూస్తుంటే ఈ కుంభకోణంలో కవిత పాత్ర కూడా ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ స్కామ్​ జరిగిన తీరుపై ఏనాడూ చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ లో 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంత మంది మహిళలకు టికెట్లు ఇచ్చారని ఆమె ప్రశ్నించారు. క్యాబినెట్ లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు.

100 రోజుల్లో ధరణి సమస్యల పరిష్కారం

ధరణిలో తప్పుల సవరణకు రైతులు రూ.1,200 కట్టాల్సి వస్తున్నదని, ఎన్నిసార్లు చార్జీలు చెల్లించి రిక్వెస్టులు పెట్టుకున్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్​పూర్​లో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధరణిపై నిర్వహించిన అదాలత్​లో రేవంత్ మాట్లాడారు. ఇదివరకు గ్రామానికి 20 సమస్యలు ఉంటే.. కేసీఆర్ తెచ్చిన ధరణితో ఊరికి 200 దాకా పెరిగాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ధరణి సమస్యలను పరిష్కరించి, ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామన్నారు.

ఎంపీ కోమటిరెడ్డిపై ఫిర్యాదు

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి తమ కుటుంబానికి భద్రత కల్పించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌ మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. తనను, తన తండ్రిని చంపుతానంటూ కోమటిరెడ్డి బెదిరించారన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 5న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఫోన్‌ చేసి నన్ను, మా నాన్నను చంపడం కోసం 100 కార్లలో తన మనుషులు తిరుగుతున్నారని, నల్లగొండలోని మా ఆసుపత్రిని కూల్చివేస్తామని బెదిరించారు’’ అని చెప్పారు.

కవిత ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలి: బండి సంజయ్

ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస బీజేపీ భరోసా పేరుతో చేపట్టిన దీక్షలో సంజయ్ మాట్లాడుతూ.. లిక్కర్ కేసు నుంచి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని ఆరోపించారు. సీఎం ఇంటి ముందు కవిత ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానిస్తున్నారన్నారు.

గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి

గుండెపోటుతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతిచెందాడు. ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగరుబు(బుచ్చిరెడ్డిపాలెం) గ్రామానికి చెందిన కొట్టే మురళీకృష్ణ(26) హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లిన మురళికృష్ణకు థియేటర్‌లోనే గుండెపోటు వచ్చింది. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. .

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here